Vishnu Manchu: ‘కన్నప్ప’ కోసం 600 మంది త్యాగం చేశారు: డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై మంచు విష్ణు పోస్ట్‌

తన కలల ప్రాజెక్టు ‘కన్నప్ప’ చిత్రీకరణ ప్రారంభంపై హీరో మంచు విష్ణు ఆనందం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రేక్షకుల ఆశీస్సులు కోరారు.

Updated : 25 Sep 2023 20:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరో మంచు విష్ణు (Vishnu Manchu) కలల ప్రాజెక్టు ‘కన్నప్ప’ (Kannappa). ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ న్యూజిలాండ్‌లో సోమవారం మొదలైంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ ప్రేక్షకుల ఆశీస్సులు కోరారు విష్ణు. ‘‘ఇది నా ఏడేళ్ల కల. శివపార్వతుల ఆశీస్సులతో సాకారమైంది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఎనిమిది నెలలుగా విశ్రాంతి లేదు. ఈ ప్రయాణంలో నిద్రలేని రాత్రులెన్నో! పండగ వేడుకలకు దూరంగా ఉన్నాం. సెలవులు లేవు. ఆందోళన, భయం ఇంకా వెంటాడుతూనే ఉన్నప్పటికీ మనస్సు దృఢంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా నటీనటులు, సాంకేతికనిపుణులు కలిపి మొత్తం 600 మంది ఎన్నో త్యాగాలు చేసి కన్నప్ప కోసం న్యూజిలాండ్‌ వచ్చారు’’

విజయ్‌ సేతుపతి కుటుంబాన్ని బెదిరించారు: ముత్తయ్య మురళీధరన్‌ వ్యాఖ్యలు

‘‘కన్నప్ప’ సినిమా కాన్సెప్ట్‌ను నటుడు తనికెళ్ల భరణి ఏడేళ్ల క్రితం నాతో పంచుకున్నారు. దాన్ని మరింత పెద్దగా తీర్చిదిద్దేందుకు పలువురు ప్రతిభావంతులను సంప్రదించా. ఈ స్క్రిప్టు లార్జర్‌ దేన్‌ లైఫ్‌గా మారేందుకు రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, విజయేంద్ర ప్రసాద్‌, తోటపల్లి సాయినాథ్‌, తోట ప్రసాద్‌, దర్శకులు నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్‌ రెడ్డి కలిసి సహకారం అందించారు. ‘నేను ఇది చేయగలనా?’ అని సందేహంలో ఉన్న నన్ను నాన్న నమ్మారు. సపోర్ట్‌గా నిలిచారు. సోదరుడు వినయ్‌ మోటివేట్‌ చేశాడు. ఇందులో సూపర్‌స్టార్లు నటిస్తున్నారని చెప్పేందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ జాబితాను త్వరలోనే ప్రకటిస్తా. చిత్రీకరణ పూర్తయ్యే వరకు ఎలాంటి దృశ్యాలు/వివరాలు బయటకురాకుండా మా వంతు ప్రయత్నం చేస్తున్నప్పటికీ లీకుల బెడద సవాలుగా మారుతోంది. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం నిర్మాణ సంస్థ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) హ్యాండిల్‌ (@24FramesFactory)ని అనుసరించాలని సినీ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నా. సినిమా ప్రారంభమైన సందర్భంగా మీ ప్రేమ, మద్దతు కోరుతున్నా. ‘కన్నప్ప’ ఓ సినిమా మాత్రమే కాదు ప్రేమ, అంకితభావం, అచంచల విశ్వాసంతో కూడిన శ్రమ’’ అని పేర్కొన్నారు.

స్టార్‌ ప్లస్‌లో ‘మహాభారత’ సిరీస్‌ని తెరకెక్కించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై  మోహన్‌బాబు, మంచు విష్ణు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కథానాయికగా నుపుర్‌ సనన్‌ ఎంపికైనా డేట్స్‌ సర్దుబాటుకాకపోవడంతో ఆమె వైదొలిగారు. మరోవైపు, ఈ సినిమాలో ప్రభాస్‌, నయనతార కీలక పాత్రలు పోషించే అవకాశాలున్నాయంటూ రూమర్స్‌ వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు