Kane Williamson: కివీస్‌కు షాక్‌.. ప్రపంచకప్‌ టోర్నీకి కేన్‌ విలియమ్సన్‌ కష్టమే..!

ఐపీఎల్‌ టోర్నీ మొత్తానికి దూరమైన న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamson).. వన్డే ప్రపంచకప్ టోర్నీకి అందుబాటులో ఉండే అవకాశాలు కన్పించట్లేదు. మోకాలి గాయం కారణంగా అతడికి త్వరలో సర్జరీ చేయనున్నారు.

Published : 06 Apr 2023 10:31 IST

వెల్లింగ్టన్‌: వన్డే ప్రపంచకప్ (ODI World Cup) టోర్నీకి ముందు న్యూజిలాండ్‌ (New Zealand) జట్టుకు గట్టి షాకే తగిలింది. ఐపీఎల్‌ మ్యాచ్‌లో గాయపడిన కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamson)కు శస్త్రచికిత్స తప్పనిసరి అని వైద్యులు తెలిపారు. దీంతో వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి అతడు దూరమయ్యే అవకాశాలున్నాయి.

ఐపీఎల్‌ సీజన్‌ 16 తొలి మ్యాచ్‌లో కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamson) గాయపడిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుతో జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు కేన్‌ కాలికి తీవ్రంగా గాయమైంది. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ తర్వాత బ్యాటింగ్‌ కూడా చేయలేదు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి అతడికి విశ్రాంతి అవసరమని వైద్యబృందం సూచించింది. దీంతో ఈ ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి అతడు దూరమయ్యాడు.

గాయం తర్వాత న్యూజిలాండ్‌ (New Zealand) చేరుకున్న కేన్‌ (Kane Williamson)కు మరోసారి వైద్య పరీక్షలు చేశారు. అతడి కుడి మోకాలి లిగ్మెంట్‌లో చీలిక పడిందని.. శస్త్రచికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. వచ్చే మూడు వారాల్లో అతడికి సర్జరీ జరగనున్నట్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో భారత్ వేదికగా ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో జరిగే ప్రపంచకప్‌ (ODI World Cup) టోర్నీకి అతడు అందుబాటులో ఉండే అవకాశాలు కన్పించట్లేదు. దీనిపై న్యూజిలాండ్‌ కోచ్‌ గేరీ స్టీడ్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్‌ ప్రారంభమయ్యేలోపు విలియమ్సన్‌ మళ్లీ ఫిట్‌గా మారడం చాలా కష్టమే. అయితే మేం నమ్మకాన్ని వీడట్లేదు. అతడు త్వరగా కోలుకుని మైదానంలోకి రావాలనుకుంటున్నాం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థతి కన్పించట్లేదు’’ అని తెలిపాడు. మరోవైపు, గాయంపై కేన్‌ స్పందిస్తూ.. ‘‘ఇలాంటి గాయాలు తీవ్ర నిరాశను కలిగిస్తాయి. అయితే సర్జరీ తర్వాత వేగంగా కోలుకోవడంపైనే నేను దృష్టిపెట్టాను. వీలైనంత త్వరగా మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను’’ అని చెప్పాడు.

న్యూజిలాండ్‌ (New Zealand) కెప్టెన్‌ అయిన కేన్‌.. ఆ జట్టులో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌. 2019 ప్రపంచకప్‌ (ODI World Cup)లో ఆ జట్టును సెమీస్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించడమే గాక, ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ఆ ప్రపంచకప్‌ టోర్నీలో తృటిలో కప్పును చేజార్చుకున్న కివీస్‌కు.. ఇప్పుడు కేన్‌ దూరమవడం గట్టి ఎదురుదెబ్బే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని