IND vs PAK: మా జట్టుకు బెదిరింపులు వచ్చాయి.. అయినా అప్పుడు మేం వచ్చాం: అఫ్రిది

భారత్ - పాకిస్థాన్‌ (IND vs PAK) మధ్య ఆసియా కప్‌ నిర్వహణకు సంబంధించిన అంశం ఎటూ తేలలేదు. తాజాగా దీనిపై పాక్‌ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందించాడు.

Published : 21 Mar 2023 14:19 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ 2023 (Asia Cup 2023) వేదికపై సందిగ్ధత కొనసాగుతోంది. తటస్థ వేదికపై ఆడేందుకు బీసీసీఐ (BCCI) ఆసక్తి చూపుతుండగా.. తమ దేశంలోనే టోర్నీని నిర్వహిస్తామని పాక్‌ కూడా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. అయితే, ఆసియా క్రికెట్‌ కౌన్సిల్ (ACC) మాత్రం తుది నిర్ణయం వెలువరించలేదు. నిర్వహిస్తే పాక్‌లో పెట్టాలని లేకపోతే శ్రీలంకలోనైనా టోర్నమెంట్‌ను నిర్వహించాలని మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌ సూచించాడు. మరోవైపు పీసీబీ మాజీ ఛైర్మన్‌ రమీజ్ రజా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికను తరలించకూడదని చెప్పాడు. ఈ క్రమంలో పాక్‌ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాత్రం  కీలక విషయాలను గుర్తుచేశాడు. గతంలో తమ జట్టుకూ ఓ భారత అభిమాని నుంచి బెదిరింపులు వచ్చినా.. తాము వెనకడుగు వేయలేదని చెప్పాడు.

‘‘ఆసియా కప్‌ టోర్నీకి ఎవరు రావొద్దన్నారు..? భారత్‌ వద్దనుకుంది. ఆసియా కప్‌ కోసం టీమ్‌ఇండియా రావాలని భావిస్తే మేం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. మీరు భారత జట్టును పంపండి. వారిని సాదరంగా ఆహ్వానిస్తాం. ఎలాంటి ఇబ్బంది ఉండదు. గతంలో మా జట్టుకు కూడా బెదిరింపులు వచ్చాయి. తమ దేశంలోకి అనుమతించేదిలేదని ముంబయి నుంచి ఓ అభిమాని హెచ్చరించాడు. అయితే, వాటన్నింటినీ పక్కన పెట్టేసి మరీ బాధ్యతగా వ్యవహరించిన మా ప్రభుత్వం టీమ్‌ను భారత్‌కు పంపించింది. మేం వచ్చి ఆడాం. బెదిరింపులు అనేవి మా మధ్య సంబంధాలను నాశనం చేయలేవు’’ అని అఫ్రిది తెలిపాడు. 

2005లో పాకిస్థాన్‌ జట్టు భారత్‌ పర్యటనకు వచ్చింది. అప్పుడు అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయని అఫ్రిది వెల్లడించాడు. ‘‘పాకిస్థాన్‌కు భారత్‌ జట్టు వస్తే అద్భుతంగా ఉంటుంది. దీనివల్ల క్రికెట్‌లో ముందడుగు పడేందుకు సాయపడుతుంది. ఇదేమీ తరతరాల యుద్ధం కాదు. ఉత్తమ సంబంధాలు ఉండాలని మేం కోరుకుంటున్నాం. గతంలో మా జట్టు భారత్‌కు వచ్చినప్పుడు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. 2005 సీజన్‌లో సిరీస్‌ కోసం భారత్‌లో పర్యటించాం. హర్భజన్‌, యువరాజ్‌తో కలిసి షాపింగ్‌, హోటళ్లకు వెళ్లడం బాగుంది. ఎవరూ కూడా డబ్బులు అడగలేదు. ఇదే రెండు దేశాల మధ్య ఉన్న చక్కని సంబంధాలకు నిర్వచనం’’ అని షాహిద్‌ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని