Vishwak Sen: నా మాటల ఉద్దేశం అదే: విశ్వక్‌సేన్‌ క్లారిటీ

తిరుపతి ప్రెస్‌మీట్‌లో తాను చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన నేపథ్యంలో నటుడు విశ్వక్‌సేన్‌ (Vishwak sen) తాజాగా ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టారు.

Published : 14 Mar 2024 22:20 IST

హైదరాబాద్‌: ‘గామి’ చిత్రాన్ని నలుగురు పెద్ద మనుషులు వీక్షించి.. ప్రశంసిస్తే బాగుంటుందంటూ తిరుపతి వేదికగా నటుడు విశ్వక్‌సేన్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చకు దారి తీశాయి. తనకి ఎవరూ హైప్‌ క్రియేట్‌ చేయాల్సిన అవసరం లేదని.. తనని తానే ప్రోత్సహించుకుంటానని గతంలో విశ్వక్‌ చేసిన వ్యాఖ్యలతో తాజా స్పీచ్‌ను పోల్చి చూస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.

‘‘సినిమాల్లోకి వచ్చినప్పుడు నేను చేసిన వ్యాఖ్యలు.. తాజాగా అన్న మాటలను ఉద్దేశించి ఎవరైతే మాట్లాడుతున్నారో వారి కోసమే ఈ పోస్ట్‌. ఒక సినిమా రిలీజ్‌కు ముందు అడిగితే సపోర్ట్‌ చేయమని అర్థం. సినిమా హిట్‌ అయ్యి వసూళ్లు కూడా మంచిగా వస్తోన్న తరుణంలో పెద్దలు ఎవరైనా మా చిత్రాన్ని చూడమని అడిగితే.. గుర్తించమని అర్థం. ‘గామి’లో నేను తప్ప ప్రతిఒక్కరూ (టెక్నిషియన్స్‌) కొత్తవారే. వాళ్లకు ప్రశంసలు దక్కాల్సిన అవసరం ఉంది. నిన్న తిరుపతిలో నేను చేసిన వ్యాఖ్యల ఉద్దేశం అదే. నేను మరొక్కసారి చెబుతున్నా. ‘గామి’కి ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇదొక తెలుగు చిత్రంగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీకు కావాల్సిన కమర్షియల్‌ కిక్‌ ఎలా ఉంటుందో ఇప్పటినుంచి చూడు. అక్కడా ఉంటా.. ఇక్కడా ఉంటా’’ అని పోస్ట్‌ పెట్టారు.

ఎపిక్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా ‘గామి’ సిద్ధమైంది. విధ్యాదర్‌ కాగిత దర్శకత్వం వహించారు. శంకర్‌ అనే అఘోరా పాత్రలో విశ్వక్‌ నటించారు. శుక్రవారం ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశ్వక్‌ నటనకు సినీ ప్రియులు ఫిదా అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని