NRI news: విదేశాల్లోని పిల్లలకు తెలుగు నేర్పించడం ఎలా?

 ప్రవాసాంధ్రుల పిల్లలకు తెలుగు నేర్పడం చాలా కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ‘వీధి అరుగు-నార్వే’ వేదిక ఆధ్వర్యంలో నవంబరు  20 సాయంత్రం ‘విదేశాల్లో ఉన్న పిల్లలకు తెలుగు నేర్పించడం ఎలా?’ అనే అంశంపై అంతర్జాల కార్యక్రమం నిర్వహించారు.

Updated : 21 Nov 2022 23:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రవాసాంధ్రుల పిల్లలు తెలుగులో చక్కటి ప్రావీణ్యం సాధించేందుకు చాలా మంది కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘వీధి అరుగు-నార్వే’ వేదిక ఆధ్వర్యంలో నవంబరు  20 సాయంత్రం ‘విదేశాల్లో ఉన్న పిల్లలకు తెలుగు నేర్పించడం ఎలా?’ అనే అంశంపై అంతర్జాల కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డా. గీతా మాధవి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. దాదాపు 15 దేశాల నుంచి పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నార్వే నుంచి ప్రముఖ వ్యాఖ్యాత గాయత్రి గోవిందరాజు అనుసంధానకర్తగా వ్యవహరించారు. మొదటగా జర్మనీ నుంచి ఆరేటి మోహన్ స్వాగతవచనాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. డా. గీతా మాధవి ప్రసంగం ఆకట్టుకుంది. ఆమె ఎన్నో విషయాలను సరళంగా వివరించారు. తెలుగు అక్షరాలు మహేశ్వరుని ఢమరుకం నుంచి ఎలా పుట్టాయో, పాణిని అష్టాధ్యాయి నుంచి ఉదాహరించి, ఉత్పత్తి స్థానము ఆధారంగా అక్షరాలను ఎలా వర్గీకరించారో తెలియజెప్పారు. పిల్లలకు ఆసక్తి కలిగేలా, వృత్తాల ఆధారంగా అక్షరాలను ఎలా రాయవచ్చో అని చిట్కాలు చెప్పారు. పాటల రూపంలో కూడా ఆడుతూ పాడుతూ పిల్లలకు తెలుగు ఎలా నేర్పించవచ్చో వివరించారు.

డా. గీతా మాధవి మాట్లాడుతూ “తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు కదా. అలా కాకుండా, ఇటాలియన్ భాషనే తెలుగు ఆఫ్ ద వెస్ట్ అనే స్థాయికి మన భాష ఎదగాలి’’ అని అన్నారు. మా “వీధి అరుగు” వేదిక ద్వారా తెలుగు నేర్పించడం కోసం భవిష్యత్ కార్యాచరణకు ఒక యాప్‌ని అభివృద్ధి చేయాలనుకుంటున్నట్లు నిర్వాహకులు తరిగోపుల వెంకటపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో దీర్ఘాశి విజయ్ భాస్కర్, విక్రమ్ సుఖవాసి, డా. గుంటుపల్లి శ్రీనివాస్, మల్లేశ్వరరావు, నిరంజన్ స్వీడన్ తెలుగు కమ్యూనిటీ, కామేశ్వర శర్మ, రామకృష్ణ ఉయ్యూరు, లక్ష్మణ్, అన్నపూర్ణ మహీంద్ర, తొట్టెంపూడి గణేష్, తర్రా అప్పలనాయుడు, వెంకట్, కామేశ్వర శర్మ, బాలాజీ యాదవ్, రవితేజ గుబ్బ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని