NZ vs PAK: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. DLS ప్రకారం పాక్‌ విజయం.. సెమీస్ ఆశలు సజీవం

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ (Pakistan) నాలుగో విజయాన్ని అందుకుని సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ డక్‌వర్త్ లూయిస్‌ ప్రకారం 21 పరుగుల తేడాతో గెలుపొందింది.

Updated : 04 Nov 2023 19:49 IST

బెంగళూరు: ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ (Pakistan) నాలుగో విజయాన్ని అందుకుని సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ డక్‌వర్త్ లూయిస్‌ ప్రకారం 21 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ కొండంత లక్ష్యఛేదనలో పాకిస్థాన్ దీటుగా బదులిచ్చింది. 21.3 ఓవర్ల ఆట ముగిసిన తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. కొద్దిసేపటి తర్వాత వరుణుడు శాంతించడంతో పాక్‌ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 341కి కుదించి ఆటను కొనసాగించారు. 25.3 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. అప్పటికి పాకిస్థాన్‌ 200/1 స్కోరు చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పాక్‌ 25.3 ఓవర్లకు 179 పరుగులు చేయాలి. ఈ లెక్కన పాకిస్థాన్‌ అప్పటికే 21 పరుగుల ముందంజలో ఉండటంతో ఆ జట్టును విజేతగా ప్రకటించారు.

పాక్‌ ఆటగాళ్లలో ఓపెనర్ ఫకార్ జమాన్‌ (126*; 81 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్స్‌లు) దూకుడుగా ఆడి శతకం పూర్తి చేసుకున్నాడు. బాబర్ అజామ్ (66*; 63 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం బాదాడు. అబ్దుల్లా షఫీక్ (4) ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే ఔటైనా.. వీరిద్దరూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ముఖ్యంగా ఫకార్‌ జమాన్‌ ఫోర్లు, సిక్సర్లతో కివీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడు 63 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఈ క్రమంలోనే ప్రపంచకప్‌లో పాక్‌ తరఫున వేగవంతమై సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కొద్దిసేపటికే ఇష్‌ సోథీ బౌలింగ్‌లో బాబర్ వరుసగా రెండు ఫోర్లు అర్ధ శతకం అందుకున్నాడు. సోథీ వేసిన తర్వాతి ఓవర్‌లో ఫకార్ జమాన్ రెండు, బాబర్ ఒక సిక్స్‌ బాదారు. కాసేపటికే వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయింది. 

రచిన్‌ రవీంద్ర (108; 94 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్‌), కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ (95; 79 బంతుల్లో, 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచికొట్టడంతో భారీ స్కోరు చేసింది. ప్రపంచకప్‌లో కివీస్‌కిదే అత్యధిక స్కోరు. ఓపెనర్ డేవాన్ కాన్వే (35), మార్క్‌ చాప్‌మన్‌ (39), డారిల్ మిచెల్ (29) పరుగులు చేయగా.. చివర్లో గ్లెన్ ఫిలిప్స్‌ (41; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ శాంట్నర్‌ (26*; 17 బంతుల్లో 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. పాక్ బౌలర్లలో మహ్మద్‌ వసీమ్ 3, హసన్ అలీ, ఇప్తికార్ అహ్మద్‌, హారిస్‌ రవూఫ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని