Kuldeep - Jadeja: 3 ఓవర్లలో 4 వికెట్లు ఏంటి సంగతి.. ‘కుల్‌జా’ ముచ్చట్లలో ఇంకేం చెప్పారంటే?

వెస్టిండీస్‌తో మూడు వన్డేల(WI vs IND) సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో జడేజా-కుల్‌దీప్‌ ద్వయం అరుదైన ఘనత సాధించింది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ విశేషాలివే. 

Updated : 28 Jul 2023 18:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత్‌ భారీ విజయానికి కుల్‌జా (కుల్‌దీప్‌ యాదవ్‌ - రవీంద్ర జడేజా) ద్వయం అదిరిపోయే బౌలింగ్‌ ఓ కారణం. ఇద్దరూ కలిపి ఏడు వికెట్లు తీసి వన్డే సిరీస్‌ శుభారంభానికి కారణమయ్యారు. ఈ మ్యాచ్‌ తర్వాత కుల్‌దీప్‌ - జడేజాల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. దానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. బంతి అందుకోగానే మూడు ఓవర్లు ముగించేలోపే నాలుగు వికెట్లు తీశావ్‌.. ఏంటి సంగతి? అంటూ జడేజా ప్రశ్నలు వేశాడు.. దానికి కుల్‌దీప్‌ గూగ్లీల్లాంటి సమాధానాలు కూడా ఇచ్చాడు.

‘‘నా కంటే ముందు బౌలింగ్ చేసిన ఫాస్ట్ బౌలర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ముకేశ్‌కు తొలి మ్యాచ్‌ అయినా కూడా చక్కగా బౌలింగ్ చేశాడు. ఇక, నీ బౌలింగ్‌లో వరుస వికెట్లు తీశావు. నేను కూడా వికెట్లు తీయాలనే బౌలింగ్‌ చేశాను. అదృష్టం కొద్ది మూడు ఓవర్లలోనే నాలుగు వికెట్లు పడ్డాయి. ఒక టీమ్‌కు బౌలింగ్‌ బృందం ఇలా ఉంటేనే బాగుంటుంది’’ అని కుల్‌దీప్‌ తన వికెట్ల వేట వెనుక ఆలోచన చెప్పాడు. ‘‘వెస్టిండీస్‌ను తక్కువ పరుగులకే ఆలౌట్‌ చేయాలనే ఉద్దేశంతోనే బౌలింగ్ చేశా. రెండో ఇన్నింగ్స్‌లో బంతి ఈ విధంగా బౌన్స్ అయితే పరుగులు చేయడం కష్టం అనిపించింది’’ అని జడేజా తన ఆలోచనలను వివరించాడు. 

స్పిన్నర్ల మాయ.. ఇషాన్‌ దూకుడు.. తొలి వన్డేలో ఆసక్తికర వీడియోలు

‘‘విరాట్‌ కోహ్లీ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడని, ఏ బౌలర్‌కైనా తన బౌలింగ్‌లో అలాంటి క్యాచ్‌ పడితే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఫీల్డర్ల నుంచి ఇలాంటి మద్దతు లభిస్తే..  కచ్చితంగా బౌలర్లు మరింత ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేస్తారు’’ అని కోహ్లీ క్యాచ్‌ గురించి జడేజా చెప్పాడు. ఆఖరిగా ‘‘నీతో కలిసి వికెట్లు తీయడం చాలా ఆనందంగా ఉంది. మనిద్దరం కలిసి వికెట్లు పడగొడుతూనే ఉందాం’’ అంటూ కుల్‌దీప్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. కుల్‌చా (కుల్‌దీప్‌ - చాహల్‌) గురించి ఇన్నాళ్లూ అందరూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్‌తో కుల్‌దీప్‌, జడేజాను కలిపి కుల్‌జా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని