Shubman Gill: రెండో మ్యాచ్‌కూ గిల్‌ దూరం.. వెల్లడించిన బీసీసీఐ

అనారోగ్యంతో బాధపడుతున్న స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill).. ఈ ప్రపంచకప్‌లో  రెండో మ్యాచ్‌కూ అందుబాటులో ఉండటం లేదు.

Published : 09 Oct 2023 16:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : వన్డే ప్రపంచకప్‌ వేటను విజయంతో ఆరంభించింది టీమ్‌ఇండియా. ఆస్ట్రేలియాతో జరిగిన తన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్.. అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. అయితే.. డెంగీ జ్వరం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill).. రెండో మ్యాచ్‌కూ దురం కానున్నాడు. దిల్లీ వేదికగా బుధవారం (అక్టోబర్‌ 11న) అఫ్గాన్‌తో జరిగే మ్యాచ్‌కు గిల్‌ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. గిల్‌ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ట్విటర్‌లో స్పందించింది. అతడు అక్టోబర్‌ 9న భారత్‌ జట్టుతోపాటు దిల్లీకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. గిల్‌ చెన్నైలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు పేర్కొంది.

ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌కు గిల్‌ దూరమవడంతో.. రోహిత్‌తో కలిసి ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌ చేశాడు. అయితే.. రోహిత్‌, ఇషాన్‌, శ్రేయస్‌ ముగ్గురూ సున్నాకే ఔట్‌ కావడంతో భారత్‌ ఆదిలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ క్లిష్ట పరిస్థితులను అధిగమించి.. సమయోచితంగా ఆడుతూ జట్టుకు విజయాన్నందించారు. 

గిల్‌ లేకపోవడంతో రెండో మ్యాచ్‌లోనూ రోహిత్‌తో ఇషాన్‌ కిషనే ఓపెనింగ్‌ చేసే అవకాశాలున్నాయి. తొలి మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచిన వీరు రెండో మ్యాచ్‌లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఈ నెల 14న అహ్మదాబాద్‌ వేదికగా జరిగే మ్యాచ్‌కు గిల్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని