Cinema News: వెండితెరపై ‘గాంధీ’గిరి

గాంధీ అంటే ఓ వ్యక్తి కాదు.. మహత్తర శక్తి.  ఆచరణీయమైన అపురూప జీవన విధానం. అహింసా మార్గంలో స్వాతంత్య్రం సముపార్జించి పెట్టి.. ప్రపంచానికి సరికొత్త యుద్ధతంత్రం నేర్పిన సత్యాగ్రహ సేనాని....

Published : 02 Oct 2021 11:37 IST

గాంధీ అంటే ఓ వ్యక్తి కాదు.. మహత్తర శక్తి.  ఆచరణీయమైన అపురూప జీవన విధానం. అహింసా మార్గంలో స్వాతంత్య్రం సముపార్జించి పెట్టి.. ప్రపంచానికి సరికొత్త యుద్ధతంత్రం నేర్పిన సత్యాగ్రహ సేనాని. జీవితాన్నే ప్రయోగశాలగా మార్చుకుని సత్యశోధన చేసిన మహా జ్ఞాని. సర్వ జన హితమే నా మతమన్న పావన మూర్తి. ఆయన నడిచిన మార్గం.. ఆదర్శనీయమైన వ్యక్తిత్వం ప్రపంచానికి ఓ స్ఫూర్తి పాఠమైంది. అదే ఆయన్ని అందరి మదిలో మహాత్ముడిగా మార్చింది. యావత్‌ ప్రపంచానికి ఆదర్శనీయంగా నిలిచిన గాంధీ జీవితం.. ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వం.. వెండితెరపై ఎన్నోసార్లు కథా వస్తువుగానూ కాంతులీనింది. గాంధీ జయంతి సందర్భంగా ఆ సినీ విశేషాలు మీకోసం..

గాంధీజీ తన జీవిత కాలంలో రెండే చిత్రాలు చూశారు. వాటిలో ఒకటి మైకేల్‌ కర్టిజ్‌ తీసిన ‘మిషన్‌ టు మాస్కో’ (1943) అనే రష్యన్‌ సినిమా. మరొకటి విజయ్‌ భట్‌ తెరకెక్కించిన ‘రామరాజ్య’ (1943). 1944లో గాంధీ మలేరియాతో బాధపడుతున్న సమయంలో ముంబయిలో ప్రత్యేక ప్రదర్శన ద్వారా ఈ చిత్రాల్ని వీక్షించారు.

‘గాంధీ’ గొప్పతనానికి ఆస్కార్‌ పట్టాభిషేకం

మహాత్మ గాంధీ కథతో.. ఆయన సిద్ధాంతాలతో వెండి   తెరపై ఎన్నో కథలొచ్చినా.. సినీ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమా 1982లో వచ్చిన ‘గాంధీ’నే. ఏ బ్రిటిష్‌ వారిపై బాపూజీ తన పోరాటాన్ని  సాగించారో.. వాళ్లే ఆయన మహనీయతను తెరపై ఆవిష్కరించుకుని పులకించిపోవడం విశేషం. గాంధీజీ జీవనయాత్రకు తెర రూపమైన ఈ సినిమాని బ్రిటిష్‌ దర్శకుడు రిచర్డ్‌     అటెన్‌బరో తెరకెక్కించారు. మహాత్ముడి పాత్రను బ్రిటిష్‌ నటుడు బెన్‌ కింగ్స్‌లే పోషించారు. 1893లో యువ గాంధీని దక్షిణాఫ్రికాలో రైలు నుంచి గెంటివేసిన దగ్గర్నుంచి.. 1948లో గాంధీ మరణించే వరకు ఆయన జీవితంలోని ప్రతి ఘట్టాన్నీ ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు అటెన్‌బరో. ఈ  సినిమాకి భారతీయులతో పాటు ప్రపంచ సినీప్రియులు నీరాజనాలు పట్టారు. గాంధీజీ మహోన్నతమైన జీవన విధానం అందరి మనసులను హత్తుకోవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. ప్రేక్షకులే కాదు.. ఆస్కార్‌ పురస్కారాలు సైతం ‘గాంధీ’ గొప్పతనానికి ప్రపంచ వేదికపై పట్టంకట్టాయి. ఈ చిత్రం ఆ ఏడాది ఆస్కార్‌ పురస్కారాల్లో 11   నామినేషన్లకు గానూ.. ఏకంగా 8 ఆస్కార్‌ అవార్డులు అందుకుని సత్తా చాటింది.

శ్యామ్‌ బెనగల్‌.. ‘మహాత్మ’..

గాంధీ జీవన ప్రయాణం అనగానే అందరికీ దక్షిణాఫ్రికా రైలులో ఆయనకు జరిగిన అవమానం.. అక్కడి నుంచి స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన పోరాటాలే గుర్తొస్తాయి. అటెన్‌బరో తన ‘గాంధీ’ చిత్రంలో చూపించింది ఈ కథే. మరి నిజానికి గాంధీజీ స్వభావం అలా రూపుదిద్దుకోవడానికి మూలమేంటి? ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది? అన్నది ‘ది మేకింగ్‌ ఆఫ్‌ ది మహాత్మ’ చిత్రంతో వెండితెరపై చూపించారు ప్రముఖ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌. ఫాతిమా మీర్‌ రాసిన ‘ది అప్రంటిస్‌ షిప్‌ ఆఫ్‌ మహాత్మా’ పుస్తకం ఆధారంగా   బెనగల్‌ ఈ సినిమాని రూపొందించారు. రంజిత్‌ కపూర్‌ టైటిల్‌ పాత్రలో నటించిన ఈ సినిమా 1996లో విడుదలై బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాన్ని అందుకోవడమే కాక జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. ఈ చిత్రంలో బాపూజీగా నటించిన రంజిత్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కింది.

తెలుగు తెరపై గాంధీయిజం..

తెలుగులో గాంధీ నిజ జీవిత కథతో సినిమాలు రాకున్నా.. ఆయన సిద్ధాంతాలతో అల్లుకున్న కథలతో బాగానే వచ్చాయి. వీటిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది చిరంజీవి ‘శంకర్‌దాదా జిందాబాద్‌’, శ్రీకాంత్‌ ‘మహాత్మ’ చిత్రాలే. హిందీలో విజయవంతమైన ‘లగేరహో మున్నాభాయ్‌’కి రీమేక్‌గా ప్రభుదేవా తెరకెక్కించిన చిత్రమే ‘శంకర్‌దాదా జిందాబాద్‌’. హింసే  ఆయుధంగా జీవించే ఓ దాదా.. గాంధీ సిద్ధాంతాల స్ఫూర్తితో తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు? గాంధీగిరితో తన శత్రువులపై ఎలా విజయం సాధించాడన్నది ఈ సినిమాలో వినోదాత్మకంగా చూపించారు. చిరు దీంట్లో గాంధీ మార్గాన్ని అనుసరించే వ్యక్తిగా కనిపించి.. స్ఫూర్తి నింపారు. ఈ సినిమాలో ‘‘ఓ బాపు నువ్వే రావాలి.. నీ సాయం మళ్లీ కావాలి’’ అంటూ సాగే పాట ప్రేక్షకుల్ని భావోద్వేగానికి  గురిచేసింది. శ్రీకాంత్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ‘మహాత్మ’ చిత్రానికి గాంధీ సిద్ధాంతాలే స్ఫూర్తి. మహాత్ముడి    సుగుణాలు.. ఆయన స్ఫూర్తిదాయక జీవన విధానం.. ఓ బస్తీ రౌడీని ఎలా మార్చాయి. అతను మారి సమాజంలో ఎలాంటి మార్పులకు నాంది పలికాడన్నది సినిమాలో ఆసక్తికరంగా చూపించారు కృష్ణవంశీ. ఇందులో వినిపించిన ‘రఘుపతి రాఘవ రాజారాం’ గీతం గాంధీ గొప్పతనాన్ని చాటి చెప్పే పాటల్లో ప్రత్యేకంగా నిలిచింది.

గాంధీజీపై తీసిన పూర్తి నిడివున్న డాక్యుమెంటరీ.. 1940లో వచ్చిన ‘మహాత్మా గాంధీ’. ఏ.కే.చెట్టియార్‌ తెరకెక్కించారు. ఆయన అనేక ప్రాంతాలకు తిరిగి... ఎంతో పుటేజీ సేకరించి, 50వేల అడుగుల రీళ్లను ఎడిట్‌ చేసి ఈ డాక్యుమెంటరీ తయారు చేశారట. దీని నిడివి 1గంట 20 నిమిషాలు. దీని కన్నా ముందు బాపూజీపై బ్రిటిష్‌ పాథే ‘మహాత్మా గాంధీ టాక్స్‌’, ఎంజీఎం సంస్థ ‘గార్బో టాక్స్‌’ పేరుతో డాక్యుమెంటరీలు తీసుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని