Waheeda Rehman: వహీదా రెహమాన్‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం..

ప్రముఖ నటి వహీదా రెహమాన్‌ (Waheeda Rehman) ‘దాదా సాహెబ్‌ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం’ అవార్డుకు ఎంపికయ్యారు.

Updated : 26 Sep 2023 17:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  బాలీవుడ్‌ ప్రముఖ నటి వహీదా రెహమాన్‌ (Waheeda Rehman)కు  ‘దాదా సాహెబ్‌ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం’ (Dada Saheb Phalke Lifetime Achievement Award) వరించింది. ఈ ఏడాది ఈ పురస్కారానికి ఆమె ఎంపికైనట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌  మంగళవారం ప్రకటించారు. భారతీయ సినీ పరిశ్రమకు 5 దశాబ్దాలుగా సేవలు అందించినందుకు గాను ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

రజనీకాంత్‌ను కలిసిన లారెన్స్‌.. ఆనందంగా ఉందంటూ పోస్ట్‌

వహీదా రెహమాన్‌ 1955లో తెరకెక్కిన ‘రోజులు మారాయి’ తెలుగు చిత్రంతో తెరంగెట్రం చేశారు. ఈ చిత్రంలోని ‘ఏరువాక సాగారో రన్నో..’ పాట ఆమెకు  మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత 1956లో సీఐడీ (CID) చిత్రంతో బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. అక్కడ ‘ప్యాసా’, ‘గైడ్‌’ వంటి పలు సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించారు. ఐదు దశాబ్దాల కాలంలో అన్ని భాషల్లో కలిపి మొత్తం 90కు పైగా చిత్రాల్లో నటించారు. 1971లో ఉత్తమ నటిగా వహీదా జాతీయ అవార్డును అందుకున్నారు. 1972లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌ పురస్కారాలు వరించాయి.

ఈ అవార్డు వాళ్లకి అంకితం:  వహీదా రెహమాన్‌

దాదా సాహెబ్‌ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని వహీదా రెహమాన్‌ అన్నారు. ఈ విషయంపై ఆమె ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ..‘నా నటనకు మరొక గుర్తింపు దక్కినందుకు ఆనందంగా ఉంది. ఎవరైనా అంకితభావం, నిజాయితీతో పనిచేస్తే తప్పకుండా దానికి తగిన ఫలితం ఉంటుంది. ఈ అవార్డును నా తోటి నటీనటులకు అలాగే సినీ రంగంలోని అందరికీ అంకితం చేయాలనుకుంటున్నా. ఇదంతా వారి వల్లనే సాధ్యం. ఇండస్ట్రీ నన్ను ఎంతో ఆదరించింది. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దాని వెనుక ఎంతోమంది ఉన్నారు. ఈ పరిశ్రమలో టీమ్‌ వర్క్‌తోనే విజయం వరిస్తుంది. ఎంత గొప్ప దర్శకులైనా వారి ఆలోచనలను టీమ్‌తోనే పంచుకుంటారు’ అని చెప్పారు. జీవితంలో ఏది సాధించాలన్నా ధైర్యం ముఖ్యమని ఆమె అన్నారు. ఓటమికి భయపడి వెనుకడుగు వేయకూడదని చెప్పారు. తాను నటించిన చిత్రాల్లో ‘గైడ్‌’ అంటే ఎంతో ఇష్టమన్న వహీదా రెహమాన్‌.. రీసెంట్‌గా కూడా ఆ సినిమా చూసినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని