
oxfam report 2021:కుబేరులకు కోట్లు కురిపించిన కొవిడ్
ఆక్స్‌ఫామ్ ప్రత్యేక నివేదికలో వెల్లడి
దిల్లీ, దావోస్: కొవిడ్ 19 విరుచుకుపడిన ఈ రెండేళ్లలో ప్రపంచమంతటా 99శాతం ప్రజల ఆదాయాలు కోసుకుపోయి 16 కోట్ల మంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోగా.. ధనవంతులు మాత్రం మహా సంపన్నులయ్యారని ఆక్స్ ఫామ్ సంస్థ వెల్లడించింది. దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక ఆన్‌లైన్ శిఖరాగ్ర సభ ప్రారంభమైన సందర్భంగా ‘ప్రాణాంతక అసమానతలు’ అనే శీర్షికతో ఆక్స్ ఫామ్ ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. కొవిడ్ కాలంలో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు కుబేరుల పాలిట కల్పవృక్షాలయ్యాయి. కేంద్ర బ్యాంకులు తమ తమ దేశాల ఆర్థిక పునరుద్ధరణకు లక్షల కోట్ల డాలర్లను విడుదల చేయగా, అవి స్టాక్ మార్కెట్‌కు చేరి కుబేరుల సంపదను కొండంతలు చేశాయి. ధనిక దేశాల ప్రభుత్వాలు కొవిడ్ టీకాలను తయారుచేయడానికి తమ ఫార్మా కంపెనీలకు వందల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయం చేయగా, అవి టీకాలను అమ్ముకుని కోట్లకు పడగలెత్తాయి. కరోనా ముందునాళ్లతో పోలిస్తే, వైరస్ విరుచుకుపడిన ఈ రెండేళ్లలో ప్రపంచంలోని 10 మంది మహా కుబేరుల సంపద రెట్టింపై 111 లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకింది. కొవిడ్ తెచ్చిపెట్టిన ఆర్థిక అసమానతల వల్ల ప్రపంచంలో ప్రతి 4 సెకన్లకు ఒకరు చొప్పున, రోజుకు 21,000 మంది చొప్పున మరణిస్తున్నారనే దారుణ సత్యాన్ని బయటపెట్టింది.
భారత్‌లోనూ మహాకుబేరులయ్యారు..
భారతదేశంలోనూ కుబేరులు మహాకుబేరులయ్యారు. దేశంలోని 10 మంది అతి సంపన్నుల వద్ద చేరిన ధనరాశులతో ప్రతి బిడ్డకూ 25 ఏళ్లపాటు పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు చదువు చెప్పవచ్చని ఆక్స్ ఫామ్ తెలిపింది. కొవిడ్ కాలంలో భారతీయ మహా సంపన్నుల సంఖ్య 39 శాతం పెరిగి 142కు చేరింది. వీరందరి వద్ద నేడు రూ. 53 లక్షల కోట్ల ధనం పోగుపడింది. దేశంలోని 55.5 కోట్లమంది నిరుపేదలకు మొత్తం రూ.43 లక్షల కోట్ల ఆస్తులు ఉండగా, కేవలం 98 మంది అతి సంపన్నుల వద్ద సరిగ్గా అంతే సంపద చేరింది. 98 మంది మహా కుబేరులపై ఒక్క శాతం సంపద పన్ను విధిస్తే, ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా పథకమైన ఆయుష్మాన్ భారత్‌ను ఏడేళ్లపాటు నిర్విఘ్నంగా నడపవచ్చు. వీరి వద్ద ఉన్న సంపద కేంద్ర బడ్జెట్ కన్నా 41 శాతం హెచ్చు. వారి మీద 4 శాతం సంపద పన్ను విధిస్తే రెండేళ్లపాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు నిధులు సమకూర్చవచ్చు.
* భారత్‌లోని 10 మంది శతకోటీశ్వరులు రోజుకు 10 లక్షల డాలర్ల చొప్పున ఖర్చుపెట్టినా వారి దగ్గరున్న ధనరాశులు కరిగిపోవడానికి 84 ఏళ్లు పడుతుంది. భారతీయ సంపన్నులందరి మీద 1శాతం పన్ను విధిస్తే, ప్రభుత్వ ఆరోగ్య బడ్జెట్ నిధులను 271శాతం పెంచవచ్చు. దానివల్ల ఏ ఒక్క భారతీయుడూ వైద్యం కోసం సొంత జేబు నుంచి ఖర్చుచేయాల్సిన అవసరం ఉండదు. 100 మంది శతకోటీశ్వరుల వద్ద ఉన్న మొత్తం సంపదతో రానున్న 365 ఏళ్లపాటు మహిళా స్వయం సహాయక సంఘాల కోసం జాతీయ గ్రామీణ జీవనాధార పథకాన్ని విజయవంతంగా నిర్వహించవచ్చు. లేదా 17 ఏళ్లపాటు మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహించవచ్చు.