Ashwin-Jadeja: దిగ్గజ బౌలర్లను వెనక్కి నెట్టి.. టెస్టుల్లో భారత స్పిన్‌ ద్వయం ఘనత

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్పిన్నర్లు అదరగొట్టారు. అశ్విన్, జడేజా చెరో మూడేసి వికెట్లు తీశారు. ఈ క్రమంలో మరో ఘనతను సాధించారు.

Updated : 25 Jan 2024 16:00 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా స్పిన్‌ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ - రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించారు. భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జోడీగా వీరు అవతరించారు. అనిల్ కుంబ్లే - హర్భజన్‌ సింగ్‌ జోడీని అధిగమించారు. ఇంగ్లాండ్‌తో (IND vs ENG) తొలి టెస్టులో అశ్విన్‌, జడేజా చెరో మూడేసి వికెట్లు తీశారు. దీంతో టెస్టుల్లో వీరిద్దరూ కలిసి 506 వికెట్లు తీసినట్లైంది. కేవలం 50 టెస్టుల్లోనే ఈ ఫీట్‌ను సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌కు ముందువరకు అనిల్ కుంబ్లే - భజ్జీ 501 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. హర్భజన్‌-జహీర్‌ జోడీ 474 వికెట్లు, ఉమేశ్‌ యాదవ్‌ - అశ్విన్‌ కలిసి 431 వికెట్లు తీశారు. 

అంతర్జాతీయంగా వారే..

అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు మాత్రం ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్‌ అండర్సన్-స్టువర్ట్‌ బ్రాడ్. వీరిద్దరూ కలిసి 139 మ్యాచుల్లో 1,039 వికెట్లు పడగొట్టారు. బ్రాడ్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. అండర్సన్ మాత్రం కొనసాగుతున్నాడు. అయితే, భారత్‌తో హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అండర్సన్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు. ఆస్ట్రేలియా దిగ్గజాలు షేన్ వార్న్-గ్లెన్‌ మెక్‌గ్రాత్ 104 మ్యాచుల్లో 1,001 వికెట్లు తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని