Urvashi Rautela: హీరో అఖిల్‌ వేధించాడంటూ పోస్ట్‌.. పరువునష్టం దావా వేసిన ఊర్వశి రౌతేలా

అఖిల్‌ (Akhil Akkineni) హీరోగా నటించిన ‘ఏజెంట్‌’లో అతిథిగా కనిపించనున్నారు బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela). ఇందులో ఆమె అఖిల్‌తో కలిసి ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం ఆడిపాడారు. ఈక్రమంలోనే అఖిల్‌ - ఊర్వశీని ఉద్దేశిస్తూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. 

Updated : 23 Apr 2023 18:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన గురించి అసత్య వార్తలు ప్రచారం చేస్తోన్న ఓ వ్యక్తిపై బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి పెడుతోన్న సోషల్‌మీడియా పోస్టులను నమ్మవద్దని అన్నారు. అంతేకాకుండా ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

తానొక సెన్సార్‌ బోర్డు సభ్యుడినని చెబుతూ ఉమైర్‌ సంధు అనే వ్యక్తి గత కొన్నిరోజులుగా ట్విటర్‌ వేదికగా హల్‌చల్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. కొత్త సినిమా రివ్యూలు, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి అతడు తరచూ పోస్టులు పెడుతుంటాడు. తాజాగా అతడు ఊర్వశి (Urvashi Rautela) గురించి ఓ ట్వీట్‌ పెట్టాడు. ‘‘ఏజెంట్‌’ షూట్‌లో ఊర్వశిని అఖిల్‌ వేధించాడు. ఆమె ఉద్దేశం ప్రకారం ఆయనతో పనిచేయడం చాలా కష్టం’’ అని ఉమైర్‌ పెట్టిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. దానిపై ఊర్వశి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు.

‘‘ఇలాంటి పనికిరాని ట్వీట్స్‌ చేస్తోన్న ఈ వ్యక్తిపై నా లీగల్‌ టీమ్‌ ఇప్పటికే పరువునష్టం దావా వేసింది. ఇలాంటి వారి వల్ల నేను, నా కుటుంబం ఇబ్బందిపడాల్సి వస్తోంది’’ అని ఆమె చెప్పారు. అంతేకాకుండా ఉమైర్‌ పెట్టిన ట్వీట్‌లో నిజం లేదని అఖిల్ వేధించలేదని ఆమె చెప్పారు. అఖిల్‌ హీరోగా నటించి యాక్షన్‌ స్పై ఎంటర్‌టైనర్‌ ‘ఏజెంట్‌’. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. ఇందులో ఊర్వశి రౌతేలా స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడారు. ఏప్రిల్‌ 28న ఇది విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని