అమెరికాలో 12% పెరిగిన భారతీయ విద్యార్థులు

అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య 2021లో 12% పెరిగింది. అదే సమయంలో చైనా నుంచి వచ్చినవారి సంఖ్య 8%కి పైగా తగ్గింది. ఈమేరకు అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) తాజాగా విడుదల

Updated : 08 Apr 2022 09:29 IST

 చైనా నుంచి 8% తగ్గుదల

2021లో విదేశీ విద్యార్థులపై యూఎస్‌సీఐఎస్‌ నివేదిక

వాషింగ్టన్‌: అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య 2021లో 12% పెరిగింది. అదే సమయంలో చైనా నుంచి వచ్చినవారి సంఖ్య 8%కి పైగా తగ్గింది. ఈమేరకు అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో పలు అంశాలను వెల్లడించింది. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా నుంచి వచ్చినవారే అత్యధికం కాగా.. భారత్‌ తర్వాతి స్థానంలో ఉంది. ‘‘ఆసియా నుంచి వచ్చేవారిలో భారత్‌, చైనాల విద్యార్థులే కీలకం. 2020తో పోలిస్తే 2021లో చైనా నుంచి 33,569 మంది తగ్గగా, భారత్‌ నుంచి 25,391 మంది పెరిగారు’’ అని పేర్కొంది. నివేదికలోని ముఖ్యాంశాలివే..

* భారతీయ విద్యార్థుల్లో 37% మంది మహిళలు. అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల్లో  71.9% చైనా, భారత్‌లకు చెందినవారే. మొత్తంగా ఆసియా నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య 2020తో పోలిస్తే 34,781 తగ్గింది. దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, జపాన్‌ల నుంచి కూడా విద్యార్థుల సంఖ్య తగ్గింది.

* అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల చేరికలపై కొవిడ్‌ మహమ్మారి ప్రభావం 2021లోనూ కొనసాగింది. సెవిస్‌ (స్టూడెంట్స్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ విజిటర్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌) రికార్డుల ప్రకారం 2021లో మొత్తం ఎఫ్‌-1, ఎం-1 (నాన్‌-ఇమ్మిగ్రెంట్‌) వీసా విద్యార్థుల సంఖ్య 12,36,748. ఇది 2020తో పోలిస్తే 1.2% తక్కువ.

* 224కి పైగా దేశాలు, ప్రాంతాల నుంచి ఎఫ్‌-1, ఎం-1 విద్యార్థులు అమెరికాకు వచ్చారు. 2021లో మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో అత్యధికంగా 2,08,257 (16.8%) మంది కాలిఫోర్నియాలో చేరారు.

* 2021లో ఉన్నత విద్యలో మొత్తం 11,42,352 మంది అంతర్జాతీయ విద్యార్థులు డిగ్రీలు పొందారు. ఇది 2020 (11,21,981) కంటే ఎక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని