Rahul Dravid: ‘టీ20 ప్రపంచకప్‌ ఉన్న ఈ తరుణంలో’.. కోచ్‌గా ద్రవిడ్‌ కొనసాగింపుపై గంభీర్‌ స్పందన

Rahul Dravid: టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సహా ఇతర కోచింగ్‌ బృంద కాంట్రాక్ట్‌ను బీసీసీఐ పొడిగించింది. దీనిపై మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తాజాగా స్పందించారు.

Updated : 30 Nov 2023 13:52 IST

దిల్లీ: టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) కాంట్రాక్ట్‌ను పొడిగిస్తున్నట్లు బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) స్వాగతించాడు. త్వరలో టీ20 ప్రపంచ కప్‌ జరగనున్న వేళ ఇది సరైన నిర్ణయమని అభిప్రాయపడ్డాడు. భారత్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో ఓడినప్పటికీ.. జట్టు అద్భుత ప్రదర్శన నేపథ్యంలో ద్రవిడ్‌ (Rahul Dravid)పై బీసీసీఐ విశ్వాసముంచి కోచ్‌గా అతడి కాంట్రాక్ట్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌, బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే, ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌లకు కూడా పొడిగింపు లభించింది.

‘‘త్వరలో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న ఈ తరుణంలో మొత్తం కోచింగ్‌ స్టాఫ్‌ను కొనసాగించాలనుకోవడం మంచి నిర్ణయం. రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) అందుకు అంగీకరించడం ప్రశంసించదగిన విషయం. టీమ్‌ఇండియా అద్భుత ప్రదర్శన కొనసాగుతుందని ఆశిస్తున్నా. టీ20 ఫార్మాట్‌ చాలా భిన్నమైంది. సవాళ్లతో కూడుకొన్నది. ఇందులోనూ ద్రవిడ్‌ సహా అతని బృందం అద్భుత ఫలితాలు సాధిస్తుందని ఆశిస్తున్నా. వారందరికీ శుభాకాంక్షలు’’ అని గంభీర్‌ (Gautam Gambhir) మీడియాతో అన్నాడు.

ద్రవిడ్‌ మెప్పించాడు ఇలా...

గత టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్‌ఇండియా నిరాశపర్చిన తర్వాత అప్పటి కోచ్‌ రవిశాస్త్రి స్థానంలో రాహుల్‌ ద్రవిడ్‌ బాధ్యతలు స్వీకరించాడు. ఇటీవల ముగిసిన ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌తో ఆయన పదవీకాలం ముగిసింది. అయితే, ఆయనతో పాటు ఇతర కోచింగ్‌ స్టాఫ్‌ కాంట్రాక్ట్‌ను పొడిగిస్తూ బీసీసీఐ బుధవారం నిర్ణయం తీసుకుంది. పదవీకాలం ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. దీనిపై ద్రవిడ్‌ స్పందిస్తూ.. ప్రపంచకప్‌ అనంతర దశలో జట్టును మరింత ఉత్తమంగా తీర్చిదిద్దడానికి కృషి కొనసాగుతుందని అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని