Ponniyin Selvan: ఇది కల కాదని ఎవరైనా చెప్పండి..: విక్రమ్‌

సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసిన పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమా విడుదలై 50 రోజులు పూర్తయింది. ఈ  సందర్భంగా ప్రపంచవ్యాప్త కలెక్షన్‌లను చిత్రబృందం ప్రకటించింది.  

Published : 18 Nov 2022 18:57 IST

హైదరాబాద్‌: మణిరత్నం కలల సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌1’ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విడుదలైన దగ్గర నుంచి పాజిటివ్‌ టాక్‌తో మంచి కలెక్షన్‌ను రాబట్టింది. కోలీవుడ్‌లోనూ అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా అరుదైన రికార్డు సాధించింది. ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్‌ సినిమా కలెక్షన్స్‌ ప్రకటించారు. పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500కోట్లు వసూళ్లు చేసినట్లు తెలిపారు.  సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌ షేర్‌ చేసిన విక్రమ్‌ ‘ఇది కల కాదు కదా..!’ అంటూ తనదైన శైలిలో తన సంతోషాన్ని తెలిపారు.

ట్విటర్‌లోని విక్రమ్‌ అధికారిక ఖాతాలో పోస్టర్‌లను షేర్‌ చేస్తూ..‘దయచేసి నన్ను ఎవరైనా గిల్లండి. ఇది కల కాదని ఎవరైనా చెప్పండి’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాలో ‘ఆదిత్య కరికాలన్‌’ పాత్రలో విక్రమ్‌ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్‌, త్రిష, కార్తి, ప్రకాష్‌రాజ్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకున్న ఈ సినిమా రెండో భాగం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం  తెలిపింది. ఇటీవల అమెజాన్‌ వేదికగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాను ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో వీక్షిస్తున్నారు. చోళరాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకుంది. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మద్రాస్‌ టాకీస్‌ బ్యానర్‌పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని