Shubman Gill: సచిన్‌.. విరాట్ కోహ్లీ.. వీరిద్దరిలో గిల్‌ ఎవరిని ఎంచుకొన్నాడంటే?

వన్డేల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో టీమ్‌ఇండియా (Team India) యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) ముందుంటాడు. కివీస్‌పై (IND vs NZ) భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేయడంలో గిల్‌ కీలక పాత్ర పోషించాడు. అయితే అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్‌ ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం మాత్రం అదిరిపోయింది.

Published : 25 Jan 2023 12:34 IST

ఇంటర్నెట్ డెస్క్: ఒకే సిరీస్‌లో డబుల్‌ సెంచరీతోపాటు శతకం సాధించిన టీమ్‌ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (360) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌తో సమంగా నిలిచాడు. మ్యాచ్ అనంతరం ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతున్న సందర్భంగా అడిగిన ప్రశ్నకు గిల్‌ చాలా సమయస్ఫూర్తిగా సమాధానం ఇచ్చాడు.

క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. వీరిద్దరిలో ఎవరిని ఎంచుకొంటావని గిల్‌ను వ్యాఖ్యాత అడగ్గా.. అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. ‘‘ నేను విరాట్ భాయ్‌ను అనుకొంటున్నా. ఎందుకంటే సచిన్‌ సర్ నేను క్రికెట్‌ ఆడే సమయానికి ఆటకు వీడ్కోలు పలికేశాడు. సచిన్‌ అంటే మా నాన్నకు చాలా ఇష్టం. అతడు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన సమయంలో  నేను చాలా చిన్నవాడిని. అదే విరాట్ కోహ్లీ హవా నడుస్తున్న సమయంలోనే నేనూ ఆడుతున్నా. అతడి నుంచి ఎంతో నేర్చుకొంటున్నా’’ అని గిల్  అన్నాడు.

మూడో వన్డే జరిగిన ఇండోర్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 385/9 స్కోరు సాధించింది. గిల్, రోహిత్ శతకాలు బాదేశారు. అనంతరం డేవన్‌ కాన్వే కూడా సెంచరీ కొట్టినా... కివీస్‌ 295 పరుగులకే కుప్పకూలింది. ఈ సందర్భంగా ప్రధాన కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా పిచ్‌పై స్పందించాడు. ఇలాంటి పిచ్‌పై బంతులను సంధించడానికి బౌలర్లు కాస్త ఇబ్బంది పడ్డారని తెలిపాడు. ఛేదనలోనూ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిందని పేర్కొన్నాడు. అయితే భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారని అభినందించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని