Ravi Shastri on Asia Cup Team: ఆసియా కప్‌.. తుది జట్టులో మాత్రం అతడు వద్దు: రవిశాస్త్రి

ఆసియా కప్‌ కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సిద్ధమవుతుండగా.. భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ ఆటగాడి విషయంలో జాగ్రత్త నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నాడు.

Published : 16 Aug 2023 14:39 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) సమరం మరో 50 రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే, అంతకుముందే ఆసియా కప్‌లో (Asia Cup 2023) తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఆగస్ట్ 30న మినీ టోర్నీ ప్రారంభం కానుండగా.. టీమ్‌ఇండియా (Team India) మాత్రం పాకిస్థాన్‌తో (IND vs PAk) సెప్టెంబర్ 2న తలపడనుంది. భారత్ మాత్రం ఇంకా జట్టును ప్రకటించలేదు. నాలుగో స్థానంలో ఆడే ఆటగాడు ఎవరా..? అనేది ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. గాయాల నుంచి కోలుకుని పునరాగమనం చేయనున్న శ్రేయస్‌ అయ్యర్, కేఎల్ రాహుల్‌లో ఒకరు ఈ స్థానంలోనే బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మాత్రం కేఎల్ రాహుల్‌ తుది జట్టులో ఉండకపోవచ్చని వ్యాఖ్యానించాడు. గాయం నుంచి కోలుకుని వచ్చాక కుదురుకుని ఆడటం కష్టమని పేర్కొన్నాడు. 

మధ్యలోనే ఐపీఎల్‌ భారీ కాంట్రాక్ట్‌ను వదిలేసిన అక్షయ్‌.. ఎందుకో తెలుసా?

‘‘గాయం నుంచి కోలుకుని వచ్చిన ఆటగాడి (కేఎల్ రాహుల్) గురించి ఎక్కువగా అంచనా వేయకూడదు. ఆసియా కప్‌ టోర్నీలో తుది జట్టులో రాహుల్ ఆడతాడని నేను భావించడంలేదు. అతడి నుంచి మరీ ఎక్కువగా ఆశించకూడదు. గాయాల నుంచి కోలుకుని వచ్చిన వారు మునుపటి వేగంగా ఆడలేరు. అందుకే, రాహుల్ విషయంలో అలా చెప్పగలుతున్నా. ఇప్పుడు భారత్ ఎదుట ఉన్న సమస్య నాలుగో స్థానంలో ఎవరు ఆడతారు?దానికి సరైన ప్రత్యామ్నాయం విరాట్ కోహ్లీనే. అతడికి మంచి రికార్డు కూడా ఉంది. 2019 వరల్డ్‌ కప్ సందర్భంగానూ అప్పటి చీఫ్‌ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్‌తో ఇదే విషయంపై చర్చించా’’ అని రవిశాస్త్రి విశ్లేషించాడు. ఒకవేళ రవిశాస్త్రి చెప్పినట్లు విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో వస్తే... వన్‌డౌన్‌లో శుభ్‌మన్‌ గిల్ ఆడితే ఉత్తమం. రోహిత్ శర్మకు తోడుగా ఇషాన్‌ కిషన్‌ లేదా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించినా ఆశ్చర్యపడక్కర్లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు