ఘనంగా ‘సరిహద్దులు దాటి..’ పుస్తకావిష్కరణ

డాక్టర్‌ నిమ్మగడ్డ శేషగిరిరావు రచించిన ‘సరిహద్దు దాటి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగింది.

Updated : 05 Jan 2024 14:47 IST

ప్రయాణాలు చాలామంది చేస్తారు. అలాగని అందరూ యాత్రికులు అవలేరు. దానికి సంకల్పముండాలి. బలమైన కాంక్ష ఉండాలి. అలాంటివారే తమ యాత్రానుభూతులను పదిమందితో పంచుకోగలరు. ఆ కోవకే చెందుతారు డాక్టర్‌ నిమ్మగడ్డ శేషగిరిరావు. వృత్తిరీత్యా లండన్ నగరంలో ఫోరెన్సిక్ సైకియాట్రీ మెడికల్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన.. ఇప్పటి వరకు 120 దేశాలు సందర్శించారు. ఆ దేశాల అందచందాలను గ్రంథస్థం చేసి ‘సరిహద్దులు దాటి..’ పేరిట పుస్తకాన్ని వెలువరించారు. ఆయన ఆంగ్ల రచనను ప్రొఫెసర్ ఎం.ఆదినారాయణ, అట్లూరి జయశ్రీ తెలుగులో అనువాదం చేశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జనవరి 3న జరిగింది.

హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హజరయ్యారు. వారికి మిసిమి సంపాదకులు వల్లభనేని అశ్వినీ కుమార్ స్వాగతం పలికారు. మిసిమి కర్త, కర్మ, క్రియ అయిన ఆలపాటి బాపన్నతో పాటు వర్జీనియా నుంచి విచ్చేసిన డాక్టర్‌ రావెళ్ళ రమేష్, రచయితలు అనిల్ అట్లూరి, దాసరి అమరేంద్ర, వేమూరి సత్యం, యాత్రా రచనలపై పరిశోధన చేసిన మచ్చా హరిదాసు, యాత్రా రచయిత్రి స్వర్ణ కిలారి వంటి వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ పుస్తకావిష్కరణ సభకు ఆచార్య కొలకలూరి ఇనాక్ అధ్యక్షత వహించారు. మానవత్వమే తన భాషగా డాక్టర్‌ శేషగిరి ఈ యాత్రలు సాగించారని, ఆయా ప్రదేశాల సంస్కృతిని, వివిధ దేశాల ప్రజల ఆహార అలవాట్లను ఈ పుస్తకంలో చక్కగా పొందుపరిచారని అభినందించారు. గ్రంథావిష్కర్త ఆచార్య ఎన్.గోపి మాట్లాడుతూ.. చాలా మంది యాత్రలు చేస్తారు గానీ.. అనుభవాలను పుస్తక రూపంలో తేవడం కొందరే చేస్తారన్నారు. అలాంటి ప్రయత్నం చేసిన డా.శేషగిరి అభినందనీయులు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జీవితం దుర్లభం.. తిరగడమే ఉత్తమం అన్న రాహుల్ సాంకృత్యాయన్ మాటలు గుర్తుచేశారు.

విశిష్ట అతిథిగా విచ్చేసిన సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి అధ్యక్షులు ఆచార్య సి.మృణాళిని ప్రసంగిస్తూ యాత్రా చరిత్రలు చదవటం వల్ల ఆ యాత్రికుడు మనకు అర్థమవుతారని చెప్పారు. పుస్తక అనువాదం చేయడంలో కృషి చేసిన ప్రొ.ఎం.ఆదినారాయణ వారు మాట్లాడుతూ యాత్రా సాహిత్యానికి.. సాహిత్యంలో సముచిత స్థానం కల్పించాలని కోరారు. ఏనుగు వీరాస్వామి రచించిన కాశీయాత్ర తొలి యాత్రా రచన అని, దాన్ని ప్రపంచం గుర్తించేందుకు మనమంతా కృషి చేయాలన్నారు.

అనువాదకులు అట్లూరి జయశ్రీ మాట్లాడుతూ ప్రయాణాలు చేయటం ద్వారా మనం ఇతరుల నుంచి నూతన శక్తిని పొందుతామని, అలాగే ఆయా భాషల సాహిత్యాన్ని కూడా తెలుసుకోగలుగుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రంథకర్త డాక్టర్‌ నిమ్మగడ్డ శేషగిరిరావు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యాత్ర తన జీవితంలో ఓ భాగమై పోయిందని, ప్రతి వ్యక్తీ సంవత్సరంలో ఒక నెలను ప్రయాణాలు చేసేందుకు కేటాయించుకోవాలన్నారు. యాత్రలు చేసే క్రమంలో ఓర్పు అలవరుచుకోవాలని, ఆయా దేశాల సంస్కృతిని గౌరవిస్తూ స్థానిక ప్రజలతో మమేకమై స్థానికంగా దొరికే ఆహారాన్ని ఆస్వాదించాలని సూచించారు. తనకు తెలుగు నేర్పిన చిన్ననాటి గురువులు అంబటి రమణమ్మ, సాంఘిక శాస్త్రం బోధించిన విద్యాసాగర్‌ను వేదికపైకి ఆహ్వానించి గ్రంథ ప్రతులను రచయిత వేమూరి సత్యం గారి ద్వారా అందజేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.ఎన్.బాలాచారి పాల్గొని మాట్లాడుతూ.. మంచి సాహిత్యాన్ని ప్రజలకు చేర్చేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ కృషి చేస్తోందని పేర్కొన్నారు. వృత్తి, ప్రవృత్తిని సమన్వయం చేస్తూ ఎందరికో శేషగిరి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రొఫెసర్‌ వై.పార్థసారధి కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని