Asia Cup 2023 : జట్టు ఎంపికపై వివాదాలు సృష్టించడం ఆపండి.. : హెచ్చరించిన గావస్కర్‌

ఆసియా కప్‌ కోసం(Asia Cup 2023) టీమ్‌ఇండియా ఎంపికలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిపై ఘాటుగా సమాధానమిచ్చారు మాజీ దిగ్గజం గావస్కర్‌ (Sunil Gavaskar)

Updated : 22 Aug 2023 12:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఆసియా కప్‌ కోసం (Asia Cup 2023) టీమ్‌ఇండియా (Team India) జట్టును నిన్న బీసీసీఐ (BCCI) ప్రకటించింది. రోహిత్‌ సారథ్యంలో 17 మందితో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. అయితే.. స్పిన్నర్లు చాహల్‌ (Yuzvendra Chahal), అశ్విన్‌ (Ravichandran Ashwin)కు ఇందులో చోటు దక్కకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలపై మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) మండిపడ్డారు. విమర్శలతో వివాదాలు సృష్టించే బదులు.. జట్టుకు మద్దతుగా నిలవాలని సూచించాడు.

‘అవును.. కొంత మంది ఆటగాళ్లు అదృష్టవంతులే. అయితే.. జట్టు సెలక్షన్‌ జరిగిపోయింది. అశ్విన్‌ గురించి మాట్లాడకండి. వివాదాలు సృష్టించడం ఆపండి. ఇది మన జట్టు. మీకు ఎంపిక నచ్చకపోతే.. మ్యాచ్‌లను చూడకండి. అంతే కానీ.. అతడిని తీసుకోండి.. ఇతడిని ఎందుకు తీసుకున్నారు..? లాంటి చర్చ వద్దు. ఇది తప్పుడు ఆలోచనా ధోరణి’ అంటూ గావస్కర్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ ఘాటుగా స్పందించాడు.

మనోడు ఎక్కడిదాకా?

గావస్కర్‌ వ్యాఖ్యలను పలువురు స్వాగతించారు. బాగా చెప్పారని కొనియాడారు. ఇక చాహల్‌ను తొలగించడంపై గావస్కర్‌ విశ్లేషించాడు. ‘కొన్నిసార్లు జట్టులో సమతుల్యత ముఖ్యం. లోయర్‌ ఆర్డర్‌లో కుల్‌దీప్‌ బ్యాటింగ్‌ కూడా చేస్తాడు. చాహల్‌ కంటే కుల్‌దీప్‌ వైపు మొగ్గు చూపడానికి ఇదే కారణమై ఉండొచ్చు’ అని వివరించాడు.

అందుకే చాహల్‌ మిస్‌ అయ్యాడు..

చాహల్‌ను తీసుకోకపోవడంపై సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ అగార్కర్‌ కూడా వివరణ ఇచ్చాడు. జట్టులో సమతూకం తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ‘చాహల్‌ గురించి చర్చించాం. అయితే.. జట్టు సమతూకం కూడా ముఖ్యమే. కుల్‌దీప్‌ రాణిస్తున్నాడు. అక్షర్‌ ప్రదర్శన బాగుంది. కానీ.. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లను జట్టులోకి తీసుకోవడం కష్టం. అందుకే చాహల్‌ మిస్‌ అయ్యాడు’ అని తెలిపాడు.

ఇక ఆసియా కప్‌ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుండగా.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ (PAK vs IND)తో భారత్‌ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 2న ఉండనుంది.

భారత్‌ జట్టు: 

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, సంజు శాంసన్‌ (రాహుల్‌కు బ్యాకప్‌).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని