T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024.. యూఎస్‌ఏలో మూడు వేదికలు ఖరారు

వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) యూఎస్ఏ వేదికలను ఐసీసీ ఖరారు చేసింది. మూడు మైదానాల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

Updated : 20 Sep 2023 15:43 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) టోర్నీకి వెస్టిండీస్-యూఎస్‌ఏ సంయుక్తంగా అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) యూఎస్‌ఏలోని వేదికలను ఖరారు చేసింది. అమెరికాలోని మూడు మైదానాల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. డల్లాస్‌లోని గ్రాండ్‌ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ, న్యూయార్క్‌లోని నసౌ కౌంటీ స్టేడియాలను ఐసీసీ ఖరారు చేసింది. 

అత్యాధునిక సౌకర్యాలు.. 

ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన క్రికెట్ స్టేడియాల్లో మాడ్యూలర్ విధానంలో సౌకర్యాలను కల్పించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నసౌ కౌంటీ స్టేడియంలో 34 వేల సీటింగ్ కెపాసిటీతో నిర్మించేందుకు ఇప్పటికే మాడ్యూలర్‌ స్టేడియం సొల్యూషన్స్‌తో అగ్రిమెంట్ చేసుకుంది. అలాగే మిగిలిన రెండు మైదానాల్లోనూ సీటింగ్‌ను పెంచడం, ఇతర ఆతిథ్య వసతులను సమకూర్చేందుకూ ఒప్పందం చేసుకున్నట్లు  ఐసీసీ పేర్కొంది. 

‘‘యూఎస్‌ఏలో మూడు వేదికలను ప్రకటించడం ఆనందంగా ఉంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలో అమెరికా భాగం కానుంది. వివిధ దశలో దాదాపు 20 దేశాలు కప్‌ కోసం తలపడనున్నాయి. వ్యూహాత్మకంగా క్రికెట్‌ విస్తరణకు యూఎస్‌ఏ అత్యంత కీలకమైంది. ప్రపంచ క్రీడా మార్కెట్‌లో క్రికెట్‌ గొప్ప స్థానానికి చేరే అద్భుత అవకాశం ఇది’’ అని ఐసీసీ సీఈవో జెఫ్‌ అల్డారిస్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని