IND Vs ENG: బజ్‌బాల్‌ పగిలింది

ఏ జట్టు ఎదురొచ్చినా.. ఏ దేశంలోనైనా.. బజ్‌బాల్‌ అంటూ బ్యాట్‌తో, బంతితో చెలరేగిపోవడం ఇంగ్లాండ్‌ శైలి. కానీ వాళ్ల ఆటలు భారత్‌లో మాత్రం సాగలేదు.

Updated : 19 Feb 2024 10:58 IST

మూడో టెస్టులో భారత్‌ భారీ విజయం
434 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ చిత్తు
యశస్వి ద్విశతకం.. జడేజాకు 5 వికెట్లు
రాజ్‌కోట్‌

ఏ జట్టు ఎదురొచ్చినా.. ఏ దేశంలోనైనా.. బజ్‌బాల్‌ అంటూ బ్యాట్‌తో, బంతితో చెలరేగిపోవడం ఇంగ్లాండ్‌ శైలి. కానీ వాళ్ల ఆటలు భారత్‌లో మాత్రం సాగలేదు. దూకుడైన ఆటతో ప్రత్యర్థులను బెదరగొట్టడం అలవాటైన ఇంగ్లిష్‌ జట్టు రోహిత్‌ సేన దెబ్బకు బిక్కచచ్చిపోయింది. కొన్ని గంటల ముందు అనుభవం లేని తమ కుర్రాళ్లు సిక్సర్ల మోత మోగించిన పిచ్‌ మీద.. పేరుమోసిన ఇంగ్లిష్‌ బ్యాటర్లను గల్లీ క్రికెటర్లలా మార్చేసి వికెట్ల వేటలో దూసుకెళ్లిన టీమ్‌ఇండియా ప్రత్యర్థికి ఘోర పరాభవాన్ని మిగిల్చింది. ఇంగ్లాండ్‌ కదా తక్కువ స్కోరైతే కష్టమని ఏకంగా 550 పైచిలుకు పైగా లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. పేకమేడను తలపిస్తూ కేవలం 39.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలి పోయింది స్టోక్స్‌సేన. తన పరుగుల దాహాన్ని మరింతగా తీర్చుకుంటూ వరుసగా రెండో టెస్టులోనూ ద్విశతకంతో యశస్వి జైస్వాల్‌ అదరగొడితే.. తొలి టెస్టు ఆడుతున్న సర్ఫరాజ్‌ కసిగా ఇంకో అర్ధసెంచరీ బాదేశాడు. సొంతగడ్డపై తనకు తిరుగులేదని చాటుతూ జడేజా అయిదు వికెట్లతో చెలరేగాడు. ఫలితం.. పరుగుల పరంగా టెస్టుల్లో భారత్‌ అతి పెద్ద విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ ఆత్మవిశ్వాసంపై గట్టి దెబ్బ కొడుతూ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టుల సిరీస్‌ను సొంతం చేసుకునే దిశగా భారత్‌ మరో అడుగు వేసింది. ఆదివారం ముగిసిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుని సిరీస్‌లో 2-1తో ఆధిక్యాన్ని సంపాదించింది. 557 పరుగుల కొండంత లక్ష్య ఛేదనలో ఇంగ్లిష్‌ జట్టును 122 పరుగులకే కుప్పకూల్చింది. జడేజా (5/41) రెచ్చిపోయాడు. కుల్‌దీప్‌ (2/19) కూడా మెరిశాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 196/2తో బ్యాటింగ్‌ కొనసాగించిన టీమ్‌ఇండియా 430/4 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. మూడో రోజు సెంచరీ తర్వాత వెన్నునొప్పితో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగిన యశస్వి జైస్వాల్‌ (214 నాటౌట్‌; 236 బంతుల్లో 14×4, 12×6) తిరిగొచ్చి అజేయ డబుల్‌ సెంచరీ సాధించాడు. శుభ్‌మన్‌ గిల్‌ (91; 151 బంతుల్లో 9×4, 2×6), సర్ఫరాజ్‌ ఖాన్‌ (68 నాటౌట్‌; 72 బంతుల్లో 6×4, 3×6) కూడా సత్తాచాటారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 445, ఇంగ్లాండ్‌ 319 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టిన జడేజా ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. నాలుగో టెస్టు శుక్రవారం రాంచీలో ఆరంభమవుతుంది.

వణికించారు..: బ్యాటింగ్‌ను అనుకూలంగా ఉన్న పిచ్‌పై యశస్వి, సర్ఫరాజ్‌ చెలరేగిన తీరు చూస్తే.. దూకుడుకు మారుపేరైన ఇంగ్లాండ్‌ బ్యాటర్లు మరింత రెచ్చిపోతారేమో అనిపించింది. కానీ మన బౌలర్ల ముందు ఆ బ్యాటర్లు అనామక క్రికెటర్లుగా మారిపోయారు. బౌండరీల సంగతి పక్కనపెడితే కనీసం సింగిల్స్‌ తీసేందుకు, క్రీజులో నిలబడేందుకూ వణికిపోయారు. జడేజా, కుల్‌దీప్‌, అశ్విన్‌ స్పిన్‌కు దాసోహమన్నారు. కనీస ప్రతిఘటన లేకుండానే చేతులెత్తేశారు. స్వీప్‌తో తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లపై ఇంగ్లాండ్‌ బ్యాటర్లు ఆధిపత్యం చలాయించారు. కానీ ఈ సారి మన స్పిన్నర్లు మరింత మెరుగైన ప్రణాళికలతో వచ్చారు. సరైన లైన్‌, లెంగ్త్‌తో బంతులేశారు. దీంతో స్వీప్‌కు ప్రయత్నించే బెయిర్‌స్టో (4), రూట్‌ (7), స్టోక్స్‌ (15) ఎల్బీగా వెనుదిరిగారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన డకెట్‌ (4) ధ్రువ్‌ అద్భుతమైన నైపుణ్యాలతో రనౌట్‌గా నిష్క్రమించాడు. వికెట్లకు దగ్గరగా పరుగెత్తుకుంటూ వస్తూ కింద పడి జారుతూ సిరాజ్‌ నుంచి గొప్పగా త్రో అందుకున్న ధ్రువ్‌ బెయిల్స్‌ను ఎగరగొట్టాడు. ఆ తర్వాత మన బౌలర్లు ఆగలేదు. క్రాలీ (11)ని వికెట్ల ముందు బుమ్రా (1/18) దొరకబుచ్చుకున్నాడు. సమీక్షలో అంపైర్‌ కాల్‌ అని రావడంతో అంపైర్‌ను ఏదో అనుకుంటూ క్రాలీ పెవిలియన్‌ చేరాడు. చివరి సెషన్‌లో జడ్డూ మాయ మొదలైంది. ఇక్కడి పరిస్థితులపై ఎంతో అవగాహన ఉన్న అతను చక్కటి బౌలింగ్‌తో సాగిపోయాడు. బంతిని ఎక్కువగా స్పిన్‌ చేయకుండా, స్టంప్స్‌కు నేరుగా వేస్తూ ఫలితం సాధించాడు. కీలక ఆటగాళ్లు పోప్‌ (3), బెయిర్‌స్టో, రూట్‌ను ఔట్‌ చేసి ఇంగ్లాండ్‌ నడ్డివిరిచాడు. స్టోక్స్‌ను కుల్‌దీప్‌ బుట్టలో వేసుకోవడంతో 50/6తో ఇంగ్లాండ్‌ పనైపోయింది. చివర్లో ఎదురు దాడి చేసిన మార్క్‌వుడ్‌ (33)ను జడేజా ఔట్‌ చేసి మ్యాచ్‌ ముగించాడు.

కుర్రాడు కుమ్మేశాడు: 22 ఏళ్ల యశస్వికి ఇది ఏడో టెస్టు మాత్రమే. కానీ సుదీర్ఘ ఫార్మాట్లో వరుసగా రెండో డబుల్‌ సెంచరీని అతను ఖాతాలో వేసుకోవడం విశేషం. శనివారం 104 పరుగులు చేసిన తర్వాత వెన్నునొప్పి భరించలేక అతను రిటైర్డ్‌హర్ట్‌గా పెవిలియన్‌ చేరిన సంగతి తెలిసిందే. నొప్పి నుంచి కోలుకున్న అతను.. ఆదివారం శుభ్‌మన్‌ ఔటైన తర్వాత తిరిగి క్రీజులోకి వచ్చాడు. ఓపికగా ఎప్పుడు ఆడాలి? దూకుడు ఎప్పుడు ప్రదర్శించాలని పక్కాగా తెలిసిన అతను.. అత్యుత్తమ బ్యాటింగ్‌ నైపుణ్యాలతో ద్విశతకం అందుకున్నాడు. అంతకంటే ముందు ఓవర్‌నైట్‌ బ్యాటర్లు గిల్‌ (ఓవర్‌నైట్‌ స్కోరు 65), కుల్‌దీప్‌ (27; ఓవర్‌నైట్‌ స్కోరు 3) ఉదయం పూట కఠిన పరిస్థితుల్లోనూ పట్టుదలగా నిలబడ్డారు. కానీ సెంచరీ ముంగిట గిల్‌ అనవసరంగా రనౌటయ్యాడు. కాసేపటికే కుల్‌దీప్‌ వెళ్లిపోయాడు. అక్కడి నుంచి ఇంగ్లాండ్‌ కష్టాలు రెట్టింపయ్యాయి. సర్ఫరాజ్‌తో కలిసి యశస్వి చెలరేగిపోయాడు. అభేద్యమైన అయిదో వికెట్‌కు వీళ్లు 158 బంతుల్లోనే 172 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. యశస్వి బౌండరీల వేటలో సాగడం చూసి.. తానేం తక్కువ కాదంటూ సర్ఫరాజ్‌ దూకుడు ప్రదర్శించాడు. సిక్సర్లు, ఫోర్లతో ఈ జంట ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించింది. క్రీజులో బలంగా నిలబడి లాఫ్టెడ్‌ షాట్లతో యశస్వి అదరగొట్టాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో స్లాగ్‌స్వీప్‌తో సర్ఫరాజ్‌ సాగిపోయాడు. 150 పరుగుల తర్వాత యశస్వి మరింతగా రెచ్చిపోయాడు. అండర్సన్‌ బౌలింగ్‌లో వికెట్లకు అడ్డంగా జరిగి.. కిందపడి మరీ బంతిని ర్యాంప్‌ షాట్‌తో ఫైన్‌లెగ్‌ దిశగా బౌండరీకి పంపించాడు. అండర్సన్‌ బౌలింగ్‌లోనే యశస్వి కొట్టిన హ్యాట్రిక్‌ సిక్సర్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్లలో ఒకడైన, అత్యంత అనుభవజ్ఞుడైన అండర్సన్‌ను ఇన్నింగ్స్‌ 85వ ఓవర్లో అతను ఓ ఆటాడుకున్నాడు. ఫుల్‌టాస్‌ను ఫ్లిక్‌తో ఫైన్‌లెగ్‌లో, ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతిని ముందుకు వచ్చి ఎక్స్‌ట్రా కవర్స్‌లో, మళ్లీ అలాగే వచ్చిన తర్వాతి బంతిని నిటారుగా నిలబడి బౌలర్‌ తలమీదుగా స్టాండ్స్‌లో పడేశాడు. అదే ఊపులో డబుల్‌ సెంచరీ చేసి గర్జించాడు. ఆ తర్వాత రూట్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. మరోవైపు అరంగేట్ర టెస్టులో వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధశతకం చేరుకున్న సర్ఫరాజ్‌.. రెహాన్‌ బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6 కొట్టాడు.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 445 ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 319

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: యశస్వి నాటౌట్‌ 214; రోహిత్‌ ఎల్బీ (బి) రూట్‌ 19; శుభ్‌మన్‌ రనౌట్‌ 91; రజత్‌ (సి) రెహాన్‌ (బి) హార్ట్‌లీ 0; కుల్‌దీప్‌ (సి) రూట్‌ (బి) రెహాన్‌ 27, సర్ఫరాజ్‌ నాటౌట్‌ 68; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం: (98 ఓవర్లలో 4 వికెట్లకు) 430 డిక్లేర్డ్‌; వికెట్ల పతనం: 1-30, 2-191, 3-246, 4-258; బౌలింగ్‌: అండర్సన్‌ 13-1-78-0; రూట్‌ 27-3-111-1; హార్ట్‌లీ 23-2-78-1; మార్క్‌వుడ్‌ 10-0-46-0; రెహాన్‌ అహ్మద్‌ 25-1-108-1

ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలీ ఎల్బీ (బి) బుమ్రా 11; డకెట్‌ రనౌట్‌ 4; పోప్‌ (సి) రోహిత్‌ (బి) జడేజా 3; రూట్‌ ఎల్బీ (బి) జడేజా 7; బెయిర్‌స్టో ఎల్బీ (బి) జడేజా 4; స్టోక్స్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 15; ఫోక్స్‌ (సి) ధ్రువ్‌ (బి) జడేజా 16; రెహాన్‌ (సి) సిరాజ్‌ (బి) కుల్‌దీప్‌ 0; హార్ట్‌లీ (బి) అశ్విన్‌ 16; మార్క్‌వుడ్‌ (సి) జైస్వాల్‌ (బి) జడేజా 33; అండర్సన్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (39.4 ఓవర్లలో ఆలౌట్‌) 122; వికెట్ల పతనం: 1-15, 2-18, 3-20, 4-28, 5-50, 6-50, 7-50, 8-82, 9-91; బౌలింగ్‌: బుమ్రా 8-1-18-1; సిరాజ్‌ 5-2-16-0; జడేజా 12.4-4-41-5; కుల్‌దీప్‌ 8-2-19-2; అశ్విన్‌ 6-3-19-1


1

టెస్టుల్లో తొలి మూడు సెంచరీలను 150+ స్కోర్లుగా మలచిన తొలి భారత బ్యాటర్‌ యశస్వి.

వినోద్‌ కాంబ్లి (21 ఏళ్ల 54 రోజులు), బ్రాడ్‌మన్‌ (21 ఏళ్ల 318 రోజులు) తర్వాత అతి తక్కువ వయస్సులో టెస్టుల్లో రెండు ద్విశతకాలు చేసిన ఆటగాడు యశస్వి (22 ఏళ్ల 49 రోజులు).


12

రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి కొట్టిన సిక్సర్లు. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా వసీం అక్రం (1996లో జింబాబ్వేపై) ప్రపంచ రికార్డును సమం చేశాడు.


22

ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ యశస్వి కొట్టిన సిక్సర్లు. ఓ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రోహిత్‌ (2019లో దక్షిణాఫ్రికాపై 19)ను అతను అధిగమించాడు.


4

అరంగేట్ర టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో సర్ఫరాజ్‌ స్థానం. దిలావర్‌, గావస్కర్‌, శ్రేయస్‌ ముందున్నారు.


48

ఈ సిరీస్‌లో ఇప్పటికే భారత్‌ కొట్టిన సిక్సర్లు. ఓ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా తన పేరిటే ఉన్న రికార్డు (2019లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో 47)ను మెరుగుపరుచుకుంది.


434

ఈ టెస్టులో భారత్‌ గెలుపు అంతరం. పరుగుల పరంగా మన జట్టుకు ఇదే అతిపెద్ద టెస్టు విజయం. గత రికార్డు (2021లో న్యూజిలాండ్‌పై 372 పరుగులు) బద్దలైంది.


అశ్విన్‌ వచ్చాడు

తల్లి అనారోగ్యం దృష్ట్యా మూడో రోజు ఆటకు  దూరమైన అశ్విన్‌.. తిరిగి నాలుగో రోజు జట్టుతో చేరాడు. క్రాలీ వికెట్‌ తీసి టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయి చేరుకున్న అశ్విన్‌ రెండో రోజు ఆట ముగిశాక రాజ్‌కోట్‌ నుంచి చెన్నై వెళ్లాడు. దీంతో  ఆ తర్వాతి రోజు మైదానంలో దిగలేదు. ఆదివారం అశ్విన్‌ టీ విరామం తర్వాత బౌలింగ్‌కు వచ్చాడు. హార్ట్‌లీని బౌల్డ్‌ చేశాడు. అశ్విన్‌ ఇంటికి వెళ్లి రావడానికి బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రత్యేక విమానం ఏర్పాటు చేశాడని మాజీ కోచ్‌ రవిశాస్త్రి వెల్లడించాడు.


రాజ్‌కోట్‌ రాకుమారుడు

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు సహా మ్యాచ్‌లో 7 వికెట్లు సాధించిన జడేజా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో సొంత మైదానం రాజ్‌కోట్‌లో తనకు తిరుగులేదని చాటుకున్నాడీ స్పిన్‌ ఆల్‌రౌండర్‌. ఇక్కడ 17 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో ఏకంగా 142.18 సగటుతో ఆరు శతకాలు సహా అతను 1564 పరుగులు చేశాడు. 20 కంటే తక్కువ సగటుతో 60 వికెట్లూ పడగొట్టాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో అయితే 3 టెస్టుల్లో రెండు సెంచరీలు సహా 128 సగటుతో 256 పరుగులు సాధించాడు. 14 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.


డిక్లేర్‌ చేశారనుకుని..

ఇన్నింగ్స్‌ 97వ ఓవర్‌ పూర్తికాగానే యశస్వి, సర్ఫరాజ్‌ పెవిలియన్‌ వైపు నడుచుకుంటూ వెళ్లడంతో భారత్‌  రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసిందేమోనని అంతా అనుకున్నారు. కానీ డ్రెస్సింగ్‌  గది నుంచి రోహిత్‌.. ఇంకా ఆడమని, ఎందుకు వస్తున్నారని ప్రశ్నించాడు. దీంతో బ్యాటర్లు మళ్లీ క్రీజులోకి వచ్చారు. ఒక ఓవర్‌ ఆడిన తర్వాత  తిరిగొచ్చేయమని రోహిత్‌ పిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని