నిరాశ, నిస్పృహలతోనే భారాసకు రాజీనామా

భారాసలో ప్రజాస్వామ్యం, పారదర్శకత లేవని, అన్నీ ఏకపక్ష నిర్ణయాలే తీసుకుంటున్నందున నిరాశ, నిస్పృహలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు.

Published : 24 Sep 2023 04:43 IST

సీఎం కేసీఆర్‌కు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: భారాసలో ప్రజాస్వామ్యం, పారదర్శకత లేవని, అన్నీ ఏకపక్ష నిర్ణయాలే తీసుకుంటున్నందున నిరాశ, నిస్పృహలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. పార్టీలో తాను నిర్వహిస్తున్న అన్ని బాధ్యతల నుంచి తప్పించడంతోపాటు శాసనసభ ఎన్నికలకు ప్రకటించిన అభ్యర్థుల జాబితా నుంచి తన పేరు ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్‌కు శనివారం లేఖ రాశారు. ‘‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే లక్ష్యంతో 2014లో పార్టీలో చేరాను. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షునిగా నేను చేసిన కృషిని గుర్తించి ఎమ్మెల్సీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర నిరాశకు లోనయ్యాను. కింది స్థాయి కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు పట్టించుకోవడం లేదు. వ్యక్తిగతంగా, మీడియాలో నాపై దురుద్దేశపూరిత ప్రచారం చేస్తున్న పార్టీ సీనియర్‌ నేతలతో నాకు తీవ్ర విభేదాలున్నాయి. కొంతమంది చేతిలో కీలుబొమ్మగా మారిన పార్టీలో నేను కొనసాగలేను’’ అని పేర్కొన్నారు. కాగా దుండిగల్‌లోని ఆయన నివాసానికి వచ్చిన అభిమానులతో మైనంపల్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాను మల్కాజిగిరి నుంచే పోటీ చేస్తానని వారితో స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని