Telugu Movies: సంక్రాంతి పోటీలో ఆ ఐదు.. రిపబ్లిక్‌ డేకు నాలుగు: జనవరి చిత్రాలివీ

2024 జనవరిలో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు సిద్ధమైన సినిమాలు. ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతోందంటే?

Published : 02 Jan 2024 09:50 IST

చిత్ర పరిశ్రమకు సంబంధించి జనవరిలో సంక్రాంతి సీజనే కీలకం. ముగ్గుల పండగకు తమ చిత్రాలను విడుదల చేయాలని చాలామంది దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపడం సహజం. కానీ, కొందరికే ఆ అవకాశం లభిస్తుంది. అలా 2024 సంక్రాంతి వార్‌లో నిలవబోతున్న సినిమాలతోపాటు మిగిలిన వారాల్లో సందడి చేసేందుకు ముస్తాబైన చిత్రాలు, ఓటీటీల్లోకి రాబోయే ప్రాజెక్టులేవో చూద్దామా (upcoming movies in january 2024)..

కొత్త ప్రతిభతో ప్రారంభం..

ఈ ఏడాదిలో బాక్సాఫీసు ముందుకొచ్చిన తొలి చిత్రం ‘సర్కారు నౌకరి’ (Sarkaru Naukari). ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాశ్‌ (Singer Sunitha Son) నటుడిగా తెరంగేట్రం చేసిన సినిమా ఇది. భావన వళపండల్‌ కథానాయిక. గంగనమోని శేఖర్ దర్శకుడు. ఈ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. 1996లో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. శివ కంఠమనేని, రాశి కలిసి నటించిన చిత్రం ‘రాఘవరెడ్డి’. నందిత శ్వేత కీలక పాత్రధారి. సంజీవ్‌ మేగోటి దర్శకుడు. ఈ సినిమా జనవరి 5న విడుదల కానుంది. మనోజ్‌, చాందిని జంటగా నాగరాజు బోడెం తెరకెక్కించిన ‘14 డేస్‌ లవ్‌’ (14 Days Love) కూడా అదే రోజు రాబోతోంది.

సంక్రాంతికి వీటిదే సందడి..!

ప్రతి ఏడాదీ సంక్రాంతి సినిమాలపై సందిగ్ధత నెలకొంటుంది. ఆ సమయంలో.. అగ్ర హీరోల చిత్రాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరి సినిమా ముందు విడుదలకావాలి? ఎవరిది వెనక్కి వెళ్లాలి? ఒక వేళ ఒకే రోజు విడుదలైతే ఏ సినిమాకి ఎన్ని స్క్రీన్లు? ఇలా ఎన్నో లెక్కలుంటాయి. ఈసారి కూడా అదే పరిస్థితి. మహేశ్‌బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కించిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), తేజ సజ్జ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ రూపొందించిన పాన్‌ ఇండియా చిత్రం ‘హనుమాన్‌’ (HanuMan) జనవరి 12న విడుదలకు సిద్ధమయ్యాయి. వెంకటేశ్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూపొందిన ‘సైంధవ్‌’ (Saindhav), హీరో రవితేజ- డైరెక్టర్‌ కార్తీక్‌ ఘట్టమనేని కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఈగల్‌’ (Eagle) జనవరి 13న రిలీజ్‌ కానున్నాయి. నాగార్జున హీరోగా విజయ్‌ బిన్నీ తెరకెక్కించిన ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇలా ఐదు సినిమాలు విడుదలకానుండడంతో థియేటర్ల విషయంలో ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు దిల్‌రాజ్‌ ఆయా సినిమాల నిర్మాతలతో ఇటీవల సమావేశం నిర్వహించారు. తమ సినిమాని వాయిదా వేసుకున్న వారికి తర్వాత సోలో రిలీజ్‌ డేట్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎవరూ తగ్గకపోతే అన్ని సినిమాలూ విడుదలవుతాయని, అయితే అన్నిటికీ తగిన న్యాయం జరగదని, ఏ సినిమా బాగుంటే అదే సంక్రాంతి తర్వాత కూడా ఆడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ పోటీని దృష్టిలో పెట్టుకునే తాను నిర్మిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ (విజయ్‌ దేవరకొండ హీరో)ను వాయిదా వేశానన్నారు. ప్రస్తుతానికి ఏ సినిమా విడుదల తేదీ మారలేదు. మరి, ఈ ఐదు చిత్రాలూ పండగకు వస్తాయా? ఇంకా సమయం ఉంది కాబట్టి మార్పులు ఉండొచ్చా? అంటే వేచి చూడాల్సిందే. మరోవైపు, ధనుష్‌ నటించిన ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller), శివ కార్తికేయన్‌ ‘అయలాన్‌’ (Ayalaan), విజయ్‌ సేతుపతి ‘మెరీ క్రిస్మస్‌’ (Merry Christmas) జనవరి 12న విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. కానీ, తెలుగులో వస్తాయా, లేదా? అన్న దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. విష్ణు విశాల్‌ హీరోగా, రజనీకాంత్‌ కీలక పాత్రలో నటించిన ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam)ను సైతం సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించి, కొన్ని రోజుల క్రితమే వాయిదా వేశారు.

రిపబ్లిక్‌ డే.. పైగా ఫ్రైడే

రిపబ్లిక్‌ డే.. హాలీడే కావడంతో జనవరి 26న కూడా బాక్సాఫీసు ముందుకు కొత్త సినిమాలు వస్తుంటాయి. పైగా ఈసారి శుక్రవారం. తెలుగులో పెద్ద సినిమాలులేవుగానీ ఇతర భాష చిత్రాలు సందడి చేయనున్నాయి. విక్రమ్‌ హీరోగా పా. రంజిత్‌ తెరకెక్కించిన ‘తంగలాన్‌’ (Thangalaan), రాజ్‌ దుస్స దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్ర పోషించిన ‘105 మినిట్స్‌’ (105 Minutes) అదే రోజు రిలీజ్‌ కానున్నాయి. ‘లాల్‌ సలామ్‌’ను అదే డేట్‌కు తీసుకురానున్నట్లు సమాచారం. మోహన్‌లాల్‌ నటించిన ‘మలైకోటై వాలిబన్‌’ (Malaikottai Vaaliban), హృతిక్‌ రోషన్‌ ‘ఫైటర్‌’ (Fighter) జనవరి 25న విడుదల కానున్నాయి.

ఓటీటీలో ఇలా..

ఇప్పటికే థియేటర్లలో విడుదలై సందడి చేసిన పలు చిత్రాలు, కొత్త వెబ్‌సిరీస్‌లు ఓటీటీల వేదికగా వినోదం పంచేందుకు సిద్ధమయ్యాయి. ఆ వివరాలివీ..

  • హాయ్‌ నాన్న (సినిమా): నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 4 నుంచి స్ట్రీమింగ్‌
  • తేజస్‌ (సినిమా): జీ 5లో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్‌
  • #90s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ (సిరీస్‌): ఈటీవీ విన్‌లో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్‌
  • కన్జూరింగ్‌ కన్నప్పన్‌ (సినిమా): నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 5 నుంచి స్ట్రీమింగ్‌
  • కిల్లర్‌ సూప్‌ (సిరీస్‌): నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 11 నుంచి స్ట్రీమింగ్‌
  • కోట బొమ్మాళి పీఎస్‌ (సినిమా): ఆహాలో సంక్రాంతికి స్ట్రీమింగ్‌
  • ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సిరీస్‌): అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో జనవరి 19 నుంచి స్ట్రీమింగ్‌
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని