‘ఈ’ రేసు ఇలా..

దాదాపు రెండు నెలల కిందట మోటార్‌ స్పోర్ట్స్‌ అభిమానుల్ని అలరించిన రేసుల పండుగ మళ్లీ వచ్చింది.

Published : 08 Feb 2023 03:19 IST

ఈనాడు - హైదరాబాద్‌

దాదాపు రెండు నెలల కిందట మోటార్‌ స్పోర్ట్స్‌ అభిమానుల్ని అలరించిన రేసుల పండుగ మళ్లీ వచ్చింది. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌) హైదరాబాదీలకు మోటార్‌ స్పోర్ట్స్‌ను పరిచయం చేయగా.. ఇప్పుడు అసలు సిసలు రేసులకు భాగ్యనగరం ఆతిథ్యమివ్వనుంది. ఎఫ్‌ఐఏ ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా నాలుగో రేసుకు హైదరాబాద్‌ వేదికగా నిలవనుంది. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఫార్ములా ఈ కార్లతో శుక్ర, శనివారాల్లో హుస్సేన్‌ సాగర తీరం హోరెత్తిపోనుంది.
గత ఏడాది ఐఆర్‌ఎల్‌ తొలి సీజన్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వగా.. అభిమానులకు మిశ్రమ అనుభూతి లభించింది. కొత్త ట్రాక్‌ కావడం.. నిర్వాహకులకు అనుభవం లేకపోవడంతో నవంబరులో జరిగిన తొలి రౌండ్‌ అర్ధంతరంగా రద్దవడం అభిమానుల్ని ఉసూరుమనిపించింది. అయితే డిసెంబరులో నాలుగో రౌండ్‌ రేసు విజయవంతంగా ముగిసి మోటార్‌ స్పోర్ట్స్‌ అభిమానుల్లో ఉత్సాహం తీసుకొచ్చింది. తాజా ఫార్ములా ఈ రేసుతో రెట్టింపు జోష్‌ ఖాయంగా కనిపిస్తోంది. పేరున్న జట్లు.. మెరుగైన డ్రైవర్లు.. ఎలక్ట్రిక్‌ కార్లతో హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌కు సరికొత్త కళ రానుంది. శనివారం ప్రధాన రేసు జరుగనుంది. ఐఆర్‌ఎల్‌ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న నిర్వాహకులు ట్రాక్‌, ప్రేక్షకుల గ్యాలరీల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 20 వేల మంది రేసును వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.

టికెట్లు

హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌లో 20,000 మంది ప్రేక్షకులు రేసుల్ని వీక్షించేలా     ఏర్పాటు చేశారు. ప్రేక్షకుల గ్యాలరీలను ఆరు విభాగాలు విభజించి టికెట్‌ రేట్లను నిర్ణయించారు. గ్రాండ్‌స్టాండ్‌లో రూ.1000, ఛార్జ్‌ గ్రాండ్‌స్టాండ్‌లో రూ.4000, ప్రిమియమ్‌ గ్రాండ్‌స్టాండ్‌లో రూ.7000, ఏస్‌ గ్రాండ్‌స్టాండ్‌లో రూ.10500, గ్రీన్‌కో లాంజ్‌లో రూ.65000, ఏస్‌ లాంజ్‌లో రూ. 125000 ధరలు ఉన్నాయి. బుక్‌మైషో యాప్‌లో టికెట్లు కొనుక్కోవచ్చు.

2.835 కిలోమీటర్ల పొడవున్న సర్క్యూట్‌పై 11 జట్ల తరఫున 22 మంది డ్రైవర్లు రేసులో పాల్గొంటారు. ట్రాక్‌పై మొత్తం 18 మలుపులు ఉన్నాయి. కాస్త అటుఇటుగా లుంబినీ పార్కు నుంచి రేసు ప్రారంభమవుతుంది. బీఆర్‌కే భవన్‌ సిగ్నల్‌ నుంచి కార్లు యూ టర్న్‌ తీసుకుంటాయి. నూతన సచివాలయం పక్క నుంచి ఎడమ వైపునకు తిరుగుతాయి. మింట్‌ కాంపౌండ్‌ దాటి ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ మలుపు వద్ద కుడి వైపునకు వెళ్తాయి. ఐమ్యాక్స్‌ తర్వాత ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కుడి వైపునకు తిరిగిన తర్వాత రేసు ముగుస్తుంది. 35 నుంచి 40 ల్యాప్‌లు జరిగే రేసులో అగ్రస్థానంలో నిలిచిన రేసర్లు విజేతలుగా నిలుస్తారు.

రేసులు ఎలా

రేసు వారాంతంలో జరుగుతుంది. రేసును అయిదు సెషన్‌లుగా విడదీస్తారు. షేక్‌డౌన్‌, ఫ్రీ ప్రాక్టీస్‌ 1, ఫ్రీ ప్రాక్టీస్‌ 2, క్వాలిఫయింగ్‌, ప్రధాన రేసు
* ప్రధాన రేసుకు ముందు రోజు షేక్‌డౌన్‌ ఉంటుంది. కారు ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ను డ్రైవర్లు పరిశీలించుకుంటారు. రేసుకు కారు సంసిద్ధతను పర్యవేక్షిస్తారు
* ప్రతి రేసుకు ముందు రెండు ప్రాక్టీస్‌ సెషన్‌లు ఉంటాయి. డబుల్‌ హెడర్‌ ఉంటే ఒక్క ప్రాక్టీస్‌ సెషన్‌ మాత్రమే నిర్వహిస్తారు. ప్రాక్టీసు సమయంలో ఆయా జట్లు.. డ్రైవర్లు తమ వేగం, నైపుణ్యాల్ని పరీక్షించుకోవచ్చు.

షెడ్యూల్‌

శుక్రవారం

మధ్యాహ్నం 2.30- 2.45 గంటలు: షేక్‌డౌన్‌
సాయంత్రం 4.30- 5 గంటలు: ఫ్రీ ప్రాక్టీస్‌ రేసు 1

శనివారం

ఉదయం 8.10- 8.40 గంటలు: ఫ్రీ ప్రాక్టీస్‌ రేసు 2
ఉదయం 10.40- 12.05 గంటలు: క్వాలిఫయింగ్‌
మధ్యాహ్నం 3.04 గంంటలకు: ప్రధాన రేసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని