Movie Ticket Rates: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా టికెట్‌ ధర ఎంతంటే..?

కరోనా కారణంగా గడిచిన రెండు సంవత్సరాల్లో సినీ ఎగ్జిబిటర్లు ఎంతో నష్టపోయారని తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ తెలిపింది. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి తెలంగాణ ప్రభుత్వం జీవో నం:120ని...

Published : 01 Jan 2022 01:32 IST

హైదరాబాద్‌: కరోనా కారణంగా గడిచిన రెండు సంవత్సరాల్లో సినీ ఎగ్జిబిటర్లు ఎంతో నష్టపోయారని తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ తెలిపింది. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి తెలంగాణ ప్రభుత్వం జీవో నం 120ని ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయమని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ప్రతినిధులు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. చిన్న సినిమాలకు తక్కువ ధరలోనే థియేటర్లు టికెట్లు అమ్మాలని తెలిపారు.

‘‘తెలంగాణ ప్రభుత్వం జీవో నం.120ని ప్రవేశపెట్టడం ఆనందించదగిన విషయం. ఎన్నో రోజులపాటు చర్చలు జరిపిన తర్వాత చిన్న, పెద్ద సినిమాలన్నీ లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే ఆ జీవోని ప్రవేశపెట్టారు. సినిమా టికెట్ ధరలు కూడా అందులోనే పొందుపరిచారు. చిన్న సినిమా టికెట్‌ ధరలు.. కనిష్ఠ ధర కంటే ఎక్కువగా గరిష్ఠ ధర కంటే తక్కువగా అమ్మాలని ప్రభుత్వం తెలిపింది. మధ్య స్థాయి సినిమాలు విడుదలైన రెండువారాల పాటు గరిష్ఠ ధరకు టికెట్‌లు అమ్మాలని.. ఆ తర్వాత దాన్ని కొంతవరకూ తగ్గించాలని సూచించింది. ఇక భారీ బడ్జెట్‌ చిత్రమైతే గరిష్ఠ ధరలో మూడువారాల పాటు టికెట్‌లు అమ్మి.. ఆ తర్వాత దాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది’’ అని ఫిలిం ఛాంబర్‌ సెక్రటరీ అనుపమ్‌ రెడ్డి తెలిపారు.

‘ఏషియన్‌’ సునీల్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమా టికెట్‌ ధరలు, థియేటర్‌ క్యాంటీన్‌లు ధరలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓటీటీకే తమ ఓటంటూ పలువురు నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాళ్లందరికీ మేం చెప్పేది ఒక్కటే. కరోనా కారణంగా రెండేళ్ల పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల కంటే ఎగ్జిబిటర్లే ఎక్కువగా నష్టపోయారు. మేమే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మా కష్టాలు అర్థం చేసుకుని మాకు కొంత అండగా ఉండేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ఆనందించదగ్గ విషయం. కానీ, ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కొంతమంది దుర్వినియోగం చేసుకుంటూ తమకు అనుగుణంగా సినిమా టికెట్‌ ధరలు నిర్ణయించుకున్నారని తెలిసింది. వాళ్లకు మేం ఫోన్‌ చేసి చెప్పాం. వాళ్లు కూడా రేపటి నుంచి ధరలు తగ్గిస్తారు. జీవో నిబంధనలకు అనుగుణంగా టికెట్‌ని అమ్ముతారు. ఇకపై చిన్న సినిమాలన్నింటికీ తక్కువ ధరలోనే టికెట్లు అందిస్తాం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సింగిల్‌ స్క్రీన్‌లో రూ.175,  మల్టీప్లెక్స్‌లో అయితే రూ.295 టికెట్‌ ధర ఉంటుంది. అన్ని థియేటర్లు తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని మేం ఇప్పటికే చెప్పాం. ఒకవేళ ఎవరైనా నిబంధనలు పాటించకపోతే ఆ థియేటర్‌ని సీల్‌ చేస్తామని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది’’ అని వివరించారు.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని