oscars 2023: ఆస్కార్‌ వేడుకలో ఈ కీలక మార్పు గమనించారా..!

ఆస్కార్‌ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే రెడ్‌ కార్పెట్‌ రంగును ఈ ఏడాది మార్చారు. షాంపైన్‌ రంగు కార్పెట్‌తో అతిథులకు స్వాగతం పలికారు.

Published : 13 Mar 2023 13:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని కోట్లమంది కలను నెరవేరుస్తూ విశ్వవేదికపై ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ తెలుగు చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) భారతీయులంతా గర్వపడేలా చేసింది. ఆస్కార్‌ వేడుక అనగానే అందరికీ గుర్తొచ్చే వాటిల్లో రెడ్‌ కార్పెట్‌ (red carpet) ఒకటి.  దీనిపై నడవడానికి ప్రముఖులు సైతం ఆసక్తి చూపుతారు. ఈ కార్పెట్‌ పై పోజులు ఇవ్వడానికి ప్రత్యేకమైన దుస్తులు వేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తారు. దీనిపై ఒక్కసారైనా నడవాలని నటీనటులంతా కోరుకుంటారు.

అంతటి ప్రాధాన్యం ఉన్న రెడ్‌ కార్పెట్‌ రంగు ఈ సంవత్సరం మార్చారు. 1961 నుంచి వస్తున్న ఈ రెడ్‌ కార్పెట్ సంప్రదాయానికి బ్రేక్‌ వేస్తూ ఈ సారి నిర్వాహకులు షాంపైన్‌ రంగు కార్పెట్‌తో అతిథులకు స్వాగతం పలికారు. దీనిపై నడుస్తూ సినీ తారలు సందడి చేశారు. 95వ ఆస్కార్‌ (Oscars 2023) వేడుకలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న జిమ్మీ కిమ్మెల్‌ రెడ్‌ కార్పెట్‌ రంగు మారడంపై తనదైన శైలిలో స్పందించారు. ‘‘గతేడాది జరిగిన ఆస్కార్‌ వేడుకల్లో క్రిస్‌ రాక్‌ను నటుడు విల్‌స్మిత్‌ చెంపదెబ్బ కొట్టడం వల్ల వేదికంతా ఎరుపెక్కింది. అందుకే ఈ ఏడాది ఇలా రంగు మార్చాలని నిర్ణయం తీసుకున్నారేమో. ఇకపై అలాంటి ఘటనలు జరగవు’’ అని అన్నారు. 

ఇక అంగరంగ వైభవంగా జరిగిన ఆస్కార్‌ వేడుకల్లో ప్రతి సంవత్సరం లాగానే ఎన్నో సినిమాలు పోటీ పడ్డాయి. వాటిలో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ (Everything Everywhere All at Once) సినిమా ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. భారత్‌ నుంచి ‘ది ఎలిఫింట్‌ విస్పరర్స్‌’ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో అవార్డు గెలుచుకోగా... ‘నాటు నాటు’ ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని