Tollywood: తడబడిన అంజలి.. రామారావు డ్యూటీ.. రంగరంగ వైభవంగా వచ్చేదెప్పుడంటే?

తెలుగు సినీ పరిశ్రమలో(Tollywood) కొత్త సినిమాల జోరు మొదలైంది. యాక్షన్‌, పొలిటికల్‌ థ్రిల్లర్స్‌, ప్రేమ కథా చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించేందుకు హీరోలు సిద్ధమయ్యారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి.....

Updated : 13 Jul 2022 20:25 IST

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమలో(Tollywood) కొత్త సినిమాల జోరు మొదలైంది. యాక్షన్‌, పొలిటికల్‌ థ్రిల్లర్స్‌, ప్రేమ కథా చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించేందుకు హీరోలు సిద్ధమయ్యారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న పలు చిత్రాలు ప్రమోషన్స్‌ షురూ అయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం ఆయా ప్రాజెక్ట్‌ల మేకింగ్‌ వీడియోలు, సరికొత్త పోస్టర్స్‌ నెట్టింట విడుదలయ్యాయి. ఇంతకీ ఆ ప్రాజెక్ట్‌లు ఏమిటంటే..

‘రంగ రంగ..’ వచ్చేది అప్పుడే..!

వైష్ణవ్‌ తేజ్‌(Vaishnav Tej), కేతికా శర్మ(Ketika Sharma) జంటగా నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘రంగరంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga). ఈ సినిమాతో గిరీశయ్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బుధవారం ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని చిత్రబృందం ప్రకటించింది. సెప్టెంబర్‌ 2న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ దీన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ (DSP) స్వరాలు అందించారు.

‘రారా రెడ్డి.. తడబడిన అంజలి’..! 

నితిన్‌ (Nithiin) ప్రధానపాత్రలో నటిస్తోన్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). కృతిశెట్టి(Krithi Shetty), కేథరిన్‌ (Catherine) కథానాయికలు. రాజశేఖర్‌ రెడ్డి దర్శకుడు. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఈ సినిమా నుంచి ‘రారా రెడ్డి’ (RA RA Reddy) అనే ఐటెమ్‌ సాంగ్‌ని విడుదల చేయగా.. ప్రస్తుతం ఈ పాట 12 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. కాగా, తాజాగా ఈ పాట మేకింగ్‌ వీడియోని చిత్రబృందం షేర్‌ చేసింది. కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ (Jani Master) చెప్పిన స్టెప్పులను ప్రాక్టీస్‌ చేస్తూ అంజలి (Anjali) తడబడి కిందపడబోయినట్లు ఈ వీడియోలో చూపించారు.

‘రామారావు.. ఇలా సిద్ధమయ్యాడు’..!

1995 నాటి నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ (Ramarao On Duty). రవితేజ (Raviteja) కథానాయకుడు. శరత్‌ మండవ(Sarath Mandava) దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా బుధవారం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ మేకింగ్‌ వీడియోని షేర్‌ చేసింది. యాక్షన్‌ సీక్వెన్స్‌లు తెరకెక్కించిన విధానాన్ని ఇందులో చూపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని