PBKS vs LSG: బ్యాటర్ల ఊచకోత.. రికార్డుల మీద రికార్డులు!

బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన మొహాలి పిచ్‌పై బౌలర్లకు చుక్కలు కనిపించాయి. పంజాబ్ - లఖ్‌నవూ (PBKS vs LSG) జట్లలోని బ్యాటర్లు దూకుడుగా ఆడేయడంతో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయినా చివరికి లఖ్‌నవూ విజయం సాధించింది.

Published : 29 Apr 2023 10:41 IST

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో (IPL 2023) అత్యధిక స్కోరు.. ఓవరాల్‌గా రెండో అత్యధికం. బౌండరీల పరంగానూ సరికొత్త రికార్డు. ఒకే మ్యాచ్‌లో భారీగా పరుగులు నమోదైన మూడో సందర్భం.. ఇలా శుక్రవారం జరిగిన పంజాబ్‌ కింగ్స్ - లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ (PBKS vs LSG) మ్యాచ్‌ పలు విశేషాలకు వేదికైంది. తొలుత లఖ్‌నవూ బ్యాటర్లు విధ్వంసం సృష్టించడంతో 257/5 భారీ స్కోరు చేసింది. ఈ భారీ స్కోరును చూడగానే ఫలితంపై అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. అయితే, తామేం తక్కువ కాదంటూ చివరి వరకూ పోరాడిన పంజాబ్‌ కింగ్స్‌ కూడా 201 పరుగులు చేయడం విశేషం. టార్గెట్‌ మరీ ఎక్కువగా ఉండటంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎలా ఆడాలో ముందే నిర్ణయించుకున్నాం: రాహుల్

ఇప్పటి నుంచి ప్రతి మ్యాచ్‌ మాకు చాలా కీలకం. పంజాబ్‌పై గెలవడం బాగుంది. గత మ్యాచ్‌లో (గుజరాత్‌పై) ఓడిపోవడం నిరుత్సాహానికి గురి చేసింది. ఆ ఓటమి నుంచి బయటపడి ఫ్రెష్‌గా పంజాబ్‌తో ఆడాం. బ్యాటింగ్ ఎలా చేయాలో ముందే నిర్ణయించుకున్నాం. ఇలాంటి వికెట్‌ బ్యాటర్లలో ఉత్సాహం తెస్తుంది. 250కిపైగా పరుగులు సాధించడం తేలికేం కాదు. పిచ్‌ నుంచి సహకారం లభిస్తే చెలరేగిపోవచ్చు. మేయర్స్, బదోని, పూరన్, స్టొయినిస్‌తో కూడిన భారీ హిట్టింగ్‌ లైనప్‌ మాకుంది.

మిస్‌ఫైర్‌ అయింది: ధావన్‌

తొలుత బౌలింగ్‌లో భారీగా పరుగులు ఇచ్చేశాం. అదనపు బౌలర్‌తో బరిలోకి దిగిన వ్యూహం మిస్‌ఫైర్‌ అయింది. మరొక స్పిన్నర్‌ లేకుండా ఆడాం. నాకు ఇదొక గుణపాఠం. ఇక ఛేదనలోనూ మంచి ఆరంభం దక్కలేదు. మేం బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదనిపించింది. భారీ షాట్‌కు యత్నించి నేరుగా ఫీల్డర్‌ చేతికే క్యాచ్‌ ఇచ్చా. లివింగ్‌స్టోన్, సామ్‌ కరన్‌ ఉండటంతో షారుఖ్‌ ఖాన్‌ను వారి తర్వాత బ్యాటింగ్‌కు దింపాల్సి వచ్చింది. అయినా మా బ్యాటర్లు మంచి స్కోరే సాధించగలిగారు.

రికార్డుల హోరు..

* లఖ్‌నవూ సాధించిన భారీ స్కోర్‌ (257/5) ఓ రికార్డు. ఐపీఎల్‌ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు ఇది. తొలి స్థానం మాత్రం రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేరిట ఉంది. 2013లో పుణెపై 263/5 స్కోరు సాధించింది. 

* పంజాబ్‌ కూడా రెండొందలకు పైగా పరుగులు చేయడంతో మరో రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‌లో నమోదైన మొత్తం పరుగులు 458. ఇదీ కూడా ఐపీఎల్‌లో ఓ రికార్డును క్రియేట్‌ చేసింది. అయితే ఇలా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి భారీగా పరుగులు నమోదైన మూడో మ్యాచ్‌గా ఘనత సాధించింది. దీనికంటే ముందు సీఎస్‌కే X ఆర్‌ఆర్‌ (2010లో) 469 పరుగులు.. పంజాబ్‌ కింగ్స్‌ X కేకేఆర్‌ (2018లో) 459 పరుగులు నమోదు చేశాయి. 

* ఈ మ్యాచ్‌లో మొత్తం 16 మంది బౌలింగ్‌ చేశారు. పంజాబ్‌ నుంచి ఏడుగురు, లఖ్‌నవూ నుంచి ఏకంగా 9 మంది బౌలర్లను ఆయా జట్లు ప్రయోగించాయి. ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువ మంది బౌలర్లను వినియోగించిన రెండో జట్టుగా లఖ్‌నవూ రికార్డు సాధించింది. అంతకుముందు రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా గుజరాత్‌ లయన్స్‌పై 9 మంది బౌలర్లను వాడేసింది.

* అత్యధికంగా బౌండరీలు నమోదైన రెండో మ్యాచ్‌గా పంజాబ్‌ కింగ్స్‌ - లఖ్‌నవూ పోరు నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 67 బౌండరీలు నమోదు కాగా.. ఇందులో 45 ఫోర్లు, 22 సిక్స్‌లు ఉన్నాయి. తొలి రికార్డు సీఎస్‌ x ఆర్‌ఆర్‌ (2010లో) మ్యాచ్‌ పేరిట ఉంది. మొత్తం 69 బౌండరీలు కొట్టగా.. అందులో 39 ఫోర్లు, 30 సిక్స్‌లు ఉన్నాయి.

* సగం మ్యాచ్‌లు మాత్రమే ముగిసిన ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ అరుదైన ఘనత ఖాతాలో వేసుకుంది. పంజాబ్ - లఖ్‌నవూ మ్యాచ్‌ ఈ సీజన్‌లో 38వ మ్యాచ్‌. ఇప్పటికే 200+ స్కోరు 20 సార్లు నమోదు కావడం విశేషం. గతేడాది టోర్నీ మొత్తం 18 సార్లు మాత్రమే 200+ పరుగులను ఆయా జట్లు సాధించాయి. ఈ సీజన్‌లో ఇంకా మరిన్ని మ్యాచ్‌లు ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని