ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పనిచేశాను..

జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించి.. వృత్తి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి.. ప్రస్తుతం పరిశ్రమలో స్టార్‌ హీరోగా కొనసాగుతున్నారు నటుడు విజయ్‌ సేతుపతి.....

Published : 15 Jul 2021 01:27 IST

చెన్నై: జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించి.. వృత్తి జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి.. ప్రస్తుతం పరిశ్రమలో స్టార్‌ హీరోగా కొనసాగుతున్నారు నటుడు విజయ్‌ సేతుపతి. హీరోగానే కాకుండా విలన్‌గానూ రాణిస్తున్న ఆయన మరికొన్నిరోజుల్లో బుల్లితెర వేదికగా ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఆయన వ్యాఖ్యాతగా ‘మాస్టర్‌ చెఫ్‌’ అనే వంటల కార్యక్రమం కోలీవుడ్‌లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ ప్రోగ్రామ్‌ ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌ జరిగింది. ఇందులో భాగంగా.. సినిమాల్లోకి రాకముందు తాను డబ్బు సంపాదించడం కోసం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పనిచేసినట్లు తెలిపారు.

‘చెన్నైలో ఓ కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో డబ్బులు కోసం ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో పనిచేశాను. కాలేజీ పూర్తైన వెంటనే రూమ్‌కి వెళ్లి తిరిగి సాయంత్రం 7.30 గంటలకు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కి వెళ్లేవాడిని. అర్ధరాత్రి 12.30 వరకూ అక్కడే పనిచేసేవాడిని. పని మొత్తం పూర్తయ్యాక అక్కడే భోజనం చేసేవాడిని. అలా నాకు ప్రతి నెలా రూ.750 జీతం ఇచ్చేవాళ్లు. హోటల్‌లోనే కాకుండా ఓసారి మూడు నెలల పాటు టెలిఫోన్‌ బూత్‌లో కూడా పనిచేశాను’ అని విజయ్‌ తెలిపారు. అనంతరం తన కిష్టమైన స్నాక్స్‌ గురించి చెబుతూ.. ‘చిన్నప్పటి నుంచి నాకు ఉల్లిసమోసా అంటే ఎంతో ఇష్టం. ప్రస్తుతం ఉల్లిసమోసా మనకు దొరకడం లేదు. కానీ ఇంట్లో ఉంటే తప్పకుండా సాయంత్రం పూట ఉల్లిసమోసా ఒక కప్పు టీ తీసుకుంటాను’ అని విజయ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని