టాల్‌స్కౌట్స్‌ ఆధ్వర్యంలో నెలరోజుల పాటు బుక్‌ డ్రైవ్‌

21వ శతాబ్దంలో చాలా దూరం వచ్చేశాం. శాస్త్రసాంకేతిక రంగాల్లో కళ్లు చెదిరే అభివృద్ధి సాధించాం. కానీ ఇప్పటికీ 25 కోట్ల మంది పిల్లలు బడికి వెళ్లే అదృష్టానికి నోచుకోవడం లేదు. ........

Published : 25 Jan 2022 18:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 21వ శతాబ్దంలో చాలా దూరం వచ్చేశాం. శాస్త్రసాంకేతిక రంగాల్లో కళ్లు చెదిరే అభివృద్ధి సాధించినప్పటికీ ఇంకా 25 కోట్ల మంది పిల్లలు బడికి వెళ్లే అదృష్టానికి నోచుకోవడం లేదు. అర్ధాకలితో, అరకొర సౌకర్యాలతో చదువు మీద సరిగా దృష్టి పెట్టలేని వారి సంఖ్య ఇంతకు ఎన్నో రెట్లు ఉంటుంది. మనం అంతా తలచుకుంటే, కాస్త పెద్ద మనసు చేసుకుంటే ఈ సమస్యను తేలికగా దాటేయగలం. అందుకే విద్య అవసరం గురించి గుర్తుచేసేందుకు యునెస్కో ఏటా జనవరి 24న ‘అంతర్జాతీయ విద్య దినోత్సవం’ ఘనంగా నిర్వహిస్తోంది.

ఈసారి టాల్ స్కౌట్స్ కూడా ఈ లక్ష్యసాధనలో పాలు పంచుకుంది. పిల్లల చదువుకు అవసరమయ్యే పుస్తకాలు, ఇతర సామాగ్రి కోసం నెల రోజుల పాటు (జనవరి 10 - ఫిబ్రవరి 10 వరకు) బుక్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇక జనవరి 24న టాల్ ఆధ్వర్యంలో జరిగిన కథావేదిక మరో విశేషం. పిల్లలు తమ తోటివారి కోసం కథను వినిపించే ప్రయత్నమే ఇది. తొలుత 24 గంటల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నాం. కానీ 500 మందికి పైగా పిల్లలు ఇందులో నమోదు చేసుకోవడంతో 48 గంటల పాటు కార్యక్రమాన్ని పొడిగించాల్సి వచ్చింది. ఇందులో అమెరికా, బ్రిటన్, భారత్‌ సహా అనేక దేశాల నుంచి పిల్లలు పాల్గొన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కథలు వినిపించారు. కొందరు అంధ విద్యార్థులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని తోటి పిల్లల కోసం తమ గొంతుకను వినిపించి స్ఫూర్తిని చాటడం విశేషం!

ఈ కథల మారథాన్ నిర్వహించడం వెనుక చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు టాల్‌స్కౌట్స్ నిర్వాహకులు. వీటి ద్వారా ఓ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడమే టాల్ తొలి ఉద్దేశం. దానివల్ల లోకంలో ఏ మూలన ఉన్న విద్యార్థి అయినా, ఎప్పుడైనా వీటిని వినవచ్చు. విలువలు, విజ్ఞానం, వినోదం అందించే కథలను తమ జీవితంలో భాగం చేసుకోవచ్చు. ఒక లైవ్ స్ట్రీమింగ్ ద్వారా నిర్వహించిన ఈ మారథాన్‌కు విశేష స్పందన వచ్చినట్టు టాల్ స్కౌట్స్ తెలిపింది. ఈ కథల యజ్ఞంలో స్వయంగా పిల్లలనే భాగస్వాములుగా చేయడం వల్ల, వాళ్లలో సామాజిక స్పృహను పెంచాలనే లక్ష్యమూ ఉంది. అన్నింటా చురుగ్గా ఉండే విద్యార్థులే గనక ముందడుగు వేస్తే… ఈ లోకంలో ఎలాంటి సమస్యకైనా పరిష్కారం సాధ్యం కదా! నిజానికి టాల్ స్కౌట్స్ ఆవిర్భావం వెనకాల ఉన్న లక్ష్యం కూడా ఇదే!!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని