IND vs BAN: బంగ్లాదేశ్‌ గెలిస్తే.. ఆ దేశ క్రికెటర్‌తో డిన్నర్‌ డేట్‌కు వెళ్తా: విషం కక్కిన పాక్‌ నటి

ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 19న భారత్‌, బంగ్లాదేశ్ (IND vs BAN) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌ను బంగ్లాదేశ్ ఓడిస్తే బంగ్లా క్రికెటర్‌తో డేట్‌కు వెళ్తానని ఓ పాక్‌ నటి సంచలన ప్రకటన చేసింది. 

Updated : 18 Oct 2023 16:51 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ (Pakistan)పై భారత్‌ మరోసారి ఆధిపత్యం చలాయించిన సంగతి తెలిసిందే. ఇటీవల వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను భారత్‌ చిత్తుగా ఓడించడంతో పాక్‌ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కనీసం గట్టిపోటీ కూడా ఇవ్వకుండా పాక్‌ చేతులెత్తేయడంతో ఆ దేశ క్రికెట్ అభిమానులు రగిలిపోతున్నారు. దీంతో ప్రపంచకప్‌లో భారత్‌ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ నటి సెహర్ షిన్వారి (Sehar Shinwari) సంచలన ప్రకటన చేసింది. అక్టోబర్ 19న భారత్‌, బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియాను బంగ్లా ఓడిస్తే.. బంగ్లాదేశ్ (Bangladesh) ఆటగాడితో డిన్నర్‌ డేట్‌కు వెళ్తానని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. అయితే, ప్రకటన భారత్, పాక్‌ మ్యాచ్‌ జరిగిన మరుసటి రోజు (అక్టోబర్‌ 15)నే చేయగా ఇప్పుడు వైరల్‌గా మారింది.    

‘‘భగవంతుడా..  టీమ్‌ఇండియాను బంగ్లాదేశ్ ఓడిస్తే ఢాకాకు వెళ్లి ఆ దేశ క్రికెటర్‌తో డిన్నర్‌ డేట్‌కు వెళ్తా’’ అని సెహర్ షిన్వారి తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పోస్టు చేసింది. ఈ నటి గతంలో వివాదస్పద పోస్ట్‌లు చేసింది. ఈ ఏడాది ఆసియా కప్‌లో సూపర్‌-4 మ్యాచ్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అప్పుడు పాక్ కెప్టెన్ బాబర్‌ అజామ్‌, జట్టు సభ్యులపై కేసు పెడతానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పాక్‌ ఆటగాళ్లు ప్రతిసారి క్రికెట్‌ ఆడటానికి బదులు దేశ ప్రజల ఫీలింగ్స్‌తో ఆడుకుంటున్నారని ఆరోపించింది.

ఎవరీ సెహర్‌ షిన్వారి?

సెహరి షిన్వారి పాక్‌లోని సింధు ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌లో జన్మించింది. షిన్వారి తెగకు చెందిన ఈమె నటిగా రాణిస్తోంది. సెహరి నటన వైపు వెళ్తానంటే తొలుత కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అయినా పట్టువిడవకుండా తన కలను సాకారం చేసుకుంది. 2014లో కామెడీ సీరియల్ ‘‘సైర్ సావా సైర్‌’’ ద్వారా అరంగేట్రం చేసింది.

బంగ్లాదేశీయులపై పాక్‌ ఆగడాలు

ప్రస్తుత బంగ్లాదేశ్‌ను 1947 నుంచి 1971 వరకు తూర్పు పాకిస్థాన్‌గా పేర్కొనేవారు. అప్పట్లో పాక్‌ పాలకులు వీరిపై అనేక రకాల హింసకు పాల్పడేవారు. ఈ హింసను భరించలేకే 1971లో ప్రజాఉద్యమం ప్రారంభమైంది. పాక్‌ సైన్యం వేలాదిమందిని కాల్చివేయడంతో లక్షలాదిమంది ప్రజలు భారత్‌కు తరలివచ్చారు. ఈ పరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సారథ్యంలోని కేంద్రం యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో పాక్‌ ఓడిపోయింది. తూర్పు పాకిస్థాన్‌ అనే ప్రాంతం బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించింది. మన దేశానికి వేలాది మంది సైనికుల బలిదానంతో బంగ్లాదేశ్‌ ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని