Vishnu Manchu: డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం: ‘మా’ అధ్యక్షుడు విష్ణు

డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఈ మేరకు.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి చర్చించినట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు.

Published : 05 Feb 2024 22:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka)ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు (Vishnu Manchu) మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి, చిత్ర పరిశ్రమ తరుఫున బహుమతిని అందజేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఆయన వెంట ‘మా’ ప్రధాన కార్యదర్శి రఘుబాబు, కోశాధికారి శివ బాలాజీ ఉన్నారు. సంబంధిత విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌ మీడియా వేదికగా ఫొటోను పంచుకున్నారు విష్ణు.

‘‘భట్టి విక్రమార్కగారిని కలుసుకోవడం ఆనందంగా ఉంది. మేం పలు విషయాలపై చర్చించాం. తెలుగు చిత్ర పరిశ్రమ తరుఫున డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా మాట్లాడాం. క్లిష్ట పరిస్థితుల్లో డ్రగ్స్ ఫ్రీ సొసైటీ కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం కలిసి డ్రగ్స్‌ రహిత సమాజానికి కృషి చేద్దాం’’ అని పిలుపునిచ్చారు.

విష్ణు ప్రస్తుతం.. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ (Kannappa)లో నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే న్యూజిలాండ్‌లో భారీ షెడ్యూల్‌ షూటింగ్‌ పూర్తి అయింది. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని