Vishwak Sen: ఆ రెండు సినిమాలకు సీక్వెల్స్‌ తీస్తాను: విష్వక్‌ సేన్‌

యంగ్‌ హీరో విష్వక్‌ సేన్  తాజాగా ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki) చిత్రంతో పలకరించాడు. ఈ సినిమా విజయంపై మీడియాతో మాట్లాడాడు. 

Published : 23 Mar 2023 19:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki). ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మంచి టాక్‌ తెచ్చుకుంది. విష్వక్‌ నటనకు, దర్శకత్వానికి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ విజయం గురించి మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు విష్వక్‌ సేన్‌. మరి అందులో విష్వక్‌ పంచుకున్న సంగతులేంటో చూసేద్దాం.

సినిమా సక్సెస్‌ను ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు?

విష్వక్‌ సేన్‌: చాలా ఆనందంగా ఉంది. కాళ్లు నిలవడం లేదు అంటారు కదా.. అలా ఉన్నాను. అనుకున్న దానికంటే మంచి ఫలితం వచ్చింది.  నాకు సినిమారంగమంటే చాలా ఇష్టం. అందుకే దీనికోసం ఎంత కష్టమైనా పడడానికి సిద్ధపడతాను.  ‘దాస్‌ కా ధమ్కీ’ సినిమా తీసేటప్పటి కంటే విడుదల సమయంలో ఎక్కువ కష్టం అనిపించింది. కొంచెం ఆలస్యమైనా ప్రతి విషయాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి విడుదల చేశాను.  ప్రేక్షకులకు మంచి సినిమా అందించానని సంతృప్తిగా ఉంది. 

ఈ సినిమాలో కామెడీ గురించి చెప్పండి?

విష్వక్‌ సేన్‌: ఓ దర్శకుడిగా నేను యాక్షన్‌, డ్రామా సన్నివేశాలకు బాగా దర్శకత్వం వహిస్తాను.  ఇక ఈ సినిమాలో కామెడీ సీన్స్‌ కూడా చాలా బాగా వచ్చాయి. ఒక డైరెక్టర్‌గా ఇది నేను సాధించిన గొప్ప విజయం అనుకుంటాను. తాజాగా ఎన్టీఆర్‌ నన్ను అభినందిస్తూ మెసెజ్‌ చేశారు. 

నివేదా పేతురాజ్‌ను కొత్తగా చూపించారని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం?

విష్వక్‌ సేన్‌: ఈ సినిమాలో పాత్ర గురించి చెప్పగానే తను ఓకే చేసింది. ఇది చాలా కీలకమైన పాత్ర. ఒక కథను తెరకెక్కించాలంటే స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేస్తారు. ఈ స్క్రిప్ట్‌లో రెండు సార్లు మాత్రమే మార్పులు చేశా. ఇందులో నటించిన ప్రతి ఒక్కరిని నేనే ఎంపిక చేశా. హోటల్‌ మేనేజర్‌ పాత్ర కోసం మొదట పోసాని గారిని అనుకున్నా. కానీ అక్షరని ఎంపిక చేశా. తను ఆ పాత్రలో చాలా బాగా నటించింది.  మ్యూజిక్‌ డైరెక్టర్‌ లియోన్‌ జేమ్స్‌ అద్భుతమైన పాటలు అందించారు. నేను తీసే తర్వాత సినిమాకు కూడా ఆయనే సంగీత దర్శకుడు. 

డ్యుయల్‌ రోల్‌ చెయ్యడం ఎలా అనిపించింది?

విష్వక్‌ సేన్‌: మొదట చెయ్యగలనా అనిపించింది. కానీ సినిమాకు వచ్చిన స్పందన చూసి చాలా సంతోషం వేసింది. నా పాత్రకు నేను న్యాయం చెయ్యగలిగా అనుకున్నా. నెగెటీవ్‌ క్యారెక్టర్‌లో బాగా నటించానని అంటున్నారు. నేను ఏ పాత్ర చేసినా దానిలో లీనమవుతాను. 

భవిష్యత్తులో నెగెటీవ్‌ రోల్స్‌లో నటించే అవకాశం ఉందా?

విష్వక్‌ సేన్‌: తెలీదు. నేను ఏదీ ప్లాన్‌ చేసుకోలేదు. త్వరలోనే నా సొంత ప్రొడక్షన్‌లో ఎవరూ ఊహించని ప్రకటన చేస్తాను. అలాగే ‘దాస్‌ కా ధమ్కీ’ సినిమాను వచ్చే నెలలో హిందీలో విడుదల చెయ్యాలని అనుకుంటున్నాం.

సినిమాలో సెకండాఫ్‌లో కామెడీ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని మధ్యలో యాడ్‌ చేశారా?

విష్వక్‌ సేన్‌: కొన్ని సన్నివేశాలు కావాలని పెట్టాం. వరుసగా సీన్లు ఉంటే ప్రేక్షకులకు నచ్చదని మధ్యలో పాటలు పెట్టాం. విడుదలకు నెల ముందు సినిమాలో మరీ ట్విస్ట్‌లు ఎక్కువ ఉన్నాయనిపించింది. అప్పుడు పాట పెట్టాం. 

మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయని అనుకుంటున్నారా?

విష్వక్‌ సేన్‌: కచ్చితంగా. ఇప్పటి వరకు నా సినిమాలు వేటికీ ఈ స్థాయిలో ఓపెనింగ్స్‌ రాలేదు. మొదటి రోజు రూ.8 కోట్లకు పైగానే వసూలు వచ్చాయి. 

నివేద మిమ్మల్ని త్రివిక్రమ్‌తో పోల్చారు. అప్పుడు ఎలా అనిపించింది?

విష్వక్‌ సేన్‌: థ్యాంక్స్‌ చెప్పా (నవ్వుతూ).  తను నన్ను త్రివిక్రమ్‌తో పోల్చలేదు. ఆయన తర్వాత నాకు అంత ఎనర్జీ ఉందని చెప్పింది. 

త్వరలోనే మీ దర్శకత్వంలో మరో సినిమా ఆశించవచ్చా?

విష్వక్‌ సేన్‌: లేదు. ప్రస్తుతం చాలా సినిమాలు అంగీకరించాను. ఇప్పటికే ఆ నిర్మాతలు నా కోసం సంవత్సరం నుంచి వేచి చూస్తున్నారు. మరో 4 సినిమాల తర్వాత అప్పుడు దర్శకత్వం వహిస్తా. ‘దాస్‌ కా ధమ్కీ2’, ‘ఫలక్‌నుమా దాస్‌2’  రెండు సినిమాలకు సీక్వెల్స్‌ తీయాలి. వీటిలో ఏది ముందు వస్తుందో చెప్పలేను. ప్రస్తుతం వీటికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. 

తర్వాత ప్రాజెక్ట్‌లు ఏంటి? పాన్‌ ఇండియా చిత్రాలపై మీ అభిప్రాయం?

విష్వక్‌ సేన్‌: ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాను. ఒకటి కామెడీ యాక్షన్‌ థ్రిల్లర్‌, మరొకటి గ్యాంగ్‌స్టర్‌ చిత్రం.  వీటి తర్వాత నా సొంత ప్రొడక్షన్‌లో ఓ సినిమా వస్తుంది. నేను నటించిన ‘గామి’ సినిమా రెండు నెలల్లో విడుదలవ్వనుంది. మనం ఓ సినిమా తీసి అది పాన్‌ ఇండియా చిత్రం అని అనకూడదు. దానికి ఆ స్థాయి ఉందా లేదా అనేది ఆడియన్స్‌ నిర్ణయిస్తారు. అందుకనే నేను నా సినిమాను పాన్‌ ఇండియా అని చెప్పలేదు. మల్టీ లాంగ్వేజ్‌ చిత్రం అని చెప్పా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని