Tiger 3: టైగర్ల హంగామా

పంజా విసరడమే ఆలస్యం అంటున్నాడు ‘టైగర్‌ నాగేశ్వరరావు’. బాక్సాఫీస్‌ దగ్గర వేటకి సిద్ధం అవుతున్న అతని అసలు కథేమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Updated : 28 Sep 2023 14:06 IST

పంజా విసరడమే ఆలస్యం అంటున్నాడు ‘టైగర్‌ నాగేశ్వరరావు’. బాక్సాఫీస్‌ దగ్గర వేటకి సిద్ధం అవుతున్న అతని అసలు కథేమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రవితేజ కథానాయకుడిగా... అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. నుపూర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. రేణుదేశాయ్‌, అనుపమ్‌ ఖేర్‌ కీలకపాత్రలు పోషించారు. వంశీ దర్శకుడు. అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాత. అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ట్రైలర్‌ని అక్టోబరు 3న విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. పలు రాష్ట్రాల పోలీసులకి సవాల్‌ విసిరిన టైగర్‌ నాగేశ్వరరావు కథతో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది. ‘‘కథ కథనాలతోపాటు.. రవితేజ లుక్‌, ఆయన నటన థ్రిల్‌ని పంచుతాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు అంచనాల్ని పెంచాయి. అందుకు దీటుగా సినిమా ముస్తాబవుతోంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌, సంభాషణలు: శ్రీకాంత్‌ విస్సా, ఛాయాగ్రహణం: ఆర్‌.మది, ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్లా.

జనవరి 13న... ‘ఈగల్‌’:   పండగ తీసుకుని పదమూడున వస్తున్నాడంటూ ‘ఈగల్‌’ విడుదల తేదీని ప్రకటించింది నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాత. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది చిత్రబృందం.


‘నా అసలు పేరు అవినాష్‌ సింగ్‌ రాథోడ్‌. మరి మీ అందరికి నేను టైగర్‌ని. 20ఏళ్లుగా నా జీవితాన్ని ఇండియా సంరక్షణకై వెచ్చించాను. దానికి బదులు నేనేమి అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాను...ఇరవై ఏళ్ల తర్వాత ఇండియాను నా క్యారెక్టర్‌ సర్టిఫికేట్‌ అడగుతున్నాను. నా కుమారుడికి నేను కాదు ఇండియానే చెబుతుంది తన తండ్రి ఎవరూ అన్నది’ అనే సందేశంతో మొదలైన ‘టైగర్‌ 3’ టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. సల్మాన్‌ ఖాన్‌, అందాల తార కత్రినా కైఫ్‌ జంటగా అలరించనున్నారు. యశ్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ సమర్పణలో రానున్న ఈ చిత్రాన్ని మనీష్‌ శర్మ తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను ‘టైగర్‌ కా మెసేజ్‌’ అనే పేరుతో విడుదల చేసింది చిత్రబృందం. దీంతో చిత్ర ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది. ‘రా-ఏజెంట్‌ అయిన టైగర్‌ ఇప్పుడు శత్రువు, దేశద్రోహి, ఎనిమీ నెం.1 అయ్యాడు’ అంటూ వచ్చిన సంభాషణలు సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. ‘టైగర్‌కు శ్వాస ఉన్నంత వరకు ఈ ఓటమిని ఒప్పుకోడు’ అంటూ సల్మాన్‌ టీజర్‌ చివర్లో చెప్పిన డైలాగ్‌ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది. యాక్షన్‌ సీక్వెన్స్‌తో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు సల్మాన్‌. ఇంతకి టైగర్‌ దేశద్రోహా?...దేశసేవకుడా? తెలుసుకోవాలంటే ఈ ఏడాది దీపావళి సందర్భంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను చూడాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని