Joe Biden: అమెరికా కంటే.. భారత్‌ మీడియాదే ఉత్తమ ప్రవర్తన..!

అమెరికా మీడియా కంటే భారత్‌ మీడియానే ఉత్తమంగా వ్యవహరించిందంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలను వైట్‌హౌస్‌ సమర్థించింది.

Published : 28 Sep 2021 23:46 IST

అధ్యక్షుడి వ్యాఖ్యలను సమర్థించిన వైట్‌హౌస్‌

వాషింగ్టన్‌: అమెరికా మీడియా కంటే భారత్‌ మీడియానే ఉత్తమంగా వ్యవహరించిందంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలను వైట్‌హౌస్‌ సమర్థించింది. అంతమాత్రాన అమెరికా మీడియాపట్ల ఆయన కఠినంగా వ్యవహరించినట్లు కాదని అక్కడి మీడియాను బుజ్జగించే ప్రయత్నం చేసింది. అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా భారత్‌ మీడియాను జో బైడెన్‌ ప్రశంసించడాన్ని వైట్‌హౌస్‌ మరోసారి సమర్థించింది.

భారత ప్రధాని నరేంద్రమోదీతో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత మీడియాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రశంసించారు. అమెరికా మీడియా కంటే భారత్‌ మీడియా ఉత్తమంగా ప్రవర్తించిందన్నారు. విదేశీ అధినేత సమక్షంలో సరైన అంశంపై ప్రశ్నలు అడగలేదని అమెరికా విలేకరులను విమర్శించారు. ఇదే విషయంపై అమెరికా జర్నలిస్టులు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీ ప్రశ్నల వర్షం కురిపించారు. అయినప్పటికీ.. అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు సరైనవేనని జెన్‌ సాకీ స్పష్టం చేశారు.

‘అధ్యక్షుడు చెప్పింది ఏంటంటే.. అమెరికా జర్నలిస్టులు ప్రతిసారి ఏదైనా ప్రత్యేక అంశంపై మాట్లాడరు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ల గురించి మాట్లాడాలని అధ్యక్షుడు భావించారు. కానీ, అమెరికా మీడియా ప్రశ్నలు మాత్రం అందుకు సంబంధించినవి కొన్ని మాత్రమే ఉండగా.. చాలావరకూ వేరేవి ఉన్నాయి. అందుకే అధ్యక్షుడు ఆ విధంగా స్పందించి ఉంటారు’ అని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకీ పేర్కొన్నారు. అంతమాత్రాన ప్రతిసారీ అదేవిధంగా వ్యవహరించినట్లు కాదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే, అమెరికా మీడియాతో భారత్‌ మీడియాను పోల్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన ఓ విలేకరి.. రిపోర్టర్స్‌ వితౌట్‌ బార్డర్స్‌(RSF) నివేదిక ప్రకారం పత్రికా స్వేచ్ఛలో భారత్‌ 142వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. అలాంటప్పుడు భారత్‌తో ఎలా పోల్చుతారని ప్రశ్నించారు. అందుకు సమాధానమిచ్చిన ప్రెస్‌ సెక్రటరీ.. బాధ్యతలు స్వీకరించిన ఈ తొమ్మిది నెలల్లో అధ్యక్షుడు 140కిపైగా మీడియా సమావేశాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. మీడియా పట్ల ఆయనకు గౌరవం ఉందని గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని