Gill - Ashwin: అక్కడ కోహ్లీ కీలకపాత్ర పోషించాడు.. మొదట్లో గిల్ ఇబ్బందిగా కనిపించాడు: అశ్విన్‌

ఇంగ్లాండ్‌తో (IND vs ENG) టెస్టు సిరీస్‌లో.. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ బ్యాటర్‌గా శుభ్‌మన్‌ గిల్ రాణించాడు. ఇటు ఫీల్డింగ్‌లో చురుగ్గా ఉండాల్సిన ప్లేస్‌లో కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు.

Published : 14 Mar 2024 16:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో (IND vs ENG) యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ బ్యాటింగ్‌లో ఫామ్‌ అందుకొన్నాడు. రెండు సెంచరీలు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ, పుజారా గైర్హాజరీతో కఠిన సవాళ్లు ఎదురయ్యే మూడో స్థానంలో గిల్ (Shubman Gill) బ్యాటింగ్‌కు దిగాడు. ఇక ఫీల్డింగ్‌ ప్లేస్‌మెంట్‌లోనూ కోహ్లీ (Virat Kohli) ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడో.. అదే స్థానంలో గిల్ ఫీల్డింగ్‌ చేశాడు. ప్రారంభంలో కాస్త ఇబ్బందిపడినట్లు అనిపించినా కుదురుకుని మంచి నైపుణ్యాలను ప్రదర్శించాడని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసించాడు.

‘‘షార్ట్‌ మిడ్‌ వికెట్‌ వద్ద ఫీల్డింగ్‌ చేయడం చాలా కష్టం. అక్కడ విరాట్ కోహ్లీ ఉండేవాడు. అతడిని రిప్లేస్‌ చేయడం మామూలు విషయం కాదు. మైదానంలో చురుగ్గా ఉండాలి. సురేశ్‌ రైనా కూడా తన కెరీర్‌లో ఇక్కడే ఎక్కువగా ఫీల్డింగ్‌ చేశాడు. ఇప్పుడు గిల్ ఆ పొజిషన్‌ను తీసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో కాస్త ఇబ్బంది పడినట్లు అనిపించాడు. చివరి మ్యాచ్‌ నాటికి మాత్రం చాలా మెరుగయ్యాడు.  డకెట్‌ క్యాచ్‌ను పట్టిన తీరు అద్భుతం. గేమ్‌లో ప్రతిరోజూ మెరుగయ్యేందుకు చాలా కష్టపడతాడు. 

శుభ్‌మన్‌ గిల్‌ ఫీల్డింగ్‌ విషయంలోనే కాకుండా.. ఒత్తిడిని తట్టుకొనే ఆటగాడు. తుది జట్టులో అతడిని ఎందుకు ఆడించడం అనే మాటలను విన్నప్పుడు ఎవరికైనా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. గిల్ కూడా ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు. టెక్నిక్స్‌పరంగా కొద్దికాలం ఇబ్బందిపడినా వాటన్నింటినీ దాటుకొని దూసుకొచ్చాడు. అతడిని ‘తర్వాత తరం భారత సూపర్‌స్టార్’ అనడంలో అతిశయోక్తి లేదు. ఒత్తిడిని జయించి అత్యుత్తమ ప్రదర్శన చేయడం అద్భుతమే’’ అని అశ్విన్‌ (Ashwin) వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని