Vikram K Kumar: వంద రోజులు వర్షంలోనే చిత్రీకరించాం

‘‘ఒక సినిమా తీశాక దాని ఫలితం శుక్రవారం తొలి ఆటలోపే తెలిసిపోతుంది. కానీ వెబ్‌సిరీస్‌ల ఫలితం కోసం ఎన్నాళ్లు ఎదురుచూడాలో తెలియదు. సినిమాతో పోలిస్తే ఈ విషయంలోనే నాలో ఎక్కువ ఒత్తిడి ఉంది.

Updated : 30 Nov 2023 06:34 IST

‘‘ఒక సినిమా తీశాక దాని ఫలితం శుక్రవారం తొలి ఆటలోపే తెలిసిపోతుంది. కానీ వెబ్‌సిరీస్‌ల ఫలితం కోసం ఎన్నాళ్లు ఎదురుచూడాలో తెలియదు. సినిమాతో పోలిస్తే ఈ విషయంలోనే నాలో ఎక్కువ ఒత్తిడి ఉంది. కానీ మనం చెప్పే కథ 240 దేశాల్లో, ప్రపంచం నలుమూలల్లోని ప్రేక్షకులు చూస్తారనే అంశం ఎక్కువ ఆత్రుతకి గురిచేస్తోంద’’న్నారు విక్రమ్‌ కె.కుమార్‌. ‘13 బి’, ‘ఇష్క్‌’, ‘మనం’ తదితర గుర్తుండిపోయే సినిమాలు చేసిన దర్శకుడాయన. తొలిసారి నాగచైతన్య ప్రధాన పాత్రధారిగా ‘దూత’ వెబ్‌ సిరీస్‌ని తెరకెక్కించారు. శరత్‌మరార్‌, విక్రమ్‌ కె.కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. డిసెంబరు 1 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ సిరీస్‌ ప్రదర్శనకు అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా విక్రమ్‌ కె.కుమార్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ..

‘దూత’ సిరీస్‌గానే తెరకెక్కించడానికి కారణమేంటి?

కొన్ని ఆలోచనలు వచ్చినప్పుడు వీటిని రెండు గంటల్లో చెప్పేయొచ్చు అనుకుంటాం. కొన్ని ఆలోచనల పరిధి విస్తృతంగా ఉంటుంది. ‘దూత’ కథకి చాలా బలం ఉంది. ‘దూత2’, ‘దూత3’ ఆలోచనలూ ఉన్నాయి. అంత ఆసక్తిగా ప్రేక్షకుల్ని కూర్చోబెట్టే సత్తా, పరిధి ఉన్న కథ. స్క్రీన్‌ప్లే రాసుకుంటున్నప్పుడు వెబ్‌ సిరీస్‌గానే రాసుకున్నా.

అతీంద్రీయ శక్తుల నేపథ్యంలో విక్రమ్‌ రాసే కథలు చాలా బాగుంటాయని నాగచైతన్య అన్నారు...

నాకు ఎంతో ఇష్టమైన జానర్‌ ఇది. ‘13 బి’ తర్వాత చాలామంది మళ్లీ ఇదే తరహా కథ చేయమని అడిగారు. కానీ నేనే అదే ముద్ర నాపై పడే ప్రమాదం ఉందని అటువైపు వెళ్లలేదు. వెబ్‌సిరీస్‌ అవకాశం వచ్చినప్పుడు ఇన్నాళ్లూ నేను మిస్‌ అయిన సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ కథని ఎంచుకోవాలనుకున్నా. ఆ ప్రయత్నమే ‘దూత’. సినిమాకీ, సిరీస్‌ రచన పరంగా చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రతి ఎపిసోడ్‌నీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా ముగించాలి. రచనని చాలా ఆస్వాదించా. ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంది.

నాగచైతన్యని కథానాయకుడిగా ఎంచుకోవడానికి కారణం?

చైతూతో నాకు మంచి స్నేహం ఉంది. ‘మనం’ సమయంలోనే తనకి ఓ హారర్‌ కథ చెప్పా. నాకు దెయ్యం సినిమాలంటే భయం, నేను చూడటానికి కూడా ఇష్టపడను అన్నారు. ‘దూత’ కథ మాత్రం తనకి చాలా నచ్చింది. ఇది భయపెట్టే సిరీస్‌ కాదు. ఇదెలా జరిగింది? తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకతని రేకెత్తిస్తుంది. కథంతా వర్షంలోనే సాగుతుంది. వంద రోజులు వర్షంలోనే చిత్రీకరణ చేశాం. శరత్‌మరార్‌లాంటి నిర్మాత లేకపోతే ఇలా చేయడం సాధ్యమయేది కాదు.

ఇది కల్పిత కథా? లేక నిజ జీవిత సంఘటనలతో స్ఫూర్తిగా తీసుకున్నదా?

ఇది కల్పిత కథే. జర్నలిజానికీ, సూపర్‌ నేచురల్‌ అంశానికీ ఎలా ముడిపెట్టామనేది కీలకం. పరిశోధనాత్మక పాత్రికేయ వృత్తి చాలా సవాళ్లతో కూడుకుని ఉంటుంది. సాహసోపేతమైన వృత్తి అది. అందరూ ఆ పని చేయలేరు. అలాంటి పాత్ర నేపథ్యంలో, ప్రేక్షకులకి థ్రిల్లింగ్‌ అనుభవాన్నిచ్చేలా ఈ కథని మలిచా. దూత అంటే సమాచారాన్ని చేరవేసేవాడు అని అర్థం. ఒక సంఘటనని ప్రజల వద్దకి తీసుకెళ్లే జర్నలిస్ట్‌ కూడా దూతనే. నాగచైతన్య ఇందులో జర్నలిస్ట్‌గా కనిపిస్తారు. కథ రాస్తున్నప్పుడే క్రాంతి పాత్రలో పార్వతిని అనుకున్నా. తను పోలీసు అధికారిగా కనిపిస్తుంది. ప్రియ భవానీశంకర్‌, ప్రాచీ దేశాయ్‌ పాత్రలూ కీలకం. ఈ సిరీస్‌లో క్లైమాక్స్‌, ప్రీ క్లైమాక్స్‌ సన్నివేశాలు దర్శకుడిగా చాలా సంతృప్తినిచ్చాయి. నాగచైతన్య నటన మరింత సంతృప్తినిచ్చింది.

‘దూత’ని గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. అక్కడ స్పందన ఎలా ఉంది?

ఒక ఎపిసోడ్‌ని ప్రదర్శించాం. పూర్తి కాగానే లేచి చప్పట్లు కొట్టారు. చలన చిత్రోత్సవాల్లో సహజంగా జరిగేదేనేమో తెలియదుకానీ.. ఆ తర్వాత మా ప్రసంగాన్ని కూడా అంతే ఆసక్తిగా విన్నారు. అక్కడ ప్రదర్శన మంచి అనుభవం.

మీకు ఇష్టమైన వెబ్‌ సిరీస్‌లు ఏవి?

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘పాతాళ్‌లోక్‌’, ‘స్కాం’, మీర్జాపూర్‌’, ‘జూబ్లీ’.. ఇలా చాలా సిరీస్‌లు ఇష్టం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని