IND vs ENG : ఎవరొస్తారో? ఎవరుంటారో? ఇంగ్లాండ్‌తో మిగిలిన 3 టెస్టులకు టీమ్‌ఇండియా ఎలా ఉంటుందంటే?

కీలక ఆటగాళ్లు దూరం.. మరోవైపు గాయాల బెడద టీమ్‌ఇండియా (Team India)ను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో మిగతా మూడు టెస్టులకు బీసీసీఐ జట్టును ప్రకటించనుంది.

Updated : 05 Feb 2024 15:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  వైజాగ్‌ టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 1-1తో సిరీస్‌ను సమం చేసిన రోహిత్‌ సేన.. మిగతా మూడు టెస్టులపై దృష్టిసారించింది. ఈ మ్యాచ్‌లకు బీసీసీఐ (BCCI) టీమ్‌ఇండియా (Team India) జట్టును ప్రకటించనుంది. ఓవైపు కీలక ఆటగాళ్ల గాయాలబెడద, మరోవైపు ఫామ్‌ లేమి నేపథ్యంలో.. జట్టు ఎంపిక, కూర్పు ఎలా ఉండనుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

ఆ ఐదుగురు వస్తారా?

వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేని స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli).. మిగతా మ్యాచ్‌లకు ఆడేది అనుమానమే అంటున్నారు. కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడనీ.. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడి సన్నిహితుడు, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ (AB de Villiers) సోషల్ మీడియాలో వెల్లడించిన విషయం తెలిసిందే. కేఎల్‌ రాహుల్‌, జడేజా, షమీ గాయాల వల్ల జట్టుకు దూరం అయ్యారు. గాయంతో షమీ తొలి రెండు టెస్టులకు ఎంపిక కాలేదు. ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదీ స్పష్టత లేదు. తొలి టెస్టు ఆడిన జడేజా, రాహుల్‌ సిరీస్‌ మొత్తానికీ దూరమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పని భారం నిర్వహణలో భాగంగా రెండో టెస్టుకు విశ్రాంతినిచ్చిన సిరాజ్‌ను.. మిగతా మ్యాచ్‌లకు ఎంపిక చేస్తారా, లేదా అన్నది చూడాలి.

అయ్యర్.. మంచి ఛాన్స్‌ను మిస్‌ చేసుకొన్నావు.. ఇక కష్టమే

శుభ్‌మన్‌ ఓకే.. మరి శ్రేయస్‌..?

గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill).. రెండో టెస్టు, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. తనపై వస్తున్న విమర్శలకు ఈ ఇన్నింగ్స్‌తోనే సమాధానమిచ్చాడు. మరోవైపు శ్రేయస్‌ (Shreyas Iyer) నిరాశపరిచాడు. యువ ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో మరి అయ్యర్‌ను తర్వాత టెస్టులకు కొనసాగిస్తారా..? చూడాలి. రెండో టెస్టులో గిల్‌ గాయం బారినపడటం జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. చూపుడు వేలికి గాయం వల్ల.. అతడు ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ఫీల్డింగ్‌కు రాలేదు. అతడి స్థానంలో సర్ఫరాజ్‌ ఖాన్‌ మైదానంలోకి వచ్చాడు. మిగతా టెస్టులకు అందుబాటులో ఉండేది, లేనిది అతడి గాయం తీవ్రతపైనే ఆధారపడి ఉంటుంది. రెండో టెస్టు అనంతరం బీసీసీఐ మిగతా మూడు టెస్టులకు జట్టును ప్రకటించే అవకాశం ఉంది.

ఎవరు రావొచ్చు

ఒకవేళ శ్రేయస్‌ అయ్యర్‌ను పక్కనపెట్టాల్సి వస్తే.. జట్టులో సర్ఫరాజ్‌ను తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న స్క్వాడ్‌లో అదనపు బ్యాటర్‌ లేడు. స్పిన్‌, ఆల్‌రౌండర్ల విషయంలో ఇబ్బంది లేకపోయినా, పేస్‌ విషయంలో జట్టు ఆందోళన చెందాల్సిన పరిస్థితి వచ్చింది. తొలి టెస్టులో ఆకట్టుకోని సిరాజ్‌ను రెండో టెస్టులో పక్కనపెట్టారు. అతని స్థానంలో వచ్చిన ముకేశ్‌ కుమార్‌ ధారాళంగా పరుగులిచ్చేశాడు. టెయిలెండర్‌ వికెట్‌ తప్ప ఇంకేమీ దక్కలేదు. దీంతో బుమ్రాపైనే ఎక్కువ భారం పడుతోంది. ఈ నేపథ్యంలో సిరాజ్‌ బదులు స్క్వాడ్‌లోకి వచ్చిన అవేశ్‌ఖాన్‌ను కొనసాగిస్తారా? లేక పూర్తిగా కొత్త పేసర్లను తీసుకుంటారా అనేది చూడాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని