ugram movie review: రివ్యూ: ‘అల్లరి’ నరేష్ నటించిన ‘ఉగ్రం’ మూవీ ఎలా ఉందంటే?
ugram movie review: అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించిన ‘ఉగ్రం’ సినిమా ఎలా ఉందంటే?
Ugram movie review; చిత్రం: ఉగ్రం; నటీనటులు: అల్లరి నరేష్, మిర్నా మేనన్, ఇంద్రజ, శరత్ లోహితాస్వ, శత్రు, శ్రీనివాస్ సాయి, మణికంఠ వారణాసి తదితరులు; సంగీతం: శ్రీచరణ్ పాకాల; ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్; సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్.జె; సంభాషణలు: అబ్బూరి రవి; నిర్మాత: సాహు గారపాటి, హరీశ్ పెద్ది; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల; విడుదల తేదీ: 05-05-2023

‘నాంది’.. అల్లరి నరేష్ సినీ కెరీర్‌కు ఓ మలుపు. నటుడిగా కొత్త ఆరంభాన్నిచ్చింది. అప్పటి వరకు అల్లరి పాత్రలతో నవ్వులు పంచుతూ వచ్చిన ఆయన ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా ట్రాక్ మార్చుకున్నారు. సీరియస్ కథలతో ప్రయాణించడం షురూ చేశారు. తనకు ‘నాంది’ వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు విజయ్ కనకమేడలతో కలిసి మరోసారి ‘ఉగ్రం’ అంటూ మరో సీరియస్ సినిమాతో బాక్సాఫీస్ ముందుకొచ్చారు. ఇందులో ఆయన పోలీస్‌గా సరికొత్త యాక్షన్ అవతారంలో కనిపిస్తుండటం.. ప్రచార చిత్రాల్లో ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం తెరపై ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి పంచింది?(Ugram movie review) నరేష్ - విజయ్ మరో విజయాన్ని అందుకున్నారా?
కథేంటంటే: సీఐ శివకుమార్ (అల్లరి నరేష్) నిజాయితీ గల పోలీస్ అధికారి. అపర్ణ (మిర్నా మేనన్)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె తండ్రి నరసింహారెడ్డి పటేల్ (శరత్ లోహితస్వా)ను ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంటాడు. 5ఏళ్ల పాటు వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ఈ క్రమంలోనే వారి ప్రేమకు గుర్తుగా ఓ పాప (ఊహా రెడ్డి) కూడా పుడుతుంది. కానీ, ఓ కారు ప్రమాదం శివకుమార్ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. ఆ ప్రమాదంలో శివ తలకు తీవ్ర గాయమవడంతో జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. మరోవైపు ఆ యాక్సిడెంట్‌లోనే శివ భార్య, పాప కనిపించకుండా పోతారు. మరి వాళ్లను వెతికి పట్టుకునేందుకు శివ చేసిన ప్రయాణం ఎలా సాగింది? ఈ క్రమంలో అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తన భార్య, బిడ్డతో పాటు నగరంలో కనిపించకుండా పోయిన అనేక మంది ఆచూకీని తనెలా కనుగొన్నాడు?(Ugram movie review) అసలు వాళ్లందరినీ కిడ్నాప్ చేసిందెవరు? అన్నది మిగతా కథ.
ఎలా సాగిందంటే: మిస్సింగ్ కేసుల చుట్టూ నడిచే ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఆ మిస్సింగ్ కేసుల వెనుక ఓ పెద్ద నెట్‌వర్క్ రన్ అవుతుంటుంది. దాన్ని కథానాయకుడు ఎలా ఛేదించాడు? కనిపించకుండా పోయిన తన భార్య, బిడ్డతో పాటు మిగిలిన వాళ్లందరినీ ఎలా కాపాడాడన్నది చిత్ర కథాంశం. (Ugram movie review) శివకుమార్ కారు ప్రమాదానికి గురయ్యే సన్నివేశంతో సినిమాని ప్రారంభించిన తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది. అతని తలకు తీవ్ర గాయమవ్వడంతో జ్ఞాపకశక్తిని కోల్పోవడం.. కనిపించకుండా పోయిన భార్య, కూతుర్ని ఆస్పత్రిలో చేర్పించాననుకోని గందరగోళానికి గురవ్వడం.. ఇలా తొలి పది నిమిషాలు థ్రిల్లింగ్‌గా సాగుతుంది. దర్శకుడు ఎప్పుడైతే శివ గతాన్ని పరిచయం చేస్తాడో.. అక్కడి నుంచి కథ గాడి తప్పుతుంది. నిజానికి ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ థ్రిల్లర్లలో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా లవ్ ట్రాక్‌లు, పాటలు ఇరికించకూడదు. అవి కథకు స్పీడ్ బ్రేకర్లలా అడ్డు తగులుతుంటాయి. ఇందులో శివ - అపర్ణల మధ్య సాగే లవ్ ట్రాక్ కూడా అలాగే స్పీడ్ బ్రేకర్‌లా అడ్డు తగిలినట్లు అనిపిస్తుంది. మధ్యలో హాస్టల్ అమ్మాయిల్ని కాపాడేందుకు శివ ఒక గంజాయి బ్యాచ్‌ను చితక్కొట్టి జైలులో వేసే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఆ ఎపిసోడే కథను మలుపు తిప్పుతుంది. శివపై పగతో ఆ రౌడీ మూక అతని ఇంటికెళ్లి అపర్ణతో అసభ్యంగా ప్రవర్తించడం.. వాళ్లను శివ వెంటాడి ఎన్‌కౌంటర్ చేయడం హైలైట్‌గా నిలుస్తుంది. విరామానికి ముందు వచ్చే ట్విస్ట్ ద్వితీయార్ధంపై ఆసక్తిరేకెత్తించేలా ఉంటుంది.
ప్రధమార్ధమంతా శివకుమార్ కుటుంబం చుట్టూ కథ సాగితే.. ద్వితీయార్ధంలో అతని భార్యా, పాప ఎలా కనిపించకుండా పోయారు? దాన్ని అతనెలా ఛేదించాడు? అన్న కోణంలో సాగుతుంది. నిజానికి ఇలాంటి కథల్లో మిస్సింగ్‌లు జరుగుతున్న తీరు.. దాని వెనుక ఉండే నెట్‌వర్క్, దాన్ని హీరో ఛేదించే విధానం ఎంత ఆసక్తికరంగా ఉంటే ప్రేక్షకులు ఆ కథతో అంత బాగా కనెక్ట్ అవ్వగలుగుతారు. కానీ, ఈ సినిమాలో వీటి చుట్టూ అల్లుకున్న సన్నివేశాలేవీ ఆసక్తిరేకెత్తించవు. సెకండాఫ్ ఆరంభంలో హిజ్రాలతో శివకుమార్ చేసే యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. అయితే శివ ఓవైపు హౌస్ అరెస్ట్‌లో ఉన్నా.. విచారణ పేరుతో స్వేచ్ఛగా తిరిగేస్తుండటం అంత సంతృప్తికరంగా అనిపించదు.(Ugram movie review) అలాగే అతను కిడ్నాప్ గ్యాంగ్ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు శివకుమార్ వేసే ఎత్తుగడలోనూ కొత్తదనం కనిపించదు. పతాక సన్నివేశాలు మాత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటాయి. క్లైమాక్స్ ఫైట్‌లో నరేష్ తన ఉగ్రరూపాన్ని చూపించారు.
ఎవరెలా చేశారంటే: సీరియస్ పోలీస్‌గా శివ కుమార్ పాత్రలో నరేష్ చక్కగా ఒదిగిపోయారు. యాక్షన్ ఘట్టాల్లో ఆయన చాలా కొత్తగా కనిపించారు. పతాక సన్నివేశాల్లో ఆయనలోని ఉగ్ర రూపాన్ని దర్శకుడు అద్భుతంగా చూపించారు. అపర్ణ పాత్రలో మిర్నా అందంగా కనిపించింది. నటన పరంగా చూపించేందుకు ఆమెకు అంత ఆస్కారం దొరకలేదు. శత్రు, ఇంద్రజ, శరత్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. విజయ్ కనకమేడల సినిమాని ప్రారంభించిన తీరు ఆసక్తిరేకెత్తించినా.. దాన్ని ఆద్యంతం అదే తీరులో నడపడంలో తడబడ్డాడు. (Ugram movie review) ముఖ్యంగా కథలోని ఇన్వెస్టిగేటివ్ పార్ట్ చాలా పేలవంగా అనిపిస్తుంది. అయితే పోరాట ఘట్టాల్ని మాత్రం చాలా చక్కగా తీర్చిదిద్దారు. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం, సిద్ధార్థ్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
- బలాలు
- + నరేష్ నటన
- + పోరాట ఘట్టాలు
- + పతాక సన్నివేశాలు
- బలహీనతలు
- - లవ్ ట్రాక్
- - పేలవమైన స్క్రీన్‌ప్లే
- - ట్విస్ట్‌లు, మలుపులు లేకపోవడం
- చివరిగా: ‘ఉగ్రం’ ఓ రొటీన్ పోలీస్ స్టోరీ.(Ugram movie review)
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/06/2023)
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
Sports News
ఆ బౌలర్ అరంగేట్రం.. అతడికి జాక్‌పాట్
-
India News
Ashwini Vaishnaw: ఆ నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు: టెలికాం మంత్రి
-
World News
Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!
-
Sports News
CSK-Rayudu: మా ఇద్దర్నీ ముందే పిలిచాడు.. ధోనీ అలా భావించాడేమో: రాయుడు