ODI World Cup : 2011 చరిత్రను టీమ్‌ఇండియా రిపీట్‌ చేయబోతోంది : రోహిత్‌ సేనపై అక్తర్‌ ప్రశంసలు

పాక్‌ జట్టుపై టీమ్‌ఇండియా కొనసాగించిన ఆధిపత్యాన్ని ఆ జట్టు మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ కొనియాడాడు. తమ జట్టుకు ఇది అవమానకరమైన ఓటమి అని పేర్కొన్నాడు.

Published : 16 Oct 2023 15:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  ప్రపంచకప్‌(ODI World Cup 2023)లో చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు(IND vs PAK)లో భారత్‌ చేతిలో పాకిస్థాన్‌ ఘోర ఓటమి పాలైంది. ఏ దశలోనూ కనీస పోరాటం కూడా చూపకుండా చేతులెత్తేసిన బాబర్‌ సేనపై ఆ జట్టు మాజీలు తీవ్ర విమర్శలు కురుపిస్తున్నారు. అదే సమయంలో రోహిత్‌ శర్మ(rohit sharma) ఆటను మెచ్చుకుంటూ.. అతడు జట్టును నడిపించిన తీరును కొనియాడుతున్నారు.

2011 విజయాన్ని పునరావృతం చేసే దిశలో భారత్‌ సరైన మార్గంలోనే పయనిస్తోందని పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌(Shoaib Akhtar) అన్నారు. ‘2011 ప్రపంచకప్‌ చరిత్రను భారత్‌ పునరావృతం చేయబోతోందని నేను నమ్ముతున్నాను. వారు సెమీఫైనల్‌లో తడబడకపోతే.. భారత్‌ నిజంగానే వరల్డ్‌ కప్‌ గెలుస్తుంది. టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడుతోంది. ప్రపంచకప్‌లో మీరు మమ్మల్ని కోలుకోలేని దెబ్బ తీశారు. ఇది మా నుంచి చాలా నిరుత్సాహపరిచే ప్రదర్శన. పాక్‌ను భారత్‌ పూర్తిగా చిత్తు చేసింది’ అని అక్తర్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో విశ్లేషించాడు.

ప్రపంచకప్‌లో మేటి జట్లను కంగుతినిపించిన చిన్న జట్లు..

ఇక రోహిత్‌ ఆటతీరుపై స్పందిస్తూ..‘అతడే ఒక సైన్యం. అతడి ప్రతిభ ఈ రెండేళ్లు ఎక్కడ దాగిందో నాకు తెలియలేదు. అతడో పరిపూర్ణమైన బ్యాటర్‌. భిన్నమైన షాట్లు కొట్టాడు. ఆ జట్టు కూడా బాగుంది. ఇది పాక్‌ జట్టుకు అవమానకరమైన ఓటమి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిన్నపిల్లల జట్టు మాదరిగా భారత్‌ దారుణంగా ఓడించింది. నేను దానిని చూడలేకపోయాను. రోహిత్‌ ఎలాంటి దయ లేకుండా మా బౌలర్లపై చెలరేగాడు. గత రెండేళ్లుగా సరిగా రాణించలేనందుకు ప్రతీకారం తీర్చుకున్నట్లుగా సాగింది అతడి ఆట’ అని అక్తర్‌ కొనియాడాడు.

ఇక హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా.. తన తర్వాత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌ తన విజయాల పరంపరను ఇలాగే కొనసాగించి.. మూడోసారి టైటిల్‌ అందించాలని అభిమానులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని