హిందూ దేవాల‌య మ‌హా కుంభాభిషేకానికి భారీ స్పంద‌న.. రూ.కోట్లలో విరాళాలు!

ఇంటికోపువ్వు.. ఈశ్వరుడికో మాల అన్న చందంగా అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో నూత‌నంగా....

Published : 09 Mar 2022 20:29 IST

సెయింట్ లూయిస్‌: ఇంటికో పువ్వు.. ఈశ్వరుడికో మాల అన్న చందంగా అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో నూత‌నంగా నిర్మించిన‌ హిందూ దేవాల‌యానికి నిర్వహించబోయే మ‌హా కుంభాభిషేకానికి స్థానికంగా ఉన్న తెలుగువారి నుంచి విశేష స్పందన లభించింది. మ‌హా కుంభాభిషేక క్రతువులో తమ వంతు పాత్ర పోషించేందుకు అనేకమంది ముందుకొచ్చి త‌మ వంతు విరాళం ప్రకటించారు. ఆగ‌మ‌శాస్త్ర సంప్రదాయంలో నిర్మాణం జరిగిన ఈ ఆలయానికి ఈ ఏడాది మే 11 నుంచి 15 వరకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఆల‌య నిర్వాహ‌కులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. మ‌హా కుంభాభిషేకం అనేది అతి పెద్ద క్రతువు కావడంతో దీంట్లో ప్రతి ఒక్కరినీ భాగస్వాముల్ని చేయాలని నిర్వాహకులు భావించారు. ఈ క్రమంలోనే విరాళాల సేకరణకు శ్రీకారం చుట్టారు. మహా కుంభాభిషేక నిర్వహణకు ఆదివారం రోజున నిధుల సమీకరణ కార్యక్రమాన్ని స్థానిక ఆలయ ప్రాంగణంలో నిర్వహించగా.. 700 మందికి పైగా స్థానిక ప్రవాసీయులు, భక్తులు విరాళాలు ఇచ్చి త‌మ భ‌క్తి ప్రపత్తుల్ని చాటుకున్నారు. సుమారు మిలియన్ డాలర్లు (₹7.5కోట్లు) మేర విరాళాలుగా అందినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ గంగవరపు శ్రీనివాస రజనీకాంత్, అధ్యక్షురాలు డా.రాజ్యలక్ష్మి నాయుడు తెలిపారు. 

మే 11-15 తేదీల్లో నిర్వహించే ఈ కుంభాభిషేకాన్ని విజయవంతం చేయాలని నిధులు సమీకరణ కమిటీ అధ్యక్షుడు షారద్ పారిఖ్ కోరారు. నిధుల స‌మీక‌ర‌ణ‌కు అశోక్ కుమార్, ప్రసన్న అయ్యర్, పుట్టగుంట మురళీకృష్ణ, సాక్షి విజయ్, ఇంటూరి శేషు, యార్లగడ్డ కిషోర్, పర్వతనేని శ్రీనివాస్, ఎర్రపోతిన శ్రీనివాస్, రామ్మోహ‌న్‌రెడ్డి పాడూరు, ర‌వికాంత్ తదితరులు తోడ్పడినట్లు మీడియా సమన్వయకర్త రాజా సూరపనేని తెలిపారు. నిధుల స‌మీక‌ర‌ణ కార్యక్రమంలో ప్రవాస భార‌తీయ‌ యువతీ యువకుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని