గూగుల్ కొత్త పాలసీ..ఏం చేయాలో తెలుసా..

కొద్దిరోజుల క్రితం గూగుల్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌కు సంబంధించిన విదివిధానాల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. 2021 జూన్‌ 1 తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు తెలిపింది. దీంతో యూజర్స్‌లో ఒక్కసారిగా గూగుల్ ఉచితంగా అందించే క్లౌడ్‌ స్టోరేజ్‌పై చర్చ మొదలైంది...

Updated : 01 Jan 2021 11:34 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కొద్దిరోజుల క్రితం గూగుల్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌కు సంబంధించిన విదివిధానాల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. 2021 జూన్‌ 1 తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు తెలిపింది. దీంతో యూజర్స్‌లో ఒక్కసారిగా గూగుల్ ఉచితంగా అందించే క్లౌడ్‌ స్టోరేజ్‌పై చర్చ మొదలైంది. ఈ నిర్ణయం ఎక్కువగా గూగుల్ ఫొటోస్‌పైనే ప్రభావం చూపనుంది. ఎందుకంటే ఇన్నాళ్లుగా గూగుల్‌ ఫొటోస్‌లో ఉచిత అన్‌లిమిటెడ్‌ స్టోరేజ్‌ని గూగుల్‌ అందిస్తోంది. తాజా నిర్ణయంతో 15జీబీ స్టోరేజ్‌ మాత్రమే యూజర్స్‌ ఉచితంగా పొందనున్నారు. 

గూగుల్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రతి రోజు ఎక్కువ మంది యూజర్స్‌ తమ డేటాను నిక్షిప్తం చేసేందుకు క్లౌడ్‌ స్టోరేజ్‌ను ఉపయోగిస్తున్నారట. సుమారుగా 4.3 మిలియన్‌ జీబీ డేటాను యూజర్స్‌ ప్రతి రోజూ గూగుల్ డ్రైవ్‌, గూగుల్ ఫొటోస్‌, జీమెయిల్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌లలో సేవ్‌ చేస్తున్నారట. ప్రస్తుతం క్లౌడ్‌ స్టోరేజ్‌ వినియోగానికి డిమాండ్ పెరుతుందనేందుకు ఇదే ఉదాహరణ అని గూగుల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రతి యూజర్‌కి మెరుగైన క్లౌడ్‌ సేవలు అందించేందుకు తమ క్లౌడ్‌ స్టోరేజ్‌ విదివిధానాల్లో మార్పులు చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. మరి గూగుల్ తాజా నిర్ణయం వల్ల యూజర్స్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుంది..ఒక వేళ క్లౌడ్‌ స్టోరేజ్‌ పరిమితికి మించితే ఏం చేయాలి వంటి సందేహాలకు సమాధానం కావాలంటే వీటిపై ఓ లుక్కేయండి..

అసలేంటి గూగుల్ కొత్త పాలసీ..

సాధారణంగా జీ మెయిల్ ఖాతా తెరిచినప్పుడు గూగుల్ 15జీబీ క్లౌడ్ స్టోరేజ్‌ ఉచితంగా కేటాయిస్తుంది. ఇందులో జీమెయిల్‌, డ్రైవ్‌, ఫొటోస్‌ నుంచి ఫైల్స్‌ని సేవ్‌ చేసుకోవచ్చు. అయితే ఇందులో గూగుల్ డాక్స్‌, గూగుల్‌ షీట్స్‌తో పాటు గూగుల్ సూట్‌లోని ఇతర  యాప్స్‌ నుంచి స్టోర్‌ అయిన డేటాను కూడా 15జీబీలో భాగంగా పరిగణనలోకి తీసుకుంటుంది. కానీ, గూగుల్ ఫొటోస్‌ నుంచి స్టోర్‌ అయిన ఎక్కువ క్వాలిటీ కలిగిన ఫొటోలు, వీడియోలను క్లౌడ్‌ స్టోరేజ్‌లో భాగంగా పరిగణించదు. దీని వల్ల గూగుల్ ఫొటోస్‌లో క్లౌడ్ స్టోరేజ్‌ని యూజర్స్‌ ఉచితంగా పొందేవారు. అయితే 2021 జూన్ 1 తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనతో గూగుల్‌ ఫొటోస్‌లో యూజర్స్‌ స్టోర్‌ చేసే ఫొటోలు, వీడియోలను కూడా 15జీబీ క్లౌడ్ స్టోరేజ్‌లో భాగంగా పరిగణించనుంది. దీని వల్ల యూజర్స్‌ ఇన్నాళ్లు పొందిన ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ 15జీబీకి పరిమితం కానుంది. దీంతో యూజర్స్‌ గూగుల్‌ అన్ని అప్లికేషన్స్‌కి కలిపి 15జీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ని మాత్రమే ఉచితంగా పొందనున్నారు. 

దీని వల్ల యూజర్స్‌ ఏం కోల్పోతారు..

గూగుల్ తాజా నిర్ణయం ఫొటోస్‌ అప్లికేషన్‌ యూజర్స్‌పై ఎక్కువ ప్రభావం చూపనుంది. ఇన్ని రోజులు ఉచితంగా పొందిన సేవలను ఇక మీదట నెలవారి లేదా ఏడాది పాటు చందా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన 2021 జూన్‌ 1 తేదీ నుంచి అమల్లోకి రానుంది. సాధారణంగా ఫొటోలు, వీడియోలు ఎక్కువ మెమొరీని ఆక్రమిస్తాయనే విషయం తెలిసిందే. దీంతో గూగుల్ విధించిన 15జీబీ ఉచిత స్టోరేజ్‌ పరిమితి దాటితే ఎక్కువ మెమొరీ కోసం యూజర్స్‌ నగదు చెల్లించాలి లేదా స్టోరేజ్‌ పరిమితి దాటకుండా చూసుకోవాలి. అయితే 2021 జూన్‌ 1 తేదీ వరకు స్టోర్‌ చేసుకున్న యూజర్స్‌పై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదట. అంటే  2021 మే 31 వరకు యూజర్స్‌ గూగుల్ ఫొటోస్‌లో స్టోర్ చేసుకునే వారికి ఈ నిబంధన వర్తించదన్నమాట. 

ఈ నిబంధన నుంచి ఎవరికి మినహాయింపు

గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్‌ నుంచి క్లౌడ్‌ స్టోరేజ్‌లోకి సేవ్ చేసుకునే ఫొటోలు, వీడియోలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. అలానే 2021 జూన్‌ 1 తేదీ తర్వాత గతంలో స్టోర్‌ చేసిన డాక్యుమెంట్స్‌ ఎడిట్ చేసి తిరిగి స్టోర్‌ చేసినా వాటికి కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ఒక వేళ గూగుల్ యూజర్స్‌ ఎవరైనా తమ ఫొటోలు, వీడియోలను క్లౌడ్‌ స్టోరేజ్‌లో సేవ్‌ చేసుకోవాలంటే 2021 మే 31 తేదీలోపు ఆ పని చెయ్యొచ్చు. 

ఇంకా గూగుల్ ఏం చెయ్యనుందంటే..

కొత్త నిబంధన అమల్లోకి వచ్చాక గూగుల్ నుంచి క్లౌడ్ స్టోరేజ్‌ సబ్‌స్క్రైబ్ చేసుకున్న యూజర్స్‌ రెండు సంవత్సరాల వరకు ఏదైనా గూగుల్ సూట్‌లోని అప్లికేషన్స్‌లో లాగిన్‌ కాకుంటే సదరు అప్లికేషన్‌లోని డేటాను గూగుల్ డిలీట్ చేస్తుందట. అయితే సదరు డేటా తొలగించే ముందు యూజర్‌కి గూగుల్ ఒకటి కంటే ఎక్కువ సార్లు సమాచారాన్ని అందిస్తుంది. ఒక వేళ ఎప్పటికీ యూజర్‌ స్పందిచకుంటే డేటాను తొలగిస్తుంది. మరి డేటా డిలీట్ కాకుండా ఉండాలంటే రెండు సంవత్సరాలకొకసారి ప్రతి గూగుల్ అప్లికేషన్‌లో లాగిన్ అయితే సరిపోతుంది. 

ఒక వేళ గడువులోపు స్టోరేజ్‌ పరిమితి దాటితే..

2021 జూన్‌ 1 తేదీలోపు 15జీబీ పరిమితి దాటిన యూజర్స్‌కి స్టోరేజ్‌ మేనేజ్‌మెంట్ టూల్స్‌ని గూగుల్ అందిస్తుంది. గూగుల్‌ వన్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్ ద్వారా ఏయే కేటగిరీకి (ఫొటోస్‌, డ్రైవ్, జీమెయిల్‌) ఎంత మెమొరీ ఆక్రమించిందనేది ఇందులో చూసిస్తుంది. దాని ద్వారా అవసరం లేని ఫైల్స్‌ని సులభంగా డిలీట్‌ చేసుకోవచ్చు. అలానే 15జీబీ స్టోరేజ్‌ని మేనేజ్‌ చేసుకోవచ్చు. ఒక వేళ ఎక్కువ స్టోరేజ్‌ కావాలనుకునేవారు నెలవారీ చందా చెల్లించి స్టోరేజ్‌ కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు 100జీబీ స్టోరేజ్‌కి నెలకు రూ. 130..ఏడాది సబ్‌స్క్రిప్షన్‌కి రూ. 1,300 చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ మీ డేటాను గూగుల్ నుంచి తీసుకోవాలనుకుంటే గూగుల్ టేక్‌అవుట్ ద్వారా పొందొచ్చు. 

ఇవీ చదవండి..

గూగుల్‌ ఫొటోస్‌లో ఎడిటర్‌ ఫీచర్‌

గూగుల్‌ ఫొటోస్‌లో డేటా ఎలా సేకరించాలంటే..?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని