Rahul Gandhi: రాహుల్‌ ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’కు మణిపుర్‌లో అనుమతి నిరాకరణ

బహిరంగ ప్రదేశాల్లో రాహుల్‌ భారత్‌ జోడో యాత్రకు మణిపుర్‌ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో యాత్ర రూట్‌మ్యాప్‌ను మార్చారు.

Updated : 10 Jan 2024 15:24 IST

ఇంటర్నెట్‌డెస్క్: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) జనవరి 14 నుంచి ప్రారంభించాల్సిన ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’కు అడ్డంకులు ఎదురయ్యాయి. తూర్పు ఇంఫాల్‌లోని హట్టా కాంగ్జెబుంగ్‌లో మొదలు కావాల్సిన ఈ యాత్రకు మణిపుర్‌ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. 

మణిపుర్‌ పీసీసీ అధ్యక్షుడు కె.మేఘచంద్ర పార్టీ నాయకులతో కలిసి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ను కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని అక్కడ రాహుల్‌ యాత్రకు అనుమతి ఇవ్వలేమని ముఖ్యమంత్రి వారికి వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం దురదృష్టకరమని మేఘచంద్ర పేర్కొన్నారు. ప్రజాహక్కులు, రాజకీయ హక్కుల ఉల్లంఘనగా దీనిని అభివర్ణించారు. బహిరంగ ప్రదేశాల్లో యాత్రకు అనుమతులు ఇవ్వకపోవడంతో.. థౌబాల్‌ జిల్లాలోని ఓ ప్రైవేటు స్థలానికి మార్చినట్లు వెల్లడించారు. 

విధేయతతో ఉండండి.. దూకుడు వద్దు

రాహుల్‌ యాత్రకు అనుమతుల విషయంలో తమ ప్రభుత్వం పూర్తిగా భద్రతా సంస్థల నివేదికలపైనే ఆధారపడిందని సీఎం మంగళవారం వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం చాలా సంక్లిష్టంగా మారిందన్నారు. ఈ యాత్ర జనవరి 14న మొదలై మార్చి 30న ముగుస్తుంది. 66 రోజులపాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు కొనసాగనుంది. 100 లోక్‌సభ స్థానాల్లో చేపట్టే ఈ యాత్రలో అన్ని వర్గాల వారితో రాహుల్‌ మాట్లాడతారని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ గతంలో వెల్లడించారు. మణిపుర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్రల్లో సాగనుంది. తొలి దశలో జరిగిన భారత్‌ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్‌ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని