Asia Cup 2023: జకా అష్రాఫ్‌తో జైషా భేటీ.. షెడ్యూల్‌ ప్రకారమే ఆసియా కప్‌!

ఆసియా కప్ (Asia Cup 2023) నిర్వహణపై నెలకొన్న సందిగ్ధత దాదాపు తొలగిపోయింది. షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Updated : 12 Jul 2023 10:17 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) నిర్వహణకు సంబంధించి తుది నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. హైబ్రిడ్‌ మోడల్‌కు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఆమోదించినట్లు సమాచారం. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా, పీసీబీ ఛైర్మన్‌ జకా అష్రాఫ్‌ బుధవారం రాత్రి సమావేశమైనట్లు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్‌ ధుమాల్‌ వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించేందుకు పీసీబీ అంగీకారం తెలిపినట్లు చెప్పారు. నేడు జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో ఆసియా కప్‌ పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఖరారు చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం అరుణ్‌ ధుమాల్‌ ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మీట్‌ (CEC) కోసం డర్బన్‌లో ఉన్నారు. 

‘‘పీసీబీ ఛైర్మన్‌ జకా అష్రాఫ్‌తో బీసీసీఐ కార్యదర్శి భేటీ జరిగింది. ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే టోర్నీ జరగనుంది. పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, శ్రీలంక వేదికగా 9 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్Xపాక్‌ మ్యాచ్‌తో సహా ఫైనల్‌ గేమ్‌ కూడా లంకలోనే నిర్వహిస్తారు. ఇక పాక్‌ మంత్రి మజారీ చేసిన వ్యాఖ్యలపై భేటీలో ఎలాంటి చర్చ జరగలేదు. పాకిస్థాన్‌లో భారత్‌ ఆడే ప్రశ్నే లేదు. ఈ సమావేశంలో షెడ్యూల్‌పైనే చర్చ సాగింది. దానిపై తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది’’ అని ధుమాల్‌ తెలిపారు. 

ఆగస్ట్‌ 31 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆసియా కప్‌ జరగనుంది. పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్‌ కౌన్సిల్ (ACC) ఇంకా వెల్లడించలేదు. తమ దేశంలో నేపాల్‌తో మాత్రమే పాకిస్థాన్‌ ఆడుతుంది. ఇక పాక్‌ వేదికగా అఫ్గాన్‌Xబంగ్లాదేశ్‌, శ్రీలంక X బంగ్లా, శ్రీలంక X అఫ్గాన్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్‌ ఆడే మ్యాచులన్నీ శ్రీలంకలోనే నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు