Salman Khan: సల్మాన్‌ ఫామ్‌హౌస్‌ వద్ద కలకలం.. నకిలీ ఐడీలతో చొరబడేందుకు యత్నం

సల్మాన్‌ఖాన్‌ (Salman Khan)ని కలిసేందుకు ఇద్దరు దుండగులు విఫలయత్నం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 08 Jan 2024 16:55 IST

ముంబయి: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan)కు చెందిన అర్పితా ఫామ్‌హౌస్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ఇద్దరు వ్యక్తులు విఫలయత్నం చేశారు. జనవరి 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని పన్వేల్‌ రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సల్మాన్‌ఖాన్‌ అభిమానులమని చెబుతూ అజేష్ కుమార్ ఓం ప్రకాష్ గిల్, గురుసేవక్ సింగ్ తేజ్‌సింగ్ అనే ఇద్దరు దుండగులు ఫామ్‌హౌస్‌లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ చెకింగ్‌లో నకిలీ ఐడీలు చూపించారు. వారి కదలికలు అనుమానాస్పదంగా అనిపించడంతో సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టారు.

సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామంటూ ఇప్పటికే పలుమార్లు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముంబయి పోలీసులు ఆయనకు వై+ భద్రత కల్పిస్తున్నారు. ఆరుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బంది మూడు షిఫ్టుల్లో ఆయనకు రక్షణ కల్పిస్తుంటారు. మరో ఐదుగురు సాయుధ సిబ్బంది ఆయన ఇంటి వద్ద పహారా కాస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని