తానా ఆధ్వర్యంలో ఘనంగా ‘తెలుగుతనం–తెలుగుధనం’ సదస్సు

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సాహిత్య సదస్సు ఘనంగా జరిగింది. ‘తెలుగుతనం–తెలుగుధనం’ పేరుతో అంతర్జాలంలో జరిగిన ఈ సాహిత్య సదస్సుకు ఎన్నారై ప్రముఖులతో పాటు ప్రఖ్యాత తెలుగు సాహితీవేత్తలు.........

Updated : 27 Jul 2021 22:49 IST

అట్లాంటా: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సాహితీ సదస్సు ఘనంగా జరిగింది. ‘తెలుగుతనం–తెలుగుధనం’ పేరుతో అంతర్జాలంలో జరిగిన ఈ సాహిత్య సదస్సుకు ఎన్నారై ప్రముఖులతో పాటు ప్రఖ్యాత తెలుగు సాహితీవేత్తలు హాజరై ప్రసంగించారు. తెలుగు సాహిత్య వైభవాన్ని మరింత కొత్త శిఖరాలకు చేర్చే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా తానా మాజీ అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి మాట్లాడుతూ.. గతేడాది మే నెలలో సాహిత్యవేదిక ఆవిర్భావం నుంచి, 15 నెలలుగా వివిధ సాహిత్యాంశాలపై ప్రముఖ సాహితీవేత్తల ప్రసంగాలతో ప్రపంచ వేదికపై సాహితీ సౌరభాలను గుభాళింపచేయగలగడం ఎంతో సంతోషకరమన్నారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తన ప్రారంభోపన్యాసంలో తెలుగు భాష, సాహిత్య పరిరక్షణకు, భావితరాలకు భద్రంగా అందించే కృషిలో కట్టుబడి ఉన్నామన్నారు. తన పదవీకాలంలో తానా ప్రపంచ సాహిత్య వేదికను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తానా ప్రపంచ సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈనాటి సాహిత్య కార్యక్రమం చాలా ఆసక్తిదాయకమైందని.. పాల్గొన్న అతిథులంతా వారి వారి రంగాల్లో ఆరితేరినవారేనంటూ అందరికీ స్వాగతం పలికారు.

తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. విశిష్ట అతిథిగా పాల్గొన్న కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. కృతివెంటి శ్రీనివాసరావు వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను, సవాళ్ళను ఎదుర్కొని నేడు ఉన్నత స్థితిలో భాద్యతాయుత పదవిలో ఉండడం తెలుగు వారికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. 1954లో సాహిత్య అకాడమీ ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటిదాకా సాహిత్య అకాడమీ చేపడుతున్న కార్యక్రమాలను సోదాహరణంగా వివరిస్తూ 24 భాషల్లో విశేష కృషి చేస్తున్న వారికి పురస్కారాలు, సాహిత్య ప్రచురణలు, సమావేశాలతో  నిరంతరం కృషి చేస్తోందన్నారు. తెలుగు భాషలో వచ్చిన సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించే అనువాదకులు తక్కువగా ఉన్నారని, ఎక్కువమంది ముందుకు వస్తే తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి చేరడం సులభమవుతుందని ప్రసాద్‌ తోటకూర తెలిపారు. లబ్దప్రతిష్టులైన సాహితీవేత్తల జీవిత విశేషాలను వివరిస్తూ వీడియో ఫిలిమ్స్ తెలుగు కవులపై తక్కువగా ఉన్నాయని..  ఆ దిశగా మరింత కృషి జరగాలన్నారు. సాహిత్య అకాడమీ వెబ్‌సైట్‌లో తెలుగు భాషలో కొన్ని పేజీలు ఉండాలని, అవి రూపొందించే దిశలో దానికి కావలసిన సాంకేతిక సహకారం అందించడానికి తానా సంసిద్ధంగా ఉన్నట్టు డా. తోటకూర తెలపగా.. దీనిపై కృతివెంటి సానుకూలంగా స్పందించారు. కేంద్ర సాహిత్య అకాడమీతో కలిసి తానా ప్రపంచ సాహిత్యవేదిక ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయవచ్చని ఆహ్వానించారు. 

ప్రముఖ తెలుగు వేదకవి, సినీ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై “పాట-పద్యం–పేరడీ–ప్రశ్న” అనే అంశంపై రెండు గంటలపాటు చేసిన సాహిత్య ప్రసంగం ఆద్యంతం అలరించింది. ఛలోక్తులతో, ఆలోచనలు రేకెత్తిస్తూ అందరినీ ఆకట్టుకుంది. కవి జొన్నవిత్తుల కలం ద్వారా వెలువడిన ఎన్నో సినీ గీతాల్లో ప్రత్యేక సందర్భాల్లో రాసిన వాటిని ప్రేక్షకులతో పంచుకోగా..అంతా హర్షధ్వానాలు చేశారు.  అక్షర నాదం, స్వరనాదం రెండూ ఏకీకృతమై వ్యక్తమయ్యే పద్య రసభావన శ్రోతలను ఆకట్టుకొని వారి మనసులను రంజింప చేసే శక్తి పద్యాలకుందని.. అందుకే అవి అందర్నీ ఆకర్షిస్తాయన్నారు. పలు సినిమాల కోసమై రాసిన ఘటోత్కచుడు మీద, పాండవుల మీద, రావణాసురుడు మీద, యముడు మీద పద్యాలు, దుబాయ్‌లో పర్యటించినపుడు వారి సంస్కృతిలో భాగమైన బెల్లి డాన్స్ చూసినప్పుడు, సింగపూర్ దేశంలో రోప్ వే పై ప్రయాణించినప్పుడు కల్గిన అనుభూతితో  రాసిన పద్యాలు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, ఎన్.టి. రామారావు, అక్కినేనిలపై రాసిన పద్యాలను రాగయుక్తంగా ఆలపించిన పాటలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. 

సమకాలీన సామాజిక, రాజకీయాల్లో పార్టీ మార్పిడిలు, రాజకీయ నాయకుల శుష్క వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేస్తున్న వైఖరిని ఎండగడుతూ వ్యంగ్య ధోరణితో పాడిన పేరడీ పాటలు కవి జొన్నవిత్తుల సామాజిక స్పృహను, యదార్థ స్థితిని గొప్పగా ఆవిష్కరించాయి. ప్రశ్నా విభాగంలో గత 75 ఏళ్లుగా భారతదేశం సాధించిన ప్రగతి, కోల్పోయిన మానవీయ సంబంధాలపై స్పందించమన్నపుడు ప్రస్తుతం కావాల్సింది సత్యం, ధర్మం, త్యాగం అనే లక్షణాలు కలిగిన సుపరిపాలన ప్రజలకందించేది నాయకులని,  అలాంటి వారిని ప్రజలు ఎన్నుకోనంత వరకు దేశం పురోగతి సాధించజాలదని హితవు పలికారు. 

ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు డా. ఎర్రాప్రగడ రామకృష్ణ మాట్లాడుతూ.. మాట్లాడడం ఒక కళ అని, మనం మాట్లాడే మాటలు పలువుర్ని ఆకట్టుకునే విధంగా ఎలా ఉండాలి, ఒకే మాట పలు ప్రాంతాలలో ఎలాంటి విపరీతమైన అర్ధాలకు దారి తీస్తుంది, కొంచెం శ్రద్ధ వహిస్తే అందరూ బాగా మాట్లాడే అవకాశం ఉంటుంది అని “మాట తీరు” అనే అంశంపై అద్భుతంగా ప్రసంగించారు. తానా ఉత్తరాధ్యక్షులు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ.. ఘన చరిత్ర కల్గిన తెలుగు భాష, సాహిత్య వైభవాలను పరిరక్షించి పరివ్యాప్తి చేయడం, తెలుగు కవులు, కళాకారులను ఆదరించడంలో తానా ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, తానా ప్రపంచ సాహిత్య వేదికను బలోపేతం చేయడంలో కృషి చేస్తున్న వారందరికీ, హాజరైన అతిథులకు, ప్రసారం చేసిన వివిధ ప్రసార మాధ్యమాల వారికి, వీక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని