MS Raju: ప్రభాస్‌, నేనూ ఆ సినిమాకు ప్రాణం పెట్టాం.. కానీ...!

ఆయనో భారీ సినిమాలకు నిర్మాత, మంచి కథల రచయిత ఆపై ప్రత్యేక అభిరుచితో దర్శకుడిగా మారిపోయారు.

Updated : 20 Jun 2022 11:28 IST

ఆయనో భారీ సినిమాలకు నిర్మాత, మంచి కథల రచయిత ఆపై ప్రత్యేక అభిరుచితో దర్శకుడిగా మారిపోయారు. గొప్ప చిత్రాలను తీసిన ఆయన తన పంథాను మార్చుకొని కొత్త తరం ఆలోచనలకు అనుగుణంగా సినిమాలను చేస్తూ ప్రత్యేకంగా నిలిచారు. ఆయనే ఎమ్మెస్‌ రాజు(MS Raju). ఈటీవీ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి అతిథిగా వచ్చారు. సినీ పరిశ్రమతో ఆయనకున్న అనుబంధం, ఒడుదొడుకులను పంచుకున్నారు.

మీ నాన్న రాయపరాజు కొన్ని సినిమాలు నిర్మించారు. ఎమ్మెల్యే ఏడుకొండలు సినిమాకు మంచిపేరు వచ్చినా తర్వాత సినిమాలను నిర్మించలేదు. మీరు నిర్మాతగా మారిన తర్వాత డబ్బులు పోగొట్టుకుంటామనే భయం మీలో కలగలేదా..?

ఎమ్మెస్‌ రాజు: నాకు మొదటి నుంచి డాషింగ్‌ ప్రొడ్యూసర్‌ అనే పేరుంది. డబ్బులు పోతాయా..? వస్తాయా..?అని ఆలోచించలేదు. ఒక కథ అనుకున్నప్పుడు..కథకు ఎంత దూరమైనా వెళ్లి దానికి తగినట్టు ఎంతైనా ఖర్చు చేయాలి. అదే ఆలోచిస్తా. 

కొంతమంది నిర్మాతలు బాగా జోక్యం చేసుకోవడంతో దర్శకులకు స్వేచ్ఛ ఉండదనే అభిప్రాయం ఉంది. ఇలాంటి విషయంలో మీరు ఎలా ఉండేవారు..?

ఎమ్మెస్‌ రాజు: అది నా సినిమా అనే భావనతో ఉంటా. కథ, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్‌ ఇలా అన్నింటి దగ్గర కూడా నా సినిమా అని చేస్తా.. నాకు ఎవరెవరీ భాగస్వామ్యం అవసరమో తీసుకుంటా. 

చాలామంది హీరో డేట్స్‌ దొరికితే సినిమా చేస్తాననుకుంటారు. మీరు అలా ఎప్పుడైనా అనుకున్నారా..?

ఎమ్మెస్‌ రాజు: నేను కథకు తగ్గట్టుగానే హీరోను తీసుకున్నా కానీ, హీరో డేట్స్‌ దొరికితే సినిమా చేద్దామనుకోలేదు. ఒకటి, రెండు సినిమాలు హీరో అడిగితే చేశా. అవి పోయాయి.

మీరు శత్రువు సినిమాతో నిర్మాతగా మారారు. తొలినాళ్లలో సినిమా అనుభవం ఎలా ఉండేది..?

ఎమ్మెస్‌ రాజు: మా అబ్బాయి పుట్టిన ఏడాదికి సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ మొదలెట్టా. కోడి రామకృష్ణ మంచి మిత్రుడు. నా ఆలోచనలను పంచుకున్నా. నేను చెప్పిన పాయింట్‌ నచ్చింది. దానిపై వర్క్‌ చేయాలన్నారు. అలా కోడి రామకృష్ణ ప్రోత్సహించడంతో నాలో మార్పు వచ్చింది. ఆయనే నాకు స్పూర్తి. ఆయన అన్ని రకాల సినిమాలు చేశారు. ‘దేవి’ అప్పట్లోనే పాన్‌ ఇండియా సినిమా. అన్ని భాషల్లో విడుదల చేశాం. ఎన్ని కోట్లు వచ్చాయో లెక్కలేదు.

మీరు ఎన్నో సినిమాలు తీశారు. మీకు కమర్షియల్‌గా సంతృప్తి ఇచ్చిన సినిమా ఏది..?

ఎమ్మెస్‌ రాజు: చాలా ఉన్నాయి. ‘మనసంతా నువ్వే’ చిన్న సినిమా అయినా బాగా డబ్బు సంపాదించి పెట్టింది. ఆ తర్వాత ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘దేవి’ కూడా బాగానే ఆడాయి.

దేవీపుత్రుడు కమర్షియల్‌గా కలిసి వచ్చిందా..?

ఎమ్మెస్‌ రాజు: డిస్ట్రిబ్యూటర్లు సినిమాతో నష్టపోయారు. అప్పటి క్రేజ్‌కు బాగా డబ్బు ఖర్చు పెట్టా. ఆ సినిమాకు మంచి ధర పెట్టి కొన్నారు. నష్టపోయిన వారికి ‘మనసంతా నువ్వే’ సినిమాతో వచ్చిన డబ్బును చెల్లించా. 

సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ అనగానే క్రమశిక్షణ అంటారు. పేమెంట్స్‌ చక్కగా ఉంటాయంటారు. ఇది మీకు ఎలా సాధ్యమయ్యింది ?

ఎమ్మెస్‌ రాజు: అది నైతిక విలువలతో చేసే పని మాత్రమే. కష్టపడి పనిచేసిన వారికి డబ్బు ఇవ్వాలి. ఒకసారి కొంతమందికి డబ్బు చెల్లించాల్సి ఉంటే ఇష్టపడి కొన్న కారు అమ్మేసి ఇచ్చా. వాళ్లకు డబ్బు ఇవ్వకుండా నేను కారులో తిరగడం సరికాదనుకున్నా..!

మీ అభిరుచికి తగ్గట్టుగా నిర్మాతగా, రచయితగా అయ్యారు. ఆ తర్వాత తూనీగా..తూనీగాతో దర్శకుడయ్యారు. సుమంత్‌ను లాంచ్‌ చేయడం కోసం ఆ నిర్ణయం తీసుకున్నారా.?

ఎమ్మెస్‌ రాజు: కథ ప్రకారమే చేశా. నాపై ఉన్న ముద్ర. నా సినిమాలతో వచ్చిన పేరును మార్చొద్దని అనుకొని చేసిన సినిమా అది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని గమనించలేకపోయా.

మీ చాలా సినిమాల్లో ఎక్కువగా శాస్త్రిగారే రాసిన పాటలు ఉన్నాయి. ఆయనతో మీకున్న అనుబంధం ఎలాంటిది..?

ఎమ్మెస్‌ రాజు: సీతారామ శాస్త్రిగారు చాలా గొప్ప వ్యక్తి. ఆయన పాటలే కాదు..పుస్తకాల గురించి కూడా మాట్లాడేవారు. ఆయన దగ్గర నేనుండి పాటలు రాయించుకున్నా. ఎక్కువగా రాత్రిపూటే పాటలు రాసేవారు.

కథకుడిగా కొలంబస్‌ సినిమాకు కథ ఇచ్చారు. ఆ కోణం మీలో ఎలా పుట్టింది..?

ఎమ్మెస్‌ రాజు: నేను ఆ సినిమా చేయాలా..? వద్దా అనుకునే సమయంలో వేరే నిర్మాత కథ బాగుందని చెప్పినపుడు ఆ కథ ఇచ్చేశా. నాకు కూడా కొంత భాగస్వామ్యం ఉంది.

సినీ రంగంలో ఆటుపోట్లు, ఒడుదొడుకులు ఎన్నో చూశారు. మీకు ఒక పరాజయం వచ్చినపుడు దాన్ని ఎలా పరిష్కరిస్తారు..?

ఎమ్మెస్‌ రాజు: సినిమా రంగం ఒక్కటే కాదు. రాజకీయమైనా, షేర్‌ మార్కెటయినా కష్టనష్టాలుంటాయి. వ్యాపారం అన్నప్పుడు ఎత్తుపల్లాలుంటాయి. మళ్లీ నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తారు. నాకు రిటైర్‌ అవ్వాలని లేదు. సినిమాలతోనే నా ప్రయాణం. వయసులో ఉన్నప్పుడు సాధించిన విజయాలకంటే..కొంత వయసు వచ్చిన తర్వాత పరాజయాల నుంచి విజయాల వైపు వెళ్లడం గొప్పతనం. మనం గట్టిగా ఉన్నామనేది చూడాలి. ఇప్పుడు రచయితగా, దర్శకుడిగా ఉన్నత స్థాయికి వెళ్లాలనుకుంటున్నా. ఈ విషయంలో నేను పూర్తి ఆత్మస్థైర్యంతో ఉన్నా. 

పౌర్ణమి సినిమాకు మనసు పెట్టారా.? లేదా  ప్రాణం పెట్టారా..? అన్నంతగా సినిమాపై నమ్మకం పెట్టుకున్నారు!

ఎమ్మెస్‌ రాజు: నమ్మకం ఎప్పుడూ పెట్టుకోను. ప్రాణమే పెడతా. నేను ప్రేక్షకుల అభిరుచికి ప్రాధాన్యం ఇచ్చా. ప్రతి సినిమాకు కొత్తదనం చూపించాలనుకుంటా. వైవిధ్యంగా ఉండాలనుకుంటా. ప్రతి సినిమా విజయవంతం కావాలని తపిస్తా. పౌర్ణమికి చాలా కష్టపడ్డాం. ప్రభాస్‌కు ఛత్రపతి, నాకున్న ఇమేజ్‌ను ప్రేక్షకులు ఊహించుకున్నారు. మంచి సినిమా అన్నా.. ఎక్కడో కాస్త అసంతృప్తికి లోనయ్యారు.

మిగతా సినిమాల కంటే భిన్నంగా డర్టీహరీ ఎందుకు చేయాలనే ఆలోచన వచ్చింది...?

ఎమ్మెస్‌ రాజు: ఒక మిత్రుడి సూచనతో దర్శకుడిగా మారా. గతంలో విఫలమైనా డర్టీహరీ సినిమా చేయడానికి గల కారణం మారిన పరిస్థితులే. అలాంటి సినిమాను ఇంతకు ముందు చేయకపోవడంతో చేయాలనుకున్నా. ఆ సినిమా పేరుతోనే చాలా రకాలుగా అనుకున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత వాళ్ల అభిప్రాయం మార్చుకున్నారు. కొవిడ్‌తో థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేసినా మంచి ఆదరణ లభించింది. 

7డేస్‌ 6 నైట్‌ ఎలా ఉండబోతోంది..? డర్టీహరీలాగా ఉంటుందా..? ఇందులో ఎవరెవరు ఉంటారు..?

ఎమ్మెస్‌ రాజు: నా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభంలోనే అనుకున్నా. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి సినిమా కొత్తగా ఉండాలనుకుంటున్నా. ఒకదానికొకటి సంబంధం లేకుండా కొత్తదనంతోనే సినిమాలు చేస్తా. డర్టీహరీని హిందీలో చేయాలనే ఆఫర్‌ వచ్చినా చేయలేదు. చేసిన సినిమాను మళ్లీ వేరే భాషలో నేనే తీయను. వేరే వారిని పెట్టుకోండని చెప్పా. ఈ కొత్త సినిమా ఇప్పటి యువతకు నచ్చే సినిమా. సోది లేకుండా నేరుగా యువతకు కనెక్టు చేసేలా సినిమా ఉంటుంది. 20-20 మ్యాచ్‌లాగా అనుకోండి. మా అబ్బాయితో పాటు రోహన్‌, హీరోయిన్లు మెహరా, కృతిక ఉన్నారు. చాలా మంది కొత్తవాళ్లు ఉన్నారు. మా అబ్బాయి చాలా బాగా చేశారు. ఈ సినిమా హిట్‌ అవుతుందని అనుకుంటున్నా. ఈ నెల 24న సినిమా విడుదల అవుతుంది.

తండ్రి డైరెక్టర్‌, కొడుకు హీరో అయితే రొమాంటిక్‌ సన్నివేశాల్లో ఇబ్బందిగా ఉంటుందటగా..?

ఎమ్మెస్‌ రాజు: అలాంటిదేం లేదు. తండ్రీ కొడుకుల అనుబంధం ఉంటుంది. అదే సమయంలో వృత్తి పరమైన బాధ్యతగానే చూస్తాం.

ఓటీటీ ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని ప్రభావం సినిమా ఇండస్ట్రీపై ఎలా ఉంటుంది..?

ఎమ్మెస్‌ రాజు: మన సినిమాను యూట్యూబ్‌లో చూసినా, ఓటీటీలో చూసినా సినిమా థియేటర్‌ అనుభూతి ప్రత్యేకంగా ఉంటుంది. మ్యాజిక్‌ ఇన్‌ ది డార్క్‌ సినిమా. ఒంటరిగా సినిమా చూస్తే అనుభూతి వేరేగా ఉంటుంది..అందరిలో చూస్తే వేరేగా అనిపిస్తుంది. సినిమా బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వస్తారు.

ఓటీటీకి వస్తే ఎలాంటి కథలను ఎంచుకుంటారు..?

ఎమ్మెస్‌ రాజు: చాలా ఉన్నాయి. కొవిడ్‌ సమయంలో కొన్ని కథలు అనుకున్నా. చాలా సినిమాలు చూశా. బర్సాత్‌ సినిమాలో రెండు పాత్రలు నచ్చాయి. ఆ పాత్రలతోనే 7 డేస్‌ 6నైట్స్‌ సినిమాకు బ్యాక్‌డ్రాప్‌లో గోవాను ఎంచుకుని చేశా.

ఒక్కడు బ్లాక్‌బస్టర్‌..మళ్లీ మహేష్‌తో కలిసి పని చేయలేదు..? మీ బంధం ఎలా ఉంటుంది...?

ఎమ్మెస్‌ రాజు: ఒకట్రెండుసార్లు యంగ్‌ డెరెక్టర్లను పంపించారు. కథ నచ్చలేదు. సినిమా చేయకపోయినా పరవాలేదు. కానీ, ‘ఒక్కడు’ పేరు చెడగొట్టొద్దు అనుకున్నా. త్రివిక్రమ్‌తో అనుకున్నా ముందుకు సాగలేదు. మహేష్‌ చాలా క్రమశిక్షణతో ఉంటారు. మహేష్‌ ఓ స్నేహితుడిలా ఉంటారు. చాలా మంచి మనిషి.

నిర్మాతగా మీరు చేయాలనుకున్న డైరెక్టర్లు ఉన్నారా..?

ఎమ్మెస్‌ రాజు: ఎందుకు లేరు. చాలా మంది ఉన్నారు. విశ్వనాథ్‌తో సినిమా చేయాలనుకున్నా చేయలేకపోయాను. 

ఒక సందర్భంలో పెద్ద హీరోలతో సినిమా చేయాలనుకోవడం లేదన్నారు..? ప్రత్యేకించి కారణాలున్నాయా..?

ఎమ్మెస్‌ రాజు: పెద్ద హీరో కేవలం కథ, సినిమా మాత్రమే. సినిమాలు చేస్తున్నానంటే నేను పెద్ద హీరోలతో చేస్తున్నట్టే కదా.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని