Updated : 19 Mar 2021 14:40 IST

రివ్యూ: మోసగాళ్లు

చిత్రం: మోసగాళ్లు; నటీనటులు: మంచు విష్ణు, కాజల్‌ అగర్వాల్‌, సునీల్‌శెట్టి, రుహి సింగ్‌, నవదీప్‌, నవీన్‌ చంద్ర, రఘుబాబు తదితరులు; సంగీతం: శ్యామ్‌ సీఎస్‌; సినిమాటోగ్రఫీ: షెల్డన్‌ చౌ; ఎడిటింగ్‌: గౌతమ్‌ రాజు; నిర్మాత: మంచు విష్ణు; రచన: మంచు విష్ణు; దర్శకత్వం: జెఫ్రీ గీ చిన్‌; సంస్థ: 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌; విడుదల: 19-03-2021

కొత్త‌‌ద‌న‌మున్న సినిమాల‌కే సినీ ప్రియులు వెండితెర‌పై ప‌ట్టం క‌డుతున్నారు. అందుకే ప్ర‌తి క‌థానాయకుడూ వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌లతోనే ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నారు. తాజాగా మంచు విష్ణు కూడా అదే పంథాలో న‌డిచారు. నిజ జీవితంలో జరిగిన ఓ భారీ ఐటీ కుంభ‌కోణాన్ని కథాంశంగా తీసుకొని.. ‘మోస‌గాళ్లు’ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తీసుకొచ్చారు. ఇందులో విష్ణు, ఆయ‌న సోద‌రిగా కాజ‌ల్ ప్ర‌తినాయిక ఛాయ‌లున్న పాత్రలు పోషించ‌డం.. బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి ఓ కీల‌క‌ పాత్రలో న‌టించ‌డంతో అంద‌రి దృష్టి ఈ సినిమాపై ప‌డింది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్లు ఆస‌క్తిక‌రంగా ఉండ‌టంతో.. ఈ  సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ ‘మోస‌గాళ్లు’ అందుకుందా?  మంచు విష్ణుకి విజ‌యం ద‌క్కిందా?

క‌థేంటంటే: అను (కాజ‌ల్), అర్జున్ వ‌ర్మ (మంచు విష్ణు) నిమిషాల తేడాతో పుట్టిన క‌వ‌ల అక్కా త‌మ్ముళ్లు. చిన్న‌ప్ప‌టి నుంచీ క‌టిక పేద‌రికం మ‌ధ్య పెరుగుతారు. తండ్రి (త‌నికెళ్ల భ‌ర‌ణి) అతి నిజాయతీ వ‌ల్లే త‌మ‌కీ దుస్థితి అని న‌మ్మిన ఈ అక్కా త‌మ్ముళ్లిద్ద‌రూ.. ఉన్న‌వాడిని మోసం చేసైనా పైకి ఎద‌గాల‌నుకుంటారు.  ఈ  క్ర‌మంలోనే విజ‌య్ (న‌వ‌దీప్‌)తో క‌లిసి ఒక‌ కాల్ సెంట‌ర్ ను ఏర్పాటు చేసి.. ఓ న‌యా మోసానికి తెర లేపుతాడు అర్జున్‌.  ఇంట‌ర్న‌ల్ రెవెన్యూ స‌ర్వీస్ (అమెరిక‌న్ ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌) పేరుతో అమెరిక‌న్‌ల‌కు ఫోన్ చేసి  ప‌న్ను బ‌కాయిలు చెల్లించాల‌ని బెదిరించి అక్ర‌మంగా డ‌బ్బు సంపాదించ‌డం మొద‌లుపెడ‌తారు. అలా దాదాపు రూ.2,600 కోట్లు కొల్ల‌గొడ‌తారు. మ‌రి ఈ భారీ కుంభ‌కోణంలో అను పాత్రేంటి? ఈ స్కామ్‌ని అమెరిక‌న్ ఫెడ‌ర‌ల్ ట్రేడ్ క‌మిష‌న్‌, భార‌త ప్ర‌భుత్వం ఎలా ఛేదించింది? ఈ మోస‌గాళ్ల‌ను ప‌ట్టుకోవ‌డానికి డీసీపీ కుమార్ భాటియా (సునీల్ శెట్టి) ఎలాంటి ఎత్తులు వేశారు?  ఆయ‌న నుంచి త‌ప్పించుకోవ‌డానికి అక్కా త‌మ్ముళ్లు ఎలాంటి పైఎత్తులు వేశార‌న్న‌ది మిగ‌తా చిత్ర క‌థ‌. 

ఎలా ఉందంటే: ఆర్థిక కుంభ‌కోణాల చుట్టూ అల్లుకున్న క్రైమ్  థ్రిల్ల‌ర్ క‌థాంశాలు ఎప్పుడూ ఆస‌క్తిక‌రంగానే ఉంటాయి. అందులో టెక్నాల‌జీతో ముడిప‌డి ఉండే స్కాంలు మ‌రింత రసవత్తరంగా అనిపిస్తాయి.  ఈ త‌ర‌హా క‌థాంశాలతో హాలీవుడ్‌లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలొచ్చాయి. బాలీవుడ్‌లో ఇప్ప‌టికే హ‌ర్ష‌ద్ మెహ‌తా స్టాక్ ఎక్స్ఛేంజ్‌ కుంభ‌కోణంతో ‘స్కామ్ 1992’ వెబ్‌సిరీస్‌తో పాటు ‘బిగ్ బుల్’ అనే సినిమాలు రూపొందాయి.  ఓ య‌థార్థ‌మైన ఆర్థిక కుంభ‌కోణం కథాంశంగా తీసుకుని ‘మోస‌గాళ్లు’తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశారు మంచు విష్ణు.  ఇది నిజంగా సాహ‌సోపేత‌మైన ప్ర‌య‌త్న‌మే.  విష్ణు ఎంచుకున్న ఈ పాయింట్‌లోనే ఓ కొత్త‌ద‌నం ఉంది.  హైద‌రాబాద్‌లోని ఓ చిన్న బ‌స్తీలో ఉండే ఒక అక్కా తమ్ముడు క‌లిసి వేల మంది అమెరిక‌న్ల‌ను ఎలా బురిడీ కొట్టించారు..  ఇందుకోసం వాళ్లు టెక్నాల‌జీని ఎలా వాడుకున్నారు..  త‌మ తెలివి తేటలతో అంద‌రినీ విస్మ‌య ప‌ర‌స్తూ వేల కోట్ల సొమ్ము ఎలా దోచుకున్నారు.. ఇలా క‌థ‌లో థ్రిల్ చేసే అంశాలు చాలా ఉన్నాయి. అయితే ఇలాంటి క‌థ‌ను ఎన్నుకోవ‌డంలో కంటే.. దాన్ని ఎంత చ‌క్క‌గా అల్లుకున్నారు?  తెరపై ఎంత థ్రిల్లింగ్‌గా చూపించారు? అన్న‌దానిపైనే చిత్ర విజ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ విష‌యంలో మోస‌గాళ్లు బృందం తడబడింది. 

ఆరంభంలో అను, అర్జున్‌ల బాల్యాన్ని.. వాళ్ల నేప‌థ్యాన్ని క్లుప్తంగా చూపించేసి, ప్రేక్ష‌కుల్ని నేరుగా క‌థ‌లోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు.  త‌ర్వాత అర్జున్ ఓ కాల్ సెంటర్‌లో ప‌నిచేయ‌డం.. దాని ద్వారా అక్ర‌మంగా అమెరిక‌న్ల డేటాను సేక‌రించి వెబ్ ముఠాల‌కు అమ్మ‌డం.. ఈ క్ర‌మంలో అత‌ని తెలివి తేట‌లు గ‌మ‌నించి విజ‌య్ అత‌నితో ఓ భారీ స్కాంకి రంగం సిద్ధం చేయ‌డం.. ఇలా క‌థ‌ని చ‌క‌చ‌కా ప‌రుగులు పెట్టించారు. ఈ స్కాంలోకి అను ఎంట్రీ ఇచ్చాక వ‌చ్చే ఎపిసోడ్‌లు.. అమెరిక‌న్ల‌ను బురిడీ కొట్టించేందుకు వీళ్లు చేసే ప్ర‌య‌త్నాలు మాత్రం సాదాసీదాగా సాగినట్లు అనిపిస్తాయి. ముఖ్యంగా టెక్నాల‌జీపై ఆధార‌ప‌డి చేసే ఇలాంటి క్రైమ్‌ సబ్జెక్ట్‌ను ఆస‌క్తిక‌రంగా చూపించ‌డానికి ఎంతో ఆస్కార‌ముంది.  వాస్త‌వానికి ఇలాంటి ఎపిసోడ్లే సినిమాకి బ‌లంగా నిలుస్తాయి. కానీ, దీనిపై ద‌ర్శ‌కుడు దృష్టే పెట్ట‌లేద‌నిపిస్తుంది.  మ‌‌రోవైపు న‌వీన్ చంద్ర‌, సునీల్ శెట్టిల మధ్య న‌డిచే దొంగా పోలీస్ ఆట క‌థ‌కు స్పీడ్ బ్రేక‌ర్‌లా అడ్డు త‌గులుతుంటుంది. విరామ స‌మ‌యానికి అమెరిక‌న్ ఫెడ‌ర‌ల్ ట్రేడ్ క‌మిష‌న్ అర్జున్‌, అను బృందానికి ఝ‌ల‌క్ ఇస్తుంది.

ఇక ద్వితీయార్ధంలో అర్జున్ టీం మ‌రో కొత్త మోసానికి తెరలేప‌డం..  వాళ్ల‌ను ప‌ట్టుకునేందుకు అమెరిక‌న్ ఫెడ‌ర‌ల్ ట్రేడ్ క‌మిష‌న్ ఓ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్ట‌డం.. మ‌రోవైపు ఈ గ్యాంగ్ ఆట‌లు క‌ట్టించేందుకు డీఎస్పీ కుమార్ వేసే ఎత్తులు కూడా రొటీన్‌గానే ఉంటాయి.  ఈ సన్నివేశాలను థ్రిల్లింగ్‌గా రాసుకుని ఉంటే కథనంలో వేగం, ఉత్కంఠ ఉండేవి. మరోవైపు మ‌‌ధ్య మ‌ధ్య‌లో కొన్ని రొమాంటిక్ సీన్స్‌.. మ‌రికొన్ని ఫ్యామిలీ సెంటిమెంట్ ఎపిసోడ్లతో కథ.. దూకుడుకు కళ్లెం వేశాయి. చివరిలో సునీల్ శెట్టి, మంచు విష్ణుల‌కి మ‌ధ్య వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్ కాస్త ఆకట్టుకున్నా, ప్రేక్షకుడు ఆశించే ముగింపు మాత్రం దర్శకుడు ఇవ్వలేదు.

ఎవ‌రెలా చేశారంటే:  క‌థ‌కి త‌గ్గ‌ట్లుగా అర్జున్ పాత్రలో మంచు విష్ణు ఒదిగిపోయారు.  క‌న్నింగ్ మెంటాల్టీతో ఆద్యంతం సీరియ‌స్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిస్తుంటారు. డీఎస్పీ కుమార్‌గా సునీల్ శెట్టి నటన బాగున్నా.. ఆయ‌నలోని న‌టుడికి స‌వాల్ విసిరే ఒక్క స‌న్నివేశమూ క‌నిపించ‌దు.  ప్ర‌ధ‌మార్ధంలో ఆయ‌న పాత్రని రెండు మూడు సీన్ల‌కే ప‌రిమితం చేశారు. అను పాత్ర‌లో కాజ‌ల్ క‌నిపించిన విధానం బాగుంది. ఆ పాత్ర‌ని ఇంకాస్త బలంగా తీర్చిదిద్దాల్సింది. ఇక న‌వీన్ చంద్ర‌, న‌వ‌దీప్‌, వైవా హ‌ర్ష పాత్ర‌లు ప‌రిధి మేర ఆకట్టుకుంటాయి. శ్యామ్ సీఎస్ నేప‌థ్య సంగీతం చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణగా నిలిచింది. ఈ చిత్రం కోసం ఎంచుకున్న క‌థ బాగున్నా.. దాన్ని తీర్చిదిద్దిన విధానం ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. ముఖ్యంగా సినిమాలో థ్రిల్ చేసే మ‌లుపులు.. ఆశ్చ‌ర్య‌ప‌రిచే ఎపిసోడ్లు ఇంకొన్ని పడి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ ఎంచుకున్న క‌థాంశం - క‌థ‌ని న‌డిపించిన తీరు
+ మంచు విష్ణు న‌ట‌న‌ - ముగింపు
+ సునీల్ శెట్టి, కాజ‌ల్ పాత్ర‌లు  

చివ‌రిగా: ‘మోసగాళ్ల’ మోసాలు బాగున్నాయి.. వాటికి థ్రిల్‌ తోడై ఉంటే..

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని