Updated : 17 Sep 2021 08:01 IST

కలవరపెడుతున్న మరో ఉపద్రవం

అమెరికాలో ‘హవానా’ కలకలం

ణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు, జీవాయుధాలు... ఇంతకాలంగా భూగోళాన్ని వణికిస్తూ వచ్చిన అస్త్రాలివి. యావత్‌ ప్రపంచాన్నే గడగడలాడించి, ఆధునిక దేశాలనూ కిందుమీదులు చేసిన కరోనా వైరస్‌ సైతం ఇదే తరహా ప్రాణాంతక ఆయుధాల్లో ఒకటి కావచ్చనే అనుమానాలు ఓ పక్క పీడిస్తున్నాయి. ఇంకోపక్క మరో కొత్త విపత్తు పొంచి ఉందా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో ‘హవానా సిండ్రోమ్‌’ పేరిట వెలుగులోకి వచ్చిన కొత్త తరహా రుగ్మత అందరిలో ఆందోళన పెంచుతోంది. ఇప్పటిదాకా అమెరికా దౌత్యవేత్తలే దీనికి లక్ష్యంగా మారారు. ఇటీవల అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ వియత్నాం పర్యటన ఈ సమస్య కారణంగా కొన్ని గంటలపాటు ఆలస్యం కావడంతో ఇది మరోసారి వెలుగులోకి వచ్చింది. వియత్నాంలోని హనోయ్‌ దౌత్య కార్యాలయంలో రుగ్మత బారిన పడిన ఓ వ్యక్తిని అత్యవసర చికిత్స నిమిత్తం తరలించాల్సి వచ్చింది. వియత్నాంలోని అమెరికా దౌత్య సిబ్బంది ఇళ్లవద్ద కూడా ఇలాంటి అంతుచిక్కని దాడికి లోనైనట్లు తెలుస్తోంది. ఇది ఎందుకు వస్తోందో, ఎక్కడినుంచి వస్తోందో అగ్రరాజ్య శాస్త్రవేత్తలకూ అంతుచిక్కడం లేదు.

దౌత్య సిబ్బందే లక్ష్యం

ప్రధానంగా అమెరికా దౌత్యవేత్తలనే పీడిస్తున్న ఈ సమస్యను తొలిసారిగా 2016లో క్యూబా రాజధాని హవానా నగరంలో అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బందిలో గుర్తించారు. మొదటిసారిగా హవానాలో బయటపడటంతో ఆ పేరుతోనే పిలుస్తున్నారు. అంతుచిక్కని ఈ సమస్య బారిన పడిన వారిలో మెదడుపై ఏదో తెలియని తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. చుట్టూ కందిరీగల దండు తిరుగుతున్నట్లుగా రొద భరించలేనంత ఇబ్బందికి గురిచేస్తుంది. వికారం, తలపోటు, నిస్సత్తువ, కళ్లు తిరగడం, నిద్రలేమి, వినికిడిలోపం, మతిమరుపు వంటి లక్షణాలు వేధిస్తాయి. క్యూబాలో ఈ ప్రభావానికి లోనైనవారిలో మూడోవంతు మందికి వినికిడి శక్తి దెబ్బతింది. వారి మెదళ్లు సైతం దెబ్బతిన్నట్లు స్కానింగ్‌లలో బయటపడింది. ప్రమాదాల్లో గాయపడే స్థాయిలో మెదడుకు నష్టం వాటిల్లినట్లు తేలింది. క్యూబా, చైనాల్లోని దౌత్య కార్యాలయాల్లో పనిచేసే వారిలోనే బాధితులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. దౌత్యవేత్తలు, గూఢచారులు, సైన్యం, సీఐఏ సిబ్బంది, విదేశాంగ శాఖ అధికారులే బాధితులుగా మారుతుండటంతో కుట్రకోణాల్ని అనుమానిస్తున్నారు. గత అయిదేళ్ల వ్యవధిలో పెద్దసంఖ్యలోనే జనం ఈ సమస్యతో సతమతమైనట్లు అంచనా. జర్మనీ, ఆస్ట్రేలియా, తైవాన్‌, ఆస్ట్రియా, రష్యాలోని అమెరికా దౌత్య సిబ్బంది కూడా ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. అమెరికా అధికారుల కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు వంటి ఉపకరణాల నుంచి నిఘా సమాచారాన్ని సేకరించే క్రమంలో ఇలాంటి దాడులు జరుగుతూ ఉండవచ్చనే అనుమానాలూ లేకపోలేదు.

ఇదంతా ఉద్దేశపూర్వకంగా, కుట్రతో జరుగుతోందనేది అగ్రరాజ్యం బలమైన అనుమానం. కొన్ని రకాల ‘సోనిక్‌’ శబ్ద తరంగాల కారణంగా ఈ తరహా సమస్య ఉత్పన్నమవుతున్నట్లు మొదట్లో అమెరికా అనుమానించింది. కానీ, అది తప్పుడు నిర్ధారణగా తేలడంతో మైక్రోవేవ్‌ తరంగాల సహాయంతో గుర్తుతెలియని ప్రత్యర్థులు తమవారిని లక్ష్యంగా చేసుకొంటున్నట్లు అగ్రరాజ్యం ఇప్పుడు గట్టిగా అనుమానిస్తోంది. జాతీయ విజ్ఞానశాస్త్ర, ఇంజినీరింగ్‌, వైద్యశాస్త్రాల అకాడమీ (ఎన్‌ఏఎస్‌ఈఎం) పరిశోధనల ప్రకారం మైక్రోవేవ్‌ తరంగాలను వాడి ఉండవచ్చన్న అంచనాలకు వచ్చారు. 1950ల్లో సోవియట్‌ యూనియన్‌ మైక్రోవేవ్‌ తరంగాలను మారణాయుధాల్లా ఉపయోగించడంలో సాధ్యాసాధ్యాలపై పరిశోధనలు చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ అధ్యయన నివేదికను జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా బలపరచడం విశేషం. అల్ట్రాసౌండ్‌, విష పదార్థాలు, ఎలెక్ట్రానిక్‌ ఆయుధాలు కూడా కావచ్చనే అనుమానాలున్నాయి.

ఎటూ తేలని వైనం...

ఇన్నేళ్లుగా ఎఫ్‌బీఐ, సీఐఏ, అమెరికా సైన్యం, జాతీయ ఆరోగ్య కేంద్రం, వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం వంటివన్నీ ఈ ఘటనలపై పరిశోధనలు చేపట్టినా ఏ విషయాన్నీ తేల్చలేకపోయాయి. విదేశాల్లో దౌత్య కార్యాలయాల్లో ఒత్తిడి కారణంగా సంభవిస్తున్న మానసిక జబ్బుగా కొంతమంది శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొన్ని శక్తి పుంజాలు కారణమవుతున్నట్లు 2020 డిసెంబర్‌లో జాతీయ విజ్ఞానశాస్త్రాల అకాడమీ తన నివేదికలో పేర్కొంది. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలను ఎదుర్కొనేందుకు తగిన యంత్రాంగాన్ని సంసిద్ధం చేయాలని అది సూచించింది. గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌- ఈ రుగ్మతకు సంబంధించి క్యూబాపై నిందారోపణలు గుప్పించారు. తమ దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకుంటూ, క్యూబా సిబ్బందిని బహిష్కరించారు. క్యూబా, రష్యాలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తరవాత సిండ్రోమ్‌ సంగతేమిటో తేల్చాలని నిశ్చయించినట్లు విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకన్‌ సైతం జూన్‌లో ప్రకటించడం గమనార్హం. ఈ ఆరోపణల్ని క్యూబా తిరస్కరిస్తోంది. ఆరోపణలకు శాస్త్రీయ ఆధారాలు లేవని, ఇన్నేళ్లలో ఒక్క ఆధారాన్నీ గుర్తించలేదని క్యూబా శాస్త్రవేత్తల కమిటీ నివేదిక స్పష్టంచేసింది. మరోవైపు, మైక్రోవేవ్‌ తరహా ఆయుధాల దిశగా చైనా, అమెరికా ఇప్పటికే ముందడుగు వేయగా, మన డీఆర్‌డీఓ సైతం ‘డైరెక్టెడ్‌ ఎనర్జీ వెపన్స్‌’ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త తరహా మారణాయుధాల్ని కనిపెడుతున్న ఆధునిక ప్రపంచ దేశాలు ఏ తరహా అస్త్రాలను సిద్ధం చేస్తున్నాయనేదీ కాలమే తేల్చాలి.

- డి.శ్రీనివాస్‌

Read latest Nri News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని